Hyderabad Metro Phase2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2- మళ్లీ మొదటికొచ్చిన సమస్య, ఆ విషయంపై మెట్రో అధికారులు అభ్యంతరం
Hyderabad News | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్టులో డబుల్ ఎలివేటెడ్ కారిడార్లపై సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. మెట్రో అధికారులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad Metro Rail Project | హైదరాబాద్: నగరంలో మెట్రో విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో భాగంగా డబుల్ ఎలివేటెడ్ కారిడార్లు సైతం నిర్మించాల్సి ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ అంత ఈజీ కాదని, నాణ్యతాపరమైన సమస్యలు వస్తాయని మెట్రో అధికారులు భావిస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని విప్రో రూట్ లో డబుల్ ఎలివేటెడ్ కారిడార్లపై అధికారుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. డబుల్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేయాలంటే మెట్రో స్టేషన్ల ఎత్తు 65 అడుగుల వరకు వెళుతుంది. తద్వారా నిర్వహణపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మెట్రో అధికారులు దీనిపై అభ్యంతరం చెసినట్లు సమాచారం. మరోవైపు ఫ్యూచర్ సిటీ, శామీర్‌పేట్, మేడ్చల్ మార్గాల డీపీఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరుకు ప్రాజెక్టు టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు.
మెట్రోరైలు భవన్‌లో అధికారుల కీలక సమావేశం
డబుల్ ఎలివేటెడ్ కారిడార్లతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో ప్రత్యామ్నాయ మార్గాలపై బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం సమావేశమై చర్చించారు. దేశంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో డబుల్ ఎలివేటెడ్ మెట్రో కారిడార్లు నిర్మించారు. అక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లో రోడ్డు మార్గం, సెకండ్ ఫ్లోర్‌లో మెట్రో రైలు ట్రాక్ ఉంటాయని తెలిసిందే. కానీ డబుల్ ఎలివేటెడ్ కారిడార్ అంత బాగోలేదని నాగ్‌పూర్ మెట్రో రైలు ప్రాజెక్టును పరిశీలించిన హైదరాబాద్ మెట్రో అధికారులు అంటున్నారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం సందర్భంగా డబుల్ ఎలివేటెడ్ కారిడార్ల అంశంపై చర్చ జరిగింది. ఇరు సంస్థలు కలిసి దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మెట్రోరైలు అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు తాము ఇంటర్నల్‌గా సంబంధిత అధికారులు, నిపుణులతో చర్చించిన అనంతరం శుక్రవారం (ఫిబ్రవరి 21న) మెట్రోరైలు భవన్‌లో సమావేశమయ్యారు. విప్రో మార్గంలో డబుల్ ఎలివేటెడ్ కారిడార్ పై వేరే ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు.
మెట్రోరైలు కారిడార్ డీపీఆర్ రెడీ..
మెట్రో రైలు, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం కొరవడి సమస్యకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రాయదుర్గం (Raidurg metro station) నుంచి విప్రో సర్కిల్ మీదుగా కోకాపేట నియోపొలిస్ వరకు మెట్రోరైలు కారిడార్ (Hyderabad Metro Corridors)ను ప్రతిపాదించారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి మెట్రో పేజ్ 2 డీపీఆర్ సైతం పంపడం తెలిసిందే. అయితే విప్రో సర్కిల్‌లో ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లైఓవర్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ డీపీఆర్ సైతం సిద్ధం చేసింది.
గత ఏడాది నుంచి అటు మెట్రో అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు సపరేట్‌గా డీపీఆర్, ప్రాజెక్టుకు సంబంధించి నివేదికలు తయారు చేశారు. కానీ ప్రాజెక్టుకు ఎంతో ముఖ్యమైన డీపీఆర్ స్టేజీలోనే మెట్రో, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పని చేసింటే ఇప్పుడు డబుల్ ఎలివేటెడ్ కారిడార్ లాంటి సమస్యలు, డిజైన్ల మార్పుతో కాలాయాపన జరిగేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






















