Third Phase Polling In Lok Sabha Elections 2024: మూడో విడతలో 93 స్థానాలకు పోలింగ్- అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధానమంత్రి
Telugu News: మూడో దశలో 17 కోట్ల మంది 1331 మంది నేతల భవిష్యత్‌ను ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. 94 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ గుజరాత్‌లోని సూరత్ బీజేపీకి ఏకగ్రీవమైంది.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా నేడు మూడో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. ఇప్పటికే రెండు విడదల్లో 189 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ పూర్తైంది. ఇప్పుడు 93 స్థానాలకు మూడో విడత ఓటింగ్ జరుగుతోంది. ఈ మూడో విడత పోలింగ్ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతోంది.
ఓటు వేసిన ప్రధాని
అహ్మదాబాద్‌లోని నిషాన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు అహ్మదాబాద్ వచ్చిన ప్రధానమంత్రిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వాగతం పలికారు. ఆయన గాంధీనగర్ నుంచే పోటీ చేస్తున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi casts his vote for #LokSabhaElections2024 at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat pic.twitter.com/i057pygTkJ
— ANI (@ANI) May 7, 2024
పోలింగ్ అనంతరం జనాలను పలకరిస్తూ ఆయన తన సోదరుడికి ఇంటికి వెళ్లారు. తనను చూడటానికి వచ్చిన వారితో కాసేపు ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.
#WATCH | Prime Minister Narendra Modi shares a light-hearted moment with a child as he greets people after casting his vote at a polling booth in Ahmedabad, Gujarat #LokSabhaElections2024 pic.twitter.com/h1QI7l1dDD
— ANI (@ANI) May 7, 2024
రికార్డులు పగిలేలా ఓట్లు వేయాలి
ఓటు వేయడానికి వెళ్లే ముందు ట్వీట్ చేసిన నరేంద్ర మోదీ ప్రతి పౌరుడు ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గతానికి కంటే భిన్నంగా ఎక్కువ పోలింగ్ జరగాలని ఆకాంక్షించారు. కొత్త రికార్డులు దిశగా పోలింగ్ జరగాలని ప్రజలకు సూచించారు. ప్రతి పౌరుడి భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం మరింత ప్రకాశవంతంగా వెలగాలని అభిప్రాయపడ్డారు.
సూరత్ ఏకగ్రీవం
వాస్తవంగా 94 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ గుజరాత్‌లోని సూరత్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవం చేసుకుంది. అంటే అక్కడ బీజేపీ అభ్యర్థి తప్ప వేరే అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నికల సంఘం దాన్ని ఏకగ్రీవంగా ప్రకటించింది. దీంతో అక్కడ మిగిలిన 25 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలకు
వివిధ రాష్ట్రాల్లో చూసుకుంటే... మూడో దశలో కర్ణాటక రాష్ట్రంలో 14 స్థానాలకు, మహారాష్ట్రలో 11 , ఉత్తర్‌ప్రదేశ్‌లో పది, మధ్యప్రదేశ్‌లో 9, ఛత్తీస్‌గఢ్‌లో ఏడు, బిహార్‌లో ఐదు, అసోం, పశ్చిమబెంగాల్‌లో నాలుగు స్థానాలు చొప్పున, గోవాలో రెండు స్థానాలకు దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో ఒక్కోస్థానానికి ప్రస్తుతం మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.
మూడో దశ వీఐపీలు వీళ్లే
17 కోట్ల మంది ఓటర్లు 1331 మంది నేతల భవిష్యత్‌ను మూడో దశలో ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. మూడో దశలో పోలింగ్ పరీక్ష ఎదుర్కొంటున్న ముఖ్యులు వీళ్లే... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(గాంధీనగర్), కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్(రాజ్‌గఢ్- మధ్యప్రదేశ్), సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్(మెయిన్‌పురి- ఉత్తర్‌ప్రదేశ్), శివరాజ్‌సింగ్ చౌహాన్(విదిషా- మధ్యప్రదేశ్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), సుప్రియా సూలే(బారామతి- మహారాష్ట్ర), ప్రహ్లాద్ జోషి(ధార్వాడ్), నారాయణ్ రాణే(రత్నగిరి) మన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), బసవరాజ్ బొమ్మై(హవేరి- కర్ణాటక), జగదీష్ శెట్టర్(బెల్గాం- కర్ణాటక)
మిగతా షెడ్యూల్ ఇదే
ఇవాళ (07మే2024) పోలింగ్ ముగిసిన తర్వాత మే 13న నాల్గో దశ పోలింగ్ జరగనుంది. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అనంతరం ఐదే దశ మే 20, ఆరో దశ మే 25న ఏడో దశ జూన్ 1న జరగనుంది. అనంతరం జూన్ 4న ఓట్లు లెక్కించి 18వ లోక్‌సభ ఫలితాలు వెల్లడిస్తారు.