Deva Movie Review - దేవా రివ్యూ: సుధీర్ బాబుకు డిజాస్టర్ ఇచ్చిన 'ముంబై పోలీస్' రీమేక్‌తో షాహిద్, పూజా హెగ్డే హిట్ కొట్టారా?
Deva Movie Review in Telugu: షాహిద్ కపూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా 'దేవా'. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ తీసిన ఈ సినిమా ఎలా ఉంది? హిట్ వస్తుందా?

రోషన్ ఆండ్రూస్
షాహిద్ కపూర్, పూజా హెగ్డే, పావైల్ గులాటి, పర్వేశ్ రాణా తదితరులు
షాహిద్ కపూర్, పూజా హెగ్డే, పావైల్ గులాటి, పర్వేశ్ రాణా తదితరులు
Mumbai Police movie hindi remake Deva Review in Telugu: మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా 2013లో వచ్చిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ముంబై పోలీస్'. భారీ విజయం సాధించింది. ఆ సినిమాను పదేళ్ల తర్వాత సుధీర్ బాబు రీమేక్ చేశారు... 'హంట్' పేరుతో! అయితే... తెలుగులో డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆ కథను హిందీలో రీమేక్ చేశారు. మలయాళంలో సినిమా తీసిన దర్శకుడు రోషన్ ఆండ్రూస్, హిందీలో 'దేవా'కు దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? పూజా హెగ్డేకు విజయం వచ్చిందా? లేదా?
కథ (Deva Movie Story): ముంబైలో దేవ్ (షాహిద్ కపూర్) ఇన్స్పెక్టర్. అతని నేతృత్వంలో గ్యాంగ్ స్టార్ ప్రభాత్ జాదవ్ (మనీష్ వంధ్వా)ను పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి తప్పించుకుంటాడు. పైగా, పోలీసుల్లో ఎవరో ఒకరు మరణించడం లేదా గాయపడటం జరుగుతుంది. ముంబై పోలీసుల్లో, మరి ముఖ్యంగా అతడిని పట్టుకోవడానికి వెళుతున్న బృందంలో ఎవరో ఒకరు సమాచారాన్ని లీక్ చేస్తున్నారని ఓ కానిస్టేబుల్ కూతురు, జర్నలిస్ట్ దియా (పూజా హెగ్డే) అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ విషయం దేవ్‌కు చెబుతుంది. చివరకు పోలీసుల చేతికి జాదవ్ చిక్కుతాడు. స్నేహితుడు రోహన్ డిసిల్వ (పావైల్ గులాటి)ను కాపాడే క్రమంలో జాదవ్‌ను దేవ్ ఎన్కౌంటర్ చేస్తాడు. అయితే... అది చేసింది రోహన్ అని చెబుతాడు. దాంతో అతనికి గాలంటరీ మెడల్ వస్తుంది.
గాలంటరీ మెడల్ అందుకున్న రోహన్ డిసల్వ, స్పీచ్ ఇస్తున్న టైంలో అతడిని ఎవరో షూట్ చేసి చంపేస్తారు. ఆ కేసును దేవ్ డీల్ చేస్తాడు. హంతకుడు ఎవరో తెలిసిందని కమిషనర్ ఫర్హాన్ (పర్వేశ్ రాణా)కు చెబుతాడు. ఆ వెంటనే యాక్సిడెంట్ జరుగుతుంది. దేవ్ తన గతం మరిచిపోతాడు. అతడికి మళ్ళీ గతం గుర్తు వచ్చిందా? రోహన్ డిసిల్వను చంపిన హంతకుడు ఎవరో కనిపెట్టాడా? చివరకు ఏమైంది? ఏమని తేలింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Deva Movie Review Telugu): ముంబై పోలీస్, దేవా... రెండు సినిమాలకు దర్శకుడు ఒక్కరే కావడంతో మలయాళ సినిమాను షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నారని ప్రేక్షకులతో పాటు మీడియా కూడా భావించింది. అయితే... తమది రీమేక్ కాదని 'దేవా' టీం చెబుతూ వచ్చింది. షాహిద్ కపూర్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ సీన్ కట్ చేయాల్సి వచ్చిందని చెప్పడంతో అందరూ రీమేక్ కాదని అనుకున్నారు. అసలు విషయం ఏమిటంటే... 'ముంబై పోలీస్'కు 'దేవా' రీమేక్.
