Bloody Ishq Movie Review - బ్లడీ ఇష్క్ రివ్యూ - Hotstarలో అవికా గోర్ హారర్ ఫిల్మ్ - ఈ ఎఫైర్స్ ఏంటి డాడీ బ్రో?
Bloody Ishq 2024 Review In Telugu: విక్రమ్ భట్ దర్శకత్వంలో అవికా గోర్ నటించిన హిందీ సినిమా 'బ్లడీ ఇష్క్' డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఎలా ఉందో తెలుసుకోండి.
విక్రమ్ భట్
అవికా గోర్, వర్ధన్ పూరి, జెన్నిఫర్, రాహుల్ దేవ్ తదితరులు
Disney Plus Hotstar
Avika Gor's Bloody Ishq 2024 Movie Review In Telugu: 'చిన్నారి పెళ్లికూతురు' టీవీ సీరియల్ ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైన నటి అవికా గోర్. ఆ తర్వాత రాజ్ తరుణ్ 'ఉయ్యాలా జంపాలా'తో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలు హిట్ సినిమాలు చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'బ్లడీ ఇష్క్'. వర్ధన్ పూరి హీరో. దీనికి విక్రమ్ భట్ దర్శకుడు. మహేష్ భట్, సుహ్రిత దాస్ రచయితలు. థియేటర్లలో విడుదల చేయాలని తీశారు. అయితే... డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీలో విడుదల చేశారు. జూలై 26 నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమా భయపెడుతుందా? ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Bloody Ishq 2024 Story): నేహా రోమేష్ (అవికా గోర్) నీటిలో పడటంతో చావు అంచుల వరకు వెళుతుంది. అదృష్టవశాత్తూ... నీళ్లలో నుంచి తీసి ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణాలు దక్కుతాయి. కానీ, గతం గుర్తు ఉండదు. స్కాట్లాండ్‌లో ఉన్న ప్రయివేట్ ఐలాండ్‌లోని ఇంటికి తీసుకు వెళతాడు భర్త రోమేష్ (వర్ధన్ పూరి). ఆ భవంతిలో ఓ దెయ్యం ఉంటుంది. అది నేహా ప్రాణాలు తీయాలని చూస్తుంది.
నేహాను దెయ్యం ఎందుకు చంపాలని చూస్తోంది? గతంలో ఏం జరిగింది? రోషన్ తండ్రి (రాహుల్ దేవ్) మరణం వెనుక ఏం జరిగింది? రోషన్ మీద డిటెక్టివ్ ఎందుకు అనుమానం వ్యక్తం చేశాడు? ఆ దెయ్యం ఎవరు? ఎవరికి ఎవరితో ఎఫైర్ ఉంది? కిమాయా టాండన్ (Jeniffer Piccinato) ఎవరు? చివరకు తెలిసిన నిజం ఏమిటి? దెయ్యం నేహాను వదిలి వెళ్లిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Bloody Ishq 2024 Review): 'బ్లడీ ఇష్క్' స్ట్రీమింగ్ మొదలైన కాసేపటికి 'థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీలోకి ఎందుకు తీసుకు వచ్చారు?' అనేది స్పష్టంగా తెలుస్తుంది. పూర్ ప్రొడక్షన్ వేల్యూస్, నెరేటివ్ స్కిల్స్ వీక్షకులను ప్రతి సన్నివేశంలోనూ, అడుగడుగునా డిస్టర్బ్ చేస్తాయి. పోనీ, ఆ రెండూ పక్కనపెట్టి కథ, కథనం ఎలా ఉన్నాయి? నటీనటులు ఎలా చేశారు? అనేది చూస్తే... 'బ్లడీ ఇష్క్' హారర్ థ్రిల్లర్ అన్నారు. కానీ, అందులో నిజం లేదు. కథలో హారర్ లేదా థ్రిల్ చేసే మూమెంట్స్ తక్కువ, రొమాంటిక్ మెలోడ్రామా ఎక్కువ.
