Pothugadda Review - 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
OTT Review - Pothugadda on ETV Win: 'ఆడుకాలం' నరేన్, శత్రు ప్రధాన పాత్రల్లో... పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ జంటగా నటించిన 'పోతుగడ్డ' ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

రక్ష వీరమ్
ఆడుకాలం నరేన్, శత్రు, పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ, ప్రశాంత్ కార్తీ తదితరులు
ETV Win
ETV Win movie Pothugadda 2025 review rating in Telugu: రాజకీయం, రాయలసీమ... తెలుగు తెరపై రెండిటినీ వేర్వేరు చేసి చూడలేం. సీమ అంటే ఫ్యాక్షన్ గొడవలు, అధికారం కోసం చంపుకోవడం వంటివి చాలా సినిమాల్లో చూపించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత వీర రాఘవ'తో రాయలసీమను కొత్తగా చూపించారు. మరి, ఈటీవీ విన్ యాప్ (ETV Win App)లో స్ట్రీమింగ్ అవుతున్న కొత్త సినిమా 'పోతుగడ్డ' ఎలా ఉంది? అనేది చూడండి.
కథ (Pothugadda Movie Story): కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో సముద్ర (ఆడుకాలం నరేన్) సిట్టింగ్ ఎమ్మెల్యే. పదేళ్లుగా ఆ పదవిలో ఉన్నాడు. ఎన్నికలు రావడంతో అతని మీద ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా భాస్కర్ (శత్రు) రంగంలోకి దిగుతాడు. డబ్బులు పంచడానికి కోట్లకు కోట్ల రూపాయలు రెడీ చేస్తాడు. మహిళలు, యువత ఓట్లకు గాలం వేయడానికి కూతురు గీత (విస్మయ శ్రీ)ని పార్టీలో 'జిల్లా యూత్ ప్రెసిడెంట్' చేస్తాడు సముద్ర.
రాజకీయాలు అంటే ఇష్టం లేని గీత... తనను యూత్ ప్రెసిడెంట్ చేసిన రోజు ఇంటి నుంచి పారిపోతుంది. ప్రేమించిన అబ్బాయి కృష్ణ (పృథ్వీ దండమూడి)తో కలిసి బస్సులో వెళుతుంది. ఆ విషయం సముద్రకు తెలుస్తుంది. అదే బస్సులో భాస్కర్ డబ్బు ఉంటుంది. సముద్ర అమ్మాయి లేచిపోయిన విషయం భాస్కర్ తెలుసుకున్నాడా? ఒకవేళ తెలిస్తే ఏం చేశాడు? భాస్కర్ డబ్బు గురించి సముద్రకు తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఏం చేశాడు? చివరకు ప్రేమికులు ఇద్దరూ ఏమయ్యారు? వాళ్ళను చంపడానికి వెళ్లిన వెంకట్ (ప్రశాంత్ కార్తీ), కృష్ణ - గీతల స్నేహితుడు అంజి (వెంకీ లింగం) ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Pothugadda Movie Review Telugu): కత్తులు, కటార్లు, ఫ్యాక్షన్ కక్షలు అని రాయలసీమ మీద ముద్ర పడింది. ఆ ఫ్యాక్షన్ కక్షలకు దూరంగా 'పోతుగడ్డ'ను తీయడం కాస్త రిలీఫ్ అని చెప్పవచ్చు. అయితే, ప్రేమ - పరువు హత్య నేపథ్యంలో ఇంతకు ముందు చూసిన కథల్ని అటు ఇటు చెప్పే ప్రయత్నం తప్ప కొంచెం కూడా కొత్తదనం లేదు. పరువు హత్యల కథకు చివర్లో కాస్త ట్విస్ట్ ఇచ్చారంతే!
రాయలసీమ నేపథ్యంలో, ఎన్నికల సమయంలో చేతులు మారే డబ్బు, ఢీ అంటే ఢీ అనడానికి రెడీగా ఉన్న ఇద్దరు అభ్యర్థులు, మధ్యలో ప్రేమ... 'పోతుగడ్డ' చాలా ఆసక్తిగా మొదలైంది. ఫ్యాక్షన్ కక్షలు లేకపోయినా సరే ఎత్తుకు పైఎత్తు వంటివి ఉంటాయని అనుకుంటే... అవేవీ లేకుండా సాదాసీదాగా నత్త నడకన సినిమా ముందుకు సాగుతుంది.
మాటల్లో తప్ప తెరపై పాత్రల్లో గానీ, సన్నివేశాల్లో గానీ ఎమోషన్ వర్కవుట్ కాలేదు. తల్లి మరణించిన తర్వాత అనురాగం, ఆప్యాయతలకు దూరమైన తనకు తండ్రి నుంచి అవేవీ లభించలేదని, అతని రాజకీయ అవసరాల కోసం తనను యూత్ ప్రెసిడెంట్ చేశారని అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తుంది. డైలాగ్స్ వింటుంటే, ఆ సీన్ చూస్తుంటే... వీక్షకుల్లో ఎటువంటి ఎమోషన్ కలగదు. కృష్ణతో గీత ప్రేమకథ చూసినా సరే... ప్రేమ కనిపించదు. అందువల్ల, వాళ్ళిద్దర్నీ చంపేందుకు ఒకరు బస్సు ఎక్కారని తెలిసినా సరే 'అయ్యో పాపం, బతికితే బావుంటుంది' అనిపించదు.
వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమని 'పోతుగడ్డ' టైటిల్ కార్డుల్లో వేశారు. రక్ష వీరమ్ రచన, దర్శకత్వంలో ఆ వాస్తవిక లోపించింది. ప్రతిదీ ఆర్టిఫీషియల్ అన్నట్టు ఉంటుంది. ఇంటెన్స్ గానీ, ఎమోషనల్ డెప్త్ గానీ లేదు. దాంతో సాగదీత ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. శ్రవణ్ భరద్వాజ్ పాటల్లో గుర్తుంచుకునేవి లేవు. మార్కస్ ఎం నేపథ్య సంగీతం బాలేదు. ఒక్కటంటే ఒక్క సన్నివేశంలోనూ ఎమోషన్ ఎలివేట్ చేయలేదు. కెమెరా వర్క్ ఓకే. ఎడిటింగ్ పరంగా కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి.
ఆడుకాలం నరేన్, శత్రు సీజనల్ ఆర్టిస్టులు. ఇటువంటి క్యారెక్టర్లు చేయడం వాళ్లకు కొత్త ఏమీ కాదు. కానీ, మరోసారి తమకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. ప్రేమికులుగా ఇంపాక్ట్ చూపించడంలో పృథ్వీ దండమూడి, విస్మయ శ్రీ ఫెయిల్ అయ్యారు. విడివిడిగా చూస్తే వాళ్ళ నటన ఓకే అనిపిస్తుంది ఏమో!? కానీ, ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధం అయితే కనిపించలేదు. వెంకట్ పాత్రలో ప్రశాంత్ కార్తీ చక్కగా నటించారు.
Pothugadda Telugu Review: రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే యాస ఒక్కటే చూసుకుంటే సరిపోదు. భాషలో యాస చూపించడంతో పాటు తెరపై భావోద్వేగాలు పండుతున్నాయా? లేదా? అనేది చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎమోషనల్ కనెక్టివిటీతో పాటు కథ - కథనం - మాటల్లో కొత్తదనం లేనప్పుడు యాస సినిమాను నిలబెట్టలేదు. 'పోతుగడ్డ' విషయంలోనూ జరిగింది అదే. ఈ సినిమాను ఈజీగా స్కిప్ కొట్టేయొచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

