Bahishkarana Web Series Review - బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Bahishkarana Web Series Review In Telugu: అంజలి, శ్రీతేజ్, రవీంద్ర విజయ్, అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన 'బహిష్కరణ' జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
ముఖేష్ ప్రజాపతి
అంజలి, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, అనన్యా నాగళ్ల, షణ్ముక్, మహ్మద్ బాషా, 'బేబీ' చైత్ర, సమ్మెట గాంధీ తదితరులు
Zee5 OTT
Bahishkarana Web Series Streaming On Zee5 OTT: తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. ఇందులో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రధారులు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో జీ5 ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ రివేంజ్ డ్రామా, బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. జూలై 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Bahishkarana Web Series Story): పెద్దపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల పది ఊళ్లకు ప్రెసిడెంట్ శివయ్య (రవీంద్ర విజయ్) మాట శాసనం. ఆయన్ను వెతుక్కుంటూ వస్తుంది పుష్ప (అంజలి). ఆమె ఓ వేశ్య. పుష్ప అందచందాలకు ముగ్ధుడైన శివయ్య ఊరి చివర ఇంట్లో ఉంచుతాడు. అతనికి పుష్ప సుఖాన్ని అందిస్తుంది. ఆమె అవసరాలను అతను తీరుస్తున్నాడు. ఊరందరి కన్ను పుష్ప మీద పడింది. అయితే... శివయ్యకు కుడి భుజం లాంటి దర్శి (శ్రీతేజ్) చూపించిన ప్రేమకు ఆమె పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. శివయ్య అనుమతి సైతం లభించడంతో పట్నం వెళ్లి షాపింగ్ చేసి వస్తారు.
పట్నం నుంచి వచ్చిన దర్శికి శివయ్య షాక్ ఇస్తాడు. లక్ష్మి (అనన్యా నాగళ్ల) మెడలో తాళి కట్టమని చెబుతాడు. ఆమె ఎవరో కాదు... దర్శి మరదలే. పుష్పను ప్రేమించిన, పెళ్లి చేసుకోవాలనుకున్న దర్శి... చివరకు మరదల్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ తర్వాత దర్శి జైలుకు ఎందుకు వెళ్లాడు? ఊరిలో దర్శి వర్గానికి చెందిన అమ్మాయిల మరణాలకు కారణం ఎవరు? లక్ష్మిని దర్శి పెళ్లి చేసుకున్నాక పుష్ప ఏం చేసింది? జైలు నుంచి వచ్చాక దర్శి ఏం చేశాడు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Bahishkarana Web Series Review): ఇప్పుడు కులమతాల పట్టింపులు తక్కువ. కానీ, పాతికేళ్ల క్రితం? అదీ పల్లెల్లో? ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో తక్కువ కులం పేరుతో కొన్ని వర్గాలకు చెందిన మనుషుల్ని దూరం పెట్టడం, అంటరాని వాళ్లుగా చూడటం మరీ ఎక్కువగా ఉండేది. ఆ నేపథ్యంలో కొన్ని కథలు, సినిమాలు వచ్చాయి. వాటిని, 'బహిష్కరణ'ను వేరు చేసింది ఒక్కటే... పుష్ప - శివయ్య క్యారెక్టర్లు, వాటి మధ్య సంబంధం, ఆ పాత్రల్లో అంజలి - రవీంద్ర విజయ్ నటన.
పెద్దింటి మనుషులకు ముట్టుకోవడానికి, ఇంట్లోకి రానివ్వడానికి అడ్డొచ్చిన కులం... అమ్మాయిల్ని తమ పక్కలోకి రానివ్వడానికి, పడక సుఖం అనుభవించడానికి ఏ మాత్రం అడ్డు రాకపోవడం విచిత్రమే. అయితే... 'బహిష్కరణ' కథలో కీలకమైన అంశం అదొక్కటే కాదు, ఈడొచ్చిన అమ్మాయిలు వయసు మీరిన మృగాళ్ల నుంచి ఎదుర్కొంటున్న ఓ సమస్యను కూడా ప్రస్తావించారు. హీరో ప్రతీకారంలో అదొక కీలకమైన అంశం.
