Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Pilot Shortage in India: పైలట్ వృత్తి చాలా ఆకర్షణీయమైంది. మంచి జీతాలు ఉంటాయి. కానీ అటువైపుగా వెళ్లేందుకు చాలా మంది మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Pilot Rostering Issues: భారత దేశం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన విమానయాన మార్కెట్‌గా ఉంది. 2030న నాటికి ఇక్కడ వెయ్యి కంటే ఎక్కువ కొత్త విమానాలు ఆకాశంలో ఎగురుతాయని అంచనా ఉంది. కానీ ఆశాజనక వృద్ధి వెనుక ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉంది. పైలట్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే ఇండిగో వంటి సంస్థలు ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకున్నాయి. వేల సంఖ్యలో విమాన సర్వీస్‌లు రద్దు చేస్తున్నాయి. దీంతో ఆకాశ రవాణాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నెలకున్న పైలట్ల కొరత ఒక్కసారి వచ్చింది. కాదు. ఇందులో