Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Andhra News: అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు పనులకు అనుమతి లభించిందన్నారు.
Minister Narayana Comments On Amaravati Development Works: రాజధాని అమరావతిలో (Amaravati) రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సీఆర్డీఏ అథారిటీ అనుమతించిందని మంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం 23 అంశాల అజెండాగా సాగిన భేటీలో మంత్రి నారాయణ, సీఎస్ నీరభ్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. భేటీ అనంతరం మంత్రి నారాయణ వివరాలు వెల్లడించారు.
సీఆర్డీఏ పరిధిలోని రూ.3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. రూ.2,498 కోట్లతో రహదారి పనులు, రూ.1,508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు చేపట్టనున్నట్లు చెప్పారు. 3 రిజర్వాయర్ల నిర్మాణానికి అనుమతించినట్లు పేర్కొన్నారు. రాజధానిలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు భవనాల నిర్మాణం చేపడతామన్నారు. ఈ నెల 15లోపు 5 ఐకానిక్ టవర్లకు డిజైన్లు వస్తాయని.. ఈ నెలాఖరులోపు అవి ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామని చెప్పారు.
మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఆమోదం
అటు, విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్, విజయవాడ మెట్రో రైల్ మొదటి దశ డీపీఆర్‌లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో మొదటిదశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.4 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రో రైలు ఒకటో కారిడార్‌గా డీపీఆర్‌లో ప్రభుత్వం పేర్కొంది. గురుద్వారా నుంచి పాతపోస్ట్ ఆఫీస్ వరకూ 5.08 కిలోమీటర్ల మేర రెండో కారిడార్.. తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకూ 6.75 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం రూ.11,498 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రెండో దశలో 30.67 కిలోమీటర్ల మేర కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ కారిడార్ నిర్మాణం చేపడతారు.