AP High Court: ఏపీ పరిషత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు అనుమతిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు అనుమతిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది. ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని.. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21వ తేదీన తీర్పు వెలువరించిన విషయం విదితమే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వీటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
ఏం జరిగిందంటే?
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏప్రిల్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ఆధారంగా పరిషత్ ఎన్నికలు జరిగాయి. పరిషత్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు మే 21న కీలక తీర్పు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణ తేదీకి సరిగ్గా నాలుగు వారాల ముందు కోడ్ విధించాలని సుప్రీంకోర్టు సూచించిందని.. ఈ ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీని కోసం కొత్తగా మరో నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈసారి ఎన్నికలను సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి నిర్వహించాలని స్పష్టం చేసింది. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించాలని ఆదేశాల్లో తెలిపింది.
తీర్పును సవాల్ చేసిన ఎన్నికల సంఘం..
ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఎన్నికల కోసం దాదాపు రూ.165 కోట్లు ఖర్చు చేశామని, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ భారమవుతుందని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలనే నిబంధన లేదని పేర్కొన్నారు. దీనిపై ఆగస్టు 3న విచారణ ముగించిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. తాజాగా తన తీర్పును వెలువరించింది.