'బహిష్కరణ' కథ కొత్తగా ఉందని చెప్పలేం. కానీ, కొన్ని ఎపిసోడ్లలో తర్వాత ఏం జరుగుతుందని ఉత్కంఠతో, ఆసక్తిగా ఎదురు చూసేలా ఉందని చెప్పడంలో ఏం సందేహం అవసరం లేదు. ముఖేష్ ప్రజాపతి కొన్ని సన్నివేశాలను తీసిన విధానంలో రా అండ్ రస్టిక్ ఫీల్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పలు సన్నివేశాల్లో అంతర్లీనంగా ఆయన కొన్ని విషయాలు చెప్పిన తీరు బావుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో మనుషులు చేపల్ని వేటాడినట్టు బలవంతులు బలహీనులను వేటాడుతున్నారని చూపే సన్నివేశం గానీ, పతాక సన్నివేశాల్లో గుడిసెలో భోజనాల దగ్గర సన్నివేశం గానీ చూసినప్పుడు దర్శకుడిలో విషయం ఉందని అనిపిస్తుంది.
'బహిష్కరణ'ను దర్శకుడు ముఖేష్ ప్రజాపతి కమర్షియల్ ప్యాకేజ్ రూపంలో ఓటీటీ ఆడియన్స్ ముందుకు తెచ్చారు. అయితే... ఆ కథలో సన్నివేశాలు, కొన్ని పాత్రలు ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు ఉంటాయి. ఉదాహరణకు రవీంద్ర విజయ్ క్యారెక్టర్ చూస్తే... 'రంగస్థలం'లో జగపతిబాబు గుర్తొస్తారు. ఆ సినిమా ప్రభావం ఈ సిరీస్ మీద ఉందని చెప్పవచ్చు. అలాగే, మర్డర్ చేశాక మొక్క నాటడం వంటివి ఇంతకు ముందు సినిమాల్లో చూసినవే. అయితే... శ్యామ్ చెన్ను సంభాషణలు ఈ కథను కాస్త కొత్తగా మార్చాయి. సిద్ధార్ద్ సదాశివుని నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
అంజలి పాత్రను వేశ్యగా మాత్రమే చూడలేం. డబ్బు కోసం ఒకరి పంచన చేరిన మహిళ అయినప్పటికీ... పుష్ప పాత్రలో వేరియేషన్స్ చూపించే అవకాశం ఆమెకు దక్కింది. అంజలి కూడా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్ భోజనం ఎపిసోడ్ దగ్గర సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. రవీంద్ర విజయ్ డైలాగ్ డెలివరీ కారణంగా ఆయన నటన కొత్తగా కనిపిస్తుంది. అలాగే, వినిపిస్తుంది. రూరల్ మాసీ క్యారెక్టర్ చేసిన శ్రీతేజ్, తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సింపుల్ అండ్ హోమ్లీ లుక్ - ఆ పాత్రకు తగ్గ నటనతో అనన్యా నాగళ్ల కనిపించారు. సమ్మెట గాంధీ పాత్ర నిడివి తక్కువే. కానీ, ఆ క్యారెక్టర్ ట్విస్ట్ సర్‌ప్రైజ్ చేస్తుంది. షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహమ్మద్ బాషా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
బలమైన క్యారెక్టరైజేషన్లు రాసుకోవడం, ఆయా పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడం 'బహిష్కరణ' సిరీస్ రూపకర్తల మొదటి సక్సెస్. ఆర్టిస్టులు అందరి నుంచి పర్ఫెక్ట్ - యాప్ట్ యాక్టింగ్ రాబట్టుకున్నారు దర్శకుడు ముఖేష్ ప్రజాపతి. కథ కంటే కథనం ఎక్కువ ఆకట్టుకుంటుంది. కథతో పాటు ఆ ప్రేమల్లో కొత్తదనం లేదు. కానీ, క్యూరియాసిటీ కలిగించే కథనం ఉంది. నెక్స్ట్ ఏంటి? అని ఎంగేజ్ చేసే రా అండ్ రస్టిక్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ 'బహిష్కరణ'.
రేటింగ్: 3/5