Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
TG Half Day School | తెలంగాణలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీచర్లకు వేరే బాధ్యతలు అప్పగించిన కారణంగా నవంబర్ 6 నుంచి తెలంగాణలో ఒక్కపూట బడులు నిర్వహించనున్నారు.
Half Day School for Telangana Schools | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు మొదలవుతాయి. అదేంటీ.. ప్రతి ఏడాది వేసవికాలంలో ఒక్కపూట బడి ఉంటుంది, ఇప్పుడు చలికాలంలో ఎందుకీ నిర్ణయం అనుకుంటున్నారా. అందుకు ముఖ్యమైన కారణం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే కారణంగా కొన్ని రోజులు తెలంగాణలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఈ సర్వే ప్రక్రియలో టీచర్లను ప్రభుత్వం భాగస్వాములు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిసిందే. టీచర్ల సేవలు వినియోగించుకుని ఇంటింటి సర్వే చేస్తారు. సమగ్ర కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (SGT)ను, 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లను నియమించింది. వీరితో పాటు మరో 8000 మంది సిబ్బంది సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొని వివరాలు సేకరిస్తారు. నవంబర్ 6న రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే మొదలవుతుందని, కనుక ఆరోజు నుంచి ఈ సర్వే పూర్తయ్యేవరకు తెలంగాణలో ఒంటి పూట బడులు నిర్వహణకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది.
ఒంటిపూట బడులు టైమింగ్స్ వివరాలివే..
వేల మంది ఎస్జీటీలు, హెడ్మాస్టర్లు సమగ్ర సర్వే చేయనున్న కారణంగా స్కూళ్లకు విద్యాశాఖ ఒంటిపూట బడులు ప్రకటించింది. నవంబర్ 6వ తేదీ నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు టీచర్లు స్కూళ్లలో పాఠాలు బోధించాలి. స్కూల్ ముగిసిన అనంతరం సమగ్ర సర్వే, కులగణన కోసం ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలి. ప్రభుత్వం 50 ప్రశ్నలకు సమగ్ర సర్వేను చేపట్టనుంది. ప్రతి 150 ఇళ్లకు ఓ అబర్వేషన్ కోసం ఒక పర్యవేక్షణ అధికారి, కులగణన అధికారులను ప్రభుత్వం నియమించింది. సమగ్ర సర్వే కోసం వారికి ప్రత్యేకంగా కిట్లను అందజేశారు. టీచర్లను అదనపు బాధ్యతలు అప్పగించిన కారణంగా.. సమగ్ర పూర్తయ్యే గడువు వరకు ఒక్క పూట స్కూల్ నిర్వహించనున్నారు.
తెలంగాణలో రెండో సారి సమగ్ర కుటుంబ సర్వే
సమగ్ర సర్వేలో కులగణనతో పాటు పలు అంశాలు ప్రభుత్వం దృష్టికి వెళతాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ తొలిసారిగా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. గత డిసెంబర్ లో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రెండోసారి సమగ్ర సర్వేకు శ్రీకారం చుడుతోంది. దీన్ని సమగ్ర కుటుంబర ఆర్థిక, రాజకీయ, సామాజిక, రాజకీయ సర్వేగా వ్యవహరిస్తారు. ఇందులో కుటుంబంలోని వ్యక్తుల వివరాలు, యజమానికి ఉన్న ఆస్తులు, వారి కులం, మతం సహా పలు అంశాలను ప్రశ్నించి టీచర్లు ఒక్కొక్క ఇంటికి వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. దీనిపై పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి.. ఆయా సామాజిక వర్గాల కమిషన్ల పెద్దలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాల్ని సైతం తీసుకున్నారు.