Chandrayaan 3: చంద్రుడిపై సూర్యోదయం, విక్రమ్ మళ్లీ నిద్రలేస్తాడా? ఇస్రో ఏం చెబుతోంది?
Chandrayaan 3: చంద్రయాన్-3 వైపు ప్రపంచం మరోమారు ఆసక్తిగా చూస్తోంది. చంద్రుడిపై ప్రస్తుతం స్లీప్ మోడ్‌లో ఉన్న ప్రజ్ఞాన్, విక్రమ్ మళ్లీ మేల్కొని ప్రయోగాలు కొనసాగిస్తాయా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
Chandrayaan 3: చంద్రయాన్-3 వైపు ప్రపంచం మరోమారు ఆసక్తిగా చూస్తోంది. చంద్రుడిపై ప్రస్తుతం స్లీప్ మోడ్‌లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ మళ్లీ మేల్కొని ప్రయోగాలు కొనసాగిస్తాయా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ వాటికి అప్పగించిన పనులు విజయవంతంగా పూర్తిచేశాయి. అయితే చంద్రుడిపై సూర్యాస్తమయం అవడంతో అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల పడిపోయాయి. అయితే బుధవారం సూర్యోదయం కానుంది. విక్రమ్, ప్రజ్ఞాన్ రెండూ సూర్యకాంతి పడగానే మళ్లీ మేల్కొంటాయా? అన్నదానిపై ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆసక్తి నెలకొంది. వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తే మరో 14 రోజులు వాటి సేవలు అందుబాటులోకి వస్తాయి.
చంద్రుని దక్షిణ ధ్రువంపై బుధవారం సూర్యోదయం ప్రారంభమైంది. దీంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన చంద్రయాన్ -3 మిషన్ ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌తో కమ్యూనికేషన్‌ను తిరిగి ఏర్పరచడానికి సిద్ధమవుతోంది. చంద్రుడిపై రాత్రి కారణంగా ల్యాండర్, రోవర్ గత 15 రోజులుగా స్లీప్ మోడ్‌లో ఉన్నాయి. బుధవారం శివశక్తి పాయింట్ వద్ద సూర్యకాంతి రాకతో వాటిని తిరిగి కార్యాచరణలోకి తీసుకురావడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువం చంద్రయాన్-3 దిగిన ప్రాంతంలో సూర్యోదయం జరిగిందని, బ్యాటరీలు రీఛార్జ్ చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని ఇస్రో తెలిపింది. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో మళ్లీ కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ల్యాండర్, రోవర్ పనిచేయడానికి అవసరమైన వేడిని అందజేసే సూర్యోదయం అవసరమని ఇస్రో తెలిపిందది. సెప్టెంబరు 22న కమ్యూనికేషన్ ప్రయత్నాలను ప్రారంభిస్తామని, అయితే అంతకంటే ముందు ఉష్ణోగ్రత ఒక నిర్దిష్ట స్థాయికి మించి పెరిగే వరకు వేచి ఉండాలని ఇస్రో పేర్కొంది. ఇక విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఆగస్టు 23న ల్యాండింగ్ అయినప్పటి నుంచి వివిధ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. చంద్రుని అయానోస్పియర్‌లోని ఎలక్ట్రాన్ సాంద్రతలను కొలిచాయి. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత రీడింగ్‌లను సేకరించాయి. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ మొదటి చిత్రాన్ని తీసింది.
14 రోజుల సుధీర్ఘ పరిశోధనల అనంతరం చంద్రుడిపై సూర్యాస్తమయం అయ్యింది. బ్యాటరీ వాహనాలు నడిచేందుకు సరైన సౌరశక్తి లభించనందున విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచాయి. విక్రమ్ ల్యాండర్‌లో పేలోడ్స్‌గా పంపించిన చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు పేలోడ్స్ అన్నీ ప్రస్తుతం టర్న్ ఆఫ్ మోడ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రోవర్‌కు అమర్చిన రిసీవర్ మాత్రమే స్విచాన్‌లో ఉంది. అది చీకటి రాత్రుల్లో కూడా కూడా పని చేయగలుగుతుంది.
అయితే తాజాగా చంద్రుడిపై సూర్యోదయం అవడంతో ఎలక్ట్రానిక్ యంత్రాలు శీతల పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగితే మరో సారి సంచలనాత్మక అన్వేషణను తిరిగి ప్రారంభించగలదని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో ఇస్రో కమ్యూనికేషన్ ఏర్పరచగలిగితే ఇస్రో చరిత్ర సృష్టించినట్లే. అంతరిక్ష పరిశోధన రంగంలో దాని స్థితిస్థాపకత, సాంకేతిక నైపుణ్యాన్ని కొనసాగిస్తుంది. జూలై 14, 2023న ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ ఇప్పటికే గణనీయమైన మైలురాళ్లను సాధించింది. చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టిన నాల్గో దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి దేశంగా చరిత్ర కెక్కింది.