Bollywood Actor: ఒకప్పుడు రెస్టారెంట్‌లో గిన్నెలు కడిగాడు! - ఈ స్టార్ హీరో నెట్ వర్త్ ఇప్పుడు రూ.2,500 కోట్లు
Actor Akshay Kumar: ఇప్పుడు 2,500 కోట్లకు అధిపతి అయిన ఓ స్టార్ హీరో చిన్నప్పుడు 7వ తరగతి ఫెయిల్ అయ్యాడు. రూ. 150 కోసం కూలీగా పని చేశాడు. రెస్టారెంట్లో గిన్నెలు కూడా కడిగాడు. ఆ హీరో ఎవరో తెలుసా ?

Bollywood Actor Akshay Kumar: విధి విచిత్రం ఎంత వింతగా ఉంటుందంటే... రాజును పేదవాడిని చేయగలదు, అదే అదృష్టం కలిసి వస్తే పేదవాడు రాత్రికి రాత్రే రాజు కాగలదు. ఒకప్పుడు ఒక ట్రావెల్ ఏజెన్సీలో నెలకు రూ.150కి కూలీగా పని చేసిన ఓ నటుడు ఇప్పుడు స్టార్ హీరో. ఆయన బతుకు దెరువు కోసం హోటల్లో వెయిటర్‌గా పనిచేశారు. అయితే ఇవన్నీ చిన్నప్పుడు చేసిన పనులు. ఇప్పుడు మాత్రం ఆయన భారతదేశంలోని అత్యంత ధనవంతుడు, విజయవంతమైన నటుల్లో ఒకరు. అంతేకాదు భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటుల్లో ఆయన పేరు కూడా ఉంటుంది. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.
ఒకే గదిలో 24 మంది నిద్ర...
పొట్టకూటి కోసం చిన్నా చితకా ఉద్యోగం చేయడం నుంచి బాలీవుడ్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం అన్నది అంత సులభమేమీ కాదు. కానీ ఎన్నో ఏళ్ల కృషి, దృఢ సంకల్పం ఫలితంగా నేడు అక్షయ్ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచే స్థానంలో ఉన్నారు. అక్షయ్ కుమార్ మతుంగాలోని డాన్ బాస్కో హై స్కూల్‌లో చదివేటప్పుడే కరాటే నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో తాను 7వ తరగతిలో ఫెయిల్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే వెల్లడించారు. అక్షయ్ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ "చాందిని చౌక్‌లోని ఒకే ఇంట్లో 24 మందిమి కలిసి నివసించే వాళ్ళం. అందరం ఒకే గదిలో నిద్రపోయే వాళ్ళం. ఉదయం బయటకు రావాలంటే అందరిపై నుంచి దూకవలసి వచ్చేది" అంటూ చెప్పుకొచ్చారు.
అప్పట్లో ఇంటి అద్దె, ఫస్ట్ జీతం
అప్పట్లో అక్షయ్ నివసించిన ఇంటి అద్దె రూ.100 ఉండేదట. ఇక ఆయన ఫస్ట్ శాలరీ కేవలం రూ.150 మాత్రమే. మరో ఇంటర్వ్యూలో అక్షయ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. "నేను కలకత్తాలో ఒక ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నప్పుడు నా మొదటి జీతం అందుకున్నాను. అక్కడ నా జీతం రూ.150 నుంచి రూ.200 వరకు ఉండేది" అని చెప్పాడు. బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి చాలా కాలం ముందు, అక్షయ్ కుమార్ బ్యాంకాక్ లో చెఫ్, వెయిటర్‌గా పని చేసేవాడు. ఆ టైమ్‌లో పాత్రలు కూడా కడిగేవారట. అంతేకాదు తన జీవితంలోనే అత్యంత కఠినమైన ఆ దశలో ప్రతి షిఫ్ట్ చివర్లో టిప్/ఇన్సెంటివ్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసి నిరాశ చెందేవాడట.
అదృష్టం తలుపు తట్టిందిలా...
అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. అదే పేరుతో కరాటే టీచర్‌గా 'ఆజ్' అనే చిత్రంలో తెరపైకి అడుగుపెట్టాడు. తరువాత తన పేరును అక్షయ్ హరి ఓం భాటియాగా మార్చుకున్నాడు. బెంగళూరులో ఒక యాడ్ చిత్రీకరణ కోసం విమానం మిస్ అవ్వడంతో, అక్షయ్ కుమార్‌కు అనుకోకుండా పెద్ద అవకాశం లభించింది. నిజానికి ఫ్లైట్ మిస్ అయ్యిందనే నిరాశ చెంది, మరో అవకాశాన్ని వెతుక్కుంటూ తన పోర్ట్‌ఫోలియోతో ఒక ఫిల్మ్ స్టూడియోకి వెళ్లాడట. ఈ స్టెప్పే ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. అదే రోజు సాయంత్రం కల్లా నిర్మాత ప్రమోద్ చక్రవర్తి 'దీదార్' చిత్రానికి ఆయన హీరోగా సంతకం చేశాడు. ఇక అక్షయ్ కుమార్ ఇప్పుడు భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబైలో రూ.80 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా, రూ.2,500 కోట్ల విలువైన ఆస్తులు ఇప్పడు ఆయన సొంతం.





















