Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
BRS party: కల్వకుంట్ల కవిత పెట్టబోయే కొత్త పార్టీతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోనుంది. అయినా కవితతో దూరం పెంచుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

BRS party will suffer a major loss with Kalvakuntla Kavitha new party: తెలంగాణ రాజకీయాల్లో 2028 ఎన్నికల లక్ష్యంగా కల్వకుంట్ల కవిత వేస్తున్న అడుగులు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె పార్టీ పెడతానని ప్రకటించడం వెనుక ఆవేశం మాత్రమే కాదని పక్కా రాజకీయ లెక్కలు ఉన్నాయని ఆమె అనుచరవర్గం భావిస్తోంది. కవిత పార్టీ పెడితే అధికార కాంగ్రెస్ లేదా బీజేపీ కంటే ఎక్కువగా బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదకరంగా మారుతుందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఓట్లపైనే కవిత గురి
కవిత రాజకీయ పునాది మొత్తం తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ సిద్ధాంతాలపైనే నిర్మితమైంది. ఆమె కొత్త పార్టీ పెడితే, ఆ పార్టీకి వచ్చే ప్రతి ఓటు బీఆర్ఎస్ ఖాతాలో నుంచే చీలుతుంది. కాంగ్రెస్ లేదా బీజేపీ ఓటు బ్యాంకులు సిద్ధాంతపరంగా భిన్నమైనవి. కానీ, కవిత వినిపిస్తున్న తెలంగాణ వాదం , బీసీ నినాదం నేరుగా బీఆర్ఎస్ మద్దతుదారులనే ఆకర్షిస్తాయి. ఉద్యమ కాలం నుంచి ఆమెతో నడిచిన వారు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు సహజంగానే ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్‌కు ఎక్కువగా నష్టం చేసే అంశం.
మూడు శాతం ఓట్ల ప్రభావం - వైసీపీ ఉదాహరణ
తెలంగాణ వంటి త్రిముఖ పోటీ ఉన్న రాష్ట్రంలో రెండు లేదా మూడు శాతం ఓట్ల చీలిక కూడా ఫలితాలను తలకిందులు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పక్షాన నిలబడటం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీలిపోయి, కడప వంటి జిల్లాల్లో కూడా వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే తరహా ముప్పు ఇప్పుడు బీఆర్ఎస్‌కు పొంచి ఉంది. కవిత పార్టీ చీల్చే కొద్దిపాటి ఓట్లు కూడా, హోరాహోరీగా సాగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణం కావచ్చు. గెలుపు ముంగిట ఉన్న అభ్యర్థులు కేవలం కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోతే ఫలితాలు మరిపోతాయి.
జనంబాట వెనుక పక్కా ప్రణాళిక
కవిత కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా 'జనంబాట' పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ఇటు బీఆర్ఎస్ నేతలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. రెబల్ నాయకులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసంతృప్త నేతలకు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలకు ఆమె ఒక ప్రత్యామ్నాయ వేదికగా కనిపిస్తున్నారు. ఆమె చేసే విమర్శలు ఆమెకు పబ్లిసిటీని పెంచడమే కాకుండా, తనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు కూడా ఒక పెట్టుబడే. కవితపై బీఆర్ఎస్ నేతలు ఎంతగా విరుచుకుపడితే, ప్రజల్లో ఆమె ఒక ఒంటరి పోరాట యోధురాలిగా ముద్ర పడే అవకాశం ఉంది. ఇది ఆమె పార్టీకి సానుభూతిని కూడగడుతుంది.
రాజీ మార్గమే శ్రేయస్కరమా?
ఈగోలకు పోయి ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల బీఆర్ఎస్ తన సొంత కేడర్‌లోనే గందరగోళాన్ని సృష్టిస్తోంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. కవితతో పంచాయతీని పెంచుకోవడం వల్ల బీఆర్ఎస్ తన పునాదులను తానే తవ్వుకున్నట్లు అవుతుందన్న అభిప్రాయం వినిపిస్ోతంది. ఎన్నికల సమయానికి ఆమెను ఒక శక్తిగా ఎదగనివ్వడం కంటే, ముందే ఆమెతో చర్చలు జరిపి లేదా ఆమె ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని రాజీ పడటమే బీఆర్ఎస్‌కు మేలని విశ్లేషకులు భావిస్తున్నారు.





















