(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
Hyderabad Metro Rail Phase II project | తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్లు మెట్రో నిర్మించనున్నారు.
Telangana government approved Hyderabad Metro Rail Phase II project | హైదరాబాద్: నగరంలో మెట్రోరైలు రెండో దశ పనులకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ ప్రాజెక్టులో భాగంగా 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్లు (పార్ట్–ఏ కింద)ను నిర్మించనున్నారు. పార్ట్–బీలో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (Skills University) వరకు కారిడార్ 6ను నిర్మించనున్నారు. రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రెండో దశ నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతి తెలుపుతూ ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనుండగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,313 కోట్లుగా ఉంది.
మెట్రో రెండో దశ పార్ట్-Aలో 5 కారిడార్ల నిర్మాణం
హైదరాబాద్ మెట్రో కారిడార్ 4 - నాగోలు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు (36.8 కి.మీ) ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు
హైదరాబాద్ మెట్రో కారిడార్ 5 - రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ) ఈ మార్గంలో 8 స్టేషన్లు
హైదరాబాద్ మెట్రో కారిడార్ 6 - ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ) ఈ మార్గంలో 6 పూర్తి ఎలివేటెడ్ స్టేషన్లు
హైదరాబాద్ మెట్రో కారిడార్ 7 - మియాపూర్ నుంచి పటాన్‌చెరు (13.4 కి.మీ) ఈ మార్గంలో దాదాపు 10 స్టేషన్లతో ఎలివేటెడ్ కారిడార్
హైదరాబాద్ మెట్రో కారిడార్ 8 - ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ (7.1 కి.మీ) ఈ మార్గంలో 6 స్టేషన్లు
మెట్రో రైలు రెండో దశ పార్ట్-బి
హైదరాబాద్ మెట్రో కారిడార్ 9 - శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు
జాయింట్ వెంచర్‌గా మెట్రో ఫేజ్ 2 నిర్మాణం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్ గా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి దశలో నిర్మించిన 69 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రోరైలు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు అని తెలిసిందే. మొదటి దశలో మూడు కారిడార్లు ఎంజీబీఎస్ - జేబీఎస్, ఎల్బీనగర్ - మియాపూర్, నాగోల్ - రాయదుర్గ్ నిర్మించారు. ఇప్పుడు ఐదు కారిడార్లతో మరో 76.4 కిలోమీటర్ల మెట్రోరైలు అందుబాటులోకి రానుంది.
మెట్రోరెండో దశకు అంచనా వ్యయం రూ.24,269 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 7,313 కోట్లు (30 శాతం), జపాన్ ఇంటర్నేషన్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇతర ఆర్థిక సంస్థల వాటా రూ.11,693 కోట్లు (48 శాతం), కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4,230 కోట్లు (18 శాతం), మరో 4 శాతం వాటా రూ.1,033 కోట్లను పీపీపీ విధానం ద్వారా నిధులు సమీకరించనున్నారు.
Also Read: Rains in AP, Telangana: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
ఫోర్త్‌సిటీకి మెట్రో
తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీకి సైతం మెట్రో కనెక్టివిటీ తీసుకురానుంది. ఇందుకోసం వినూత్న రీతిలో డీపీఆర్ తయారు చేస్తున్నారు. ఈ ఫోర్త్ సిటీ మెట్రో లైన్ డీపీఆర్ మినహా మిగిలిన 5 కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. అయితే శంషాబాద్ - ఫోర్త్ సిటీకి మెట్రోకు సుమారు రూ.8,000 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు (పార్ట్ ఏ, పార్ట్ బీ)కు దాదాపు రూ.32,237 కోట్లు వ్యయం అవుతుంది. డీపీఆర్ రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పురపాలక శాఖ అధికారులతో సమీక్షించారు. మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్–చెక్ చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి డీపీఆర్‌లను సమర్పించడానికి ఈ అధ్యయనం తప్పనిసరి. ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ ను ఆరాంఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారిలోని కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లేలా ఖరారు చేశారు.