క్లుప్తంగా ఈ కథ గురించి చెప్పాలంటే... ప్రేమ పేరుతో తండ్రి కొడుకులకు దగ్గర అవుతుంది. ట్విస్ట్ ఏమిటంటే... వేరే అమ్మాయితో కుమారుడికి నెలలో పెళ్లి. ఆ మహిళ ఏమో తండ్రిని పెళ్లి చేసుకుంటుంది. ఈ ట్రయాంగిల్ ఎఫైర్ స్టోరీలో తండ్రి కొడుకులకు ఆ మహిళ గురించి నిజం తెలిసిందా? లేదా? అనేది సినిమా. ఈ కథను తెరకెక్కిస్తే రొమాంటిక్ థ్రిల్లర్ అయ్యేది! కానీ, దీనికి భట్ క్యాంప్ హారర్ టచ్ ఇచ్చింది. ఇద్దర్ని చంపేసి అందులో ఒకరిని దెయ్యం చేసింది. సస్పెన్స్, థ్రిల్ ఇవ్వాలని చూసింది. కానీ, ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు సరి కదా... వీక్షకుల సహనానికి పలు సన్నివేశాల్లో పరీక్ష పెట్టింది.
ఆస్పత్రిలో అవికా (Avika Gor Bloody Ishq Review)కు మెమరీ లాస్ అని చెప్పడం, ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు దెయ్యం కనిపించడం, గతం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు, భార్య మీద భర్త చూపించే ప్రేమ... ఒక్కటంటే ఒక్కటి కూడా ఎగ్జైట్ చెయ్యదు. అంతా రొటీన్, సేమ్ ఓల్డ్ హారర్ టెంప్లేట్ ఫార్ములాలో సినిమా సాగుతుంది. కథకు ముందుకు వెళుతున్న మరింత సాగదీసిన అనుభూతి కలుగుతుంది. రచన, దర్శకత్వంలో 'వావ్' ఫ్యాక్టర్ మిస్ అయ్యింది. రొటీన్ అయినా కొన్ని సన్నివేశాలు మినిమమ్ హారర్ ఫీల్ ఇవ్వడంలో మాత్రమే సక్సెస్ దర్శక రచయితలు సక్సెస్ అయ్యారు.
Also Read: బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
నేహా పాత్రకు, ఆ సన్నివేశాలకు తగ్గట్టు అవికా గోర్ నటించింది. పెర్ఫార్మన్స్ చూస్తే కొత్తగా ఉండదు. అలాగని తీసి పారేయలేం. ఆ కథ, సన్నివేశాలు అంతకు మించి నటించే స్కోప్ ఇవ్వలేదంతే! హీరో వర్ధన్ పూరి ఓకే. రెగ్యులర్ బాలీవుడ్ స్టార్ టైప్ కనిపించడానికి ప్రయత్నించాడు. తెలుగు వెబ్ సిరీస్ 'సిన్'లో నటించిన జెన్నిఫర్ రొమాంటిక్ రోల్ చేశారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు విలన్ రోల్స్ చేసిన రాహుల్ దేవ్ ఈ సినిమాలో తండ్రిగా అతిథి పాత్రలో కనిపించారు.
'బ్లడీ ఇష్క్'లో ప్రేమ లేదు, హారర్ లేదు, థ్రిల్ లేదు. రొమాంటిక్ రిలేషన్, ఎఫైర్స్ ఉన్నాయి. ఎఫైర్స్ ట్విస్ట్ చేస్తూ హారర్ థ్రిల్లర్ తీయాలని ట్రై చేశారు. కానీ, ఆ ట్విస్టులు ఎగ్జైట్ చేయలేదు. మెలో డ్రామా ఎక్కువ అయ్యింది. వీకెండ్ వేరే ఆప్షన్ లేకపోతే ట్రై చేయండి. అదీ అటువంటి అంచనాలు పెట్టుకోకుండా స్ట్రీమింగ్ షురూ చేయండి. అప్పుడు కొందరికైనా, సినిమాలో కొంచమైనా నచ్చే అవకాశం ఉంటుంది.
రేటింగ్: 2/5