Chittoor Crime News: లవ్ మ్యారేజ్ చేసుకుందని కూతుర్ని చంపేశారు! చిత్తూరులో పరువుహత్య కలకలం
Love Marriage | తమను కాదని ప్రేమించిన వాడిని మతాంతర వివాహం చేసుకున్న యువతిని ఆమె కుటుంబసభ్యులు హత్య చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. తన భార్యను పంపిస్తే తనకు శవాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Honor Killing In Chittoor | చిత్తూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి పుట్టింట్లో అనుమానాస్పదంగా మృతిచెందింది. మతాంతర వివాహం చేసుకుందని, తమ పరువులు తీసిందని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులే ఆమెను హత్య చేశారని భర్త, అత్తామామలు ఆరోపిస్తున్నారు. తండ్రికి అనారోగ్యం అంటూ ఇంటికి రప్పించి, చివరికి ఆమెను హత్యచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన ఆదివారం జరగగా, సోమవారం విషయం వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే..
పూతలపట్టు మండలానికి చెందిన కోదండరామ్ కుమారుడు సాయి తేజ బీటెక్ పూర్తి చేశాడు. చిత్తూరులోని బాలాజీనగర్ కు చెందిన షౌకత్ అలీ, ముంతాల్ కూతురు యాస్మిన్ బాను ఎంబీఏ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాలుగు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం తరువాత ఇంట్లో పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాయితేజతో వివాహానికి యాస్మిన్ బాను(26) తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. పైగా మతాంతర వివాహం కావడంతో వారి ప్రేమకు యాస్మిన్ బాను తల్లితండ్రులు అడ్డుచెప్పారు.
ఈ క్రమంలో రెండు నెలల క్రితం యాస్మిన్ బాను, సాయితేజ ప్రేమ వివాహం చేసుకున్నారు. యాస్మిన్ బాను తల్లిదండ్రులను ఎదిరించి, ఇంటి నుంచి వెళ్లిపోయి ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకుంది. తమ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు కనుక ప్రాణహాని ఉందని తిరుపతి ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 13న రక్షణ కావాలని ప్రేమ జంట కోరింది. తిరుపతి డీఎస్పీ ఇరుటకుటుంబాలను పిలిచి మాట్లాడారు. యాస్మిన్ బాను తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
ఓవైపు సాయితేజ, యాస్మిన్ బాషా సంసారం సజావుగా సాగుతోంది. మరోవైపు యాస్మిన్ భానుతో కుటుంబసభ్యులు ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆమెతో మాటలు కలుపుతూ.. తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం సరిగా లేదని పదే పదే ఆమెకు ఫోన్లో చెప్పారు. తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని, ఆమెను పంపించాలని సాయి తేజ్ ను యాస్మిన్ బాను కుటుంబ సభ్యులు పదే పదే కోరండంతో అందుకు అంగీకరించాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు యాస్మిన్ భానును భర్త సాయి తేజ్ చిత్తూరుకు తీసుకొచ్చాడు.
యాస్మిన్ బానుని సోదరుడు లాలు కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లిన యాస్మిన్ బాను అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. భార్య కుటుంబసభ్యులకు ఫోన్ చేస్తే కలవడం లేదని, అనుమానం వచ్చి నేరుగా యాస్మిన్ బాను ఇంటికి వెళ్లాడు సాయితేజ. యాస్మిన్ బాను ఆత్మహత్య చేసుకుందని, డెడ్ బాడీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉందని చెప్పడంతో ఆమె భర్త షాకయ్యాడు.
భర్త ఫిర్యాదుతో కేసు నమోదు
గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లిన సాయితేజ భార్య శవాన్ని మార్చురీలో చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. మతాలు వేరని తమ పెళ్లిని వ్యతిరేకించారని, ఇప్పుడు ఏకంగా ఆమెను హత్య చేశారు. ఇంటికి వెళ్లి ఆరాతీస్తే ఆత్మహత్య చేసుకుందని తాపీగా బదులిచ్చారని ఆవేదన వ్యకతం చేశాడు. యాస్మిన్ బాను మృతదేహానికి పోస్టుమార్టం చేపించారు చిత్తూరు టు టౌన్ పోలీసులు. సాయితేజ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం యాస్మిన్ బాను తండ్రి, ఆమె సోదరుడు లాలు పరారీలో ఉన్నారు. త్వరలోనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






















