Naga Chaitanya : రెండో రెస్టారెంట్ ఓపెన్ చేసిన నాగ చైతన్య... ఈ క్లౌడ్ కిచెన్‌లో దొరికే స్పెషల్ ఫుడ్, కొత్త రెస్టారెంట్ పేరు ఏంటో తెలుసా ?
Naga Chaitanya : టాలీవుడ్ హీరో నాగ చైతన్య తాజాగా రెండో క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేశారు. స్క్యూజీ పేరుతో ఉన్న ఈ క్లౌడ్ కిచెన్‌లో తయారయ్యే ఫుడ్ తినాలి అనుకునేవారు ఇంటికి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.

నాగచైతన్యకి ప్రస్తుతం గుడ్ టైం నడుస్తోంది. శోభిత ధూళిపాళతో పెళ్లి, ఆ తర్వాత 'తండేల్' సినిమా సక్సెస్‌తో చై తన జీవితంలో సంతోషకరమైన సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇక నాగచైతన్యకి నటనతో పాటు బైక్‌లు, లగ్జరీ కార్లు... అన్నింటికంటే ముఖ్యంగా ఫుడ్ పట్ల మక్కువ ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్లో పాన్ - ఆసియన్ ఆహారాన్ని అందించే షోయూ అనే క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేశారు. ఈ రెస్టారెంట్లో జపనీస్ పాపులర్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఇప్పుడు 'స్కూజీ' అనే మరో కొత్త క్లౌడ్ కిచెన్‌ని నాగచైతన్య ప్రారంభించడం విశేషం. ఇక్కడ రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ దొరుకుతుంది.
'స్కూజీ' ఎలా మొదలైంది ?
నాగచైతన్య ఇటీవల గోవాలోని కొమో అగువా అనే పిజ్జా ప్లేసును సందర్శించారు. ఆ టైంలో అక్కడ ఫుడ్ చాలా నచ్చడంతో నాగ చైతన్య హైదరాబాద్లో కూడా ఇలాంటి రుచులను అందించే రెస్టారెంట్‌ను తీసుకురావాలని అనుకున్నారట. అదే ఆలోచనను ఆచరణలో పెడుతూ స్నేహితులు వరుణ్ త్రిపురనేని, అర్జున్, సానియా జైస్వాల్‌లతో కలిసి హైదరాబాదీలకు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి 'స్కూజీ'ని స్టార్ట్ చేశారు. ఇక 'స్కూజీ' క్లౌడ్ కిచెన్ ఫుడ్ ఇప్పుడు ఆన్లైన్‌లో కూడా అందుబాటులో ఉంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ యాప్‌ల ద్వారా మీకు ఇష్టమైన వంటకాలను ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక 'స్కూజీ' మెనూలో కొన్ని రుచి చూడాల్సిన ముఖ్యమైన ఐటమ్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ లో "ది హోమ్ రన్ బర్గర్, ట్రఫుల్ పాస్తా (రిగాటోని బియాంకా), చౌరంగీ-స్టైల్ పిజ్జా, జెర్క్ చికెన్ బౌల్, చురోస్ అండ్ ట్రెస్ లీచెస్ కేక్ వంటివి ఉన్నాయి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ తినాలి అనుకునే వారికి ఈ రెస్టారెంట్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
నాగ చైతన్య రెస్టారెంట్‌కు తారక్ ప్రమోషన్స్
ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ జపాన్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడే ఓ ఇంటర్వ్యూలో "మరో జన్మంటూ ఉంటే మీరేమవుతారు?" అని ప్రశ్నించగా... "మళ్లీ జన్మలో నేను చెఫ్ అవుతాను. అది కూడా మంచి సూషీ వండగల చెఫ్ కావాలని కోరుకుంటున్నాను. హైదరాబాదులో నా ఫ్రెండ్ నాగచైతన్య రెస్టారెంట్లో అద్భుతమైన సూషి అందుబాటులో ఉంటుంది" అంటూ జపాన్లో నాగచైతన్య క్లౌడ్ కిచెన్ షోయు గురించి ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ తయారు చేసే జపనీస్ ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య మరోసారి 'స్కూజీ' పేరుతో రెండవ క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయడం ఆసక్తికరంగా మారింది.
View this post on Instagram





















