SLBC Tunnel Collapse: కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, సొరంగంలో చిక్కుకున్న 50 కార్మికులు
Crime News : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ లో పైకప్పు కూలడంతో పలువురు కార్మికులు అందులో చిక్కుకున్నారు.

SLBC Tunnel Collapse News Updates | నల్గొండ: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ శ్రీశైలం ఎడమవైపు సొరంగం వద్ద 14వ కిలోమీటర్ నుంచి 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. కొందరు టన్నెల్ లో చిక్కుకుపోయారని సమాచారం. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. నేటి ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఫిబ్రవరి 18న టన్నెల్ తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి.
త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పనులు తిరిగి ప్రారంభించింది. ఎస్‌ఎల్‌బీసీ ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందట మళ్లీ పనులు మొదలయ్యాయి. శనివారం ఉదయం పనులు కొనసాగుతుండగా దోమలపెంట సమీపంలో టన్నెల్ కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాదం జరిగిన టన్నెల్ వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు కథేంటీ..
నల్లగొండ జిల్లాకు సాగునీరు, తాగు నీరు అందించేందుకు ఎస్‌ఎల్‌బీసీ (SLBC Tunnel) సొరంగం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఐదేళ్ల కాలంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లగొండకు కృష్ణా జలాలు 30 టీఎంసీలు తరలించాలని ఈ సొరంగం పనులకు శ్రీకాం చుట్టారు. గతంలో టన్నెల్ బోరింగ్ మిషన్‌తో SLBC సొరంగం తవ్వకాలు చేపట్టగా ఏదో కారణంతో పనులు ఆగుతున్నాయి. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, కొన్నిసార్లు వరదలతో పనులు వాయిదా పడుతూ వచ్చాయి.
ఇన్ లెట్, అవుట్ లెట్ సొరంగాలు కలిపి మొత్తం 44 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా.. 34 కిలోమీటర్ల పనులు పూర్తయయాయి. మిగిలిన 9.5 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ వరకు పనులు పూర్తిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు అంచనా ఖర్చు రూ.4,637కు పెంచగా.. ఇందులో రూ.2646 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ పనులు పూర్తయితే 200 పైగా గ్రామాలకు తాగునీరుతో పాటు 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