బాక్సాఫీస్ కలెక్షన్స్ పక్కన పెడితే... 'ముంబై పోలీస్' విడుదయ్యాక మలయాళ సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. స్టార్ హీరో 'గే' రోల్ చేయడం ఒక కారణం అయితే... పోలీస్ అధికారిని అటువంటి పాత్రలో చూపించడం ఏమిటి? అంటూ మరికొందరు విమర్శలు చేశారు. దాంతో సినిమాకు విపరీతమైన ప్రచారం జరిగింది. ప్రేక్షకులలో చాలామంది పృథ్వీరాజ్ సుకుమారన్ డేరింగ్ అటెంప్ట్ చేశారని మెచ్చుకున్నారు. ఆ సినిమాను 'హంట్' పేరుతో సుధీర్ బాబు తెలుగులో రీమేక్ చేయగా డిజాస్టర్ అయ్యింది. పృథ్వీరాజ్ సుకుమారన్, సుధీర్ బాబు తరహాలో షాహిద్ కపూర్ గే రోల్ చేయలేదు. ఆ ఒక్క విషయంలో దర్శకుడు రోషన్ అండ్రూస్ మార్కులు చెర్పులు చేశారు.
సుమారు 12 ఏళ్ల క్రితం మలయాళంలో వచ్చిన కథను హిందీలో కొత్తగా ప్రజెంట్ చేయడంలో ఇంటర్వెల్ వరకు రోషన్ ఆండ్రూస్ సక్సెస్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం షాహిద్ కపూర్ నటన. షార్ట్ హెయిర్ కట్, డిఫరెంట్ యాటిట్యూడ్ - హీరో క్యారెక్టర్ బాగా క్యారీ చేశారు. దర్శకుడుగా రోషన్ కూడా ఫస్టాఫ్ కొంత వరకు చక్కగా డీల్ చేశారు. 'ముంబై పోలీస్' అని మనసులో ఒకవైపు సందేహం కలిగినా సరే... స్క్రీన్ మీద ఏం జరుగుతుందో? అని ప్రేక్షకులు ఆలోచించేలా ఎంగేజ్ చేశారు. కెమెరామెన్ అమిత్ రాయ్, మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ నుంచి మంచి సపోర్ట్ లభించడంతో సినిమా సాఫీగా ముందుకు వెళ్లడానికి ఎటువంటి ఆటంకాలు కలగలేదు.
ఇంటర్వెల్ తర్వాతే 'దేవా'కు అసలు సమస్య మొదలైంది. మలయాళ కథలో 'గే' పాయింట్ మార్చడం తప్ప కథనం పరంగానూ పెద్దగా మార్పులు చేయలేక, కొత్తగా చూపించలేక దర్శకుడు నానా తంటాలు పడ్డారు. ఆల్రెడీ 'ముంబై పోలీస్' / 'హంట్' చూసిన ప్రేక్షకులకు అసలు ఏమాత్రం కొత్తదనం కనిపించదు. సేమ్ స్క్రీన్ ప్లే పాటర్న్, సేమ్ సీన్స్ స్క్రీన్ మీద రావడంతో నెక్స్ట్ ఈ సీన్, తర్వాత ఈ సీన్ అనుకుంటూ చూడాలి. పిచ్చ బోర్ కొడుతోంది. అక్కడ షాహిద్ కపూర్ కూడా నటుడిగా సీన్ డిమాండ్ మేరకు తప్ప కొత్తగా ఏమి చేయలేకపోయారు. దాంతో రొటీన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా కింద 'దేవా' మింగింది. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీలో ముంబైని 'గ్రే షేడ్'లో చూపించడం బావుంది. మ్యూజిక్ ఓకే.
షాహిద్ కపూర్ తన పాత్ర వరకు బాగా చేశారు. 'ఉడ్తా పంజాబ్', 'కబీర్ సింగ్', 'హైదర్' తరహాలో పాత్రలో లీనమై, ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిన మేరకు మంచి పర్ఫామెన్స్ కనబరిచారు. పూజ హెగ్డే క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ తక్కువ. సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో ఆవిడ వేసిన స్టెప్పులు 'అలమత్తి హబీబో' పాటలో స్టెప్పులను గుర్తు చేస్తాయి. మిగతా నటీనటులు ఓకే.
మలయాళ 'ముంబై పోలీస్'లో హీరోను 'గే' పాత్రలో చూపించిన దర్శకుడు రోషన్ ఆండ్రూస్, 'దేవా' కథలో 'గే' ప్రస్తావన లేకుండా ఎటువంటి మార్పులు చేశారో తెలుసుకోవాలని అనిపిస్తే 'దేవా'కు వెళ్ళండి. లేదంటే లైట్ తీసుకోండి. 'ముంబై పోలీస్' చూడని ప్రేక్షకులకు డిఫరెంట్ యాక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా చూసినట్టు ఉంటుంది. 'ముంబై పోలీస్' / 'హంట్' చూస్తే... 'ఇప్పుడు ఎందుకీ రీమేక్?' అనిపిస్తుంది. నటుడిగా షాహిద్ కపూర్ ఎటువంటి క్యారెక్టర్, ఎమోషన్ అయినా చేయగలడని మరోసారి చెప్పడానికి 'దేవా' తీసినట్టు ఉంది. సారీ షాహిద్... సారీ పూజా హెగ్డే... హిట్ కోసం ఇంకో సినిమా చేయక తప్పదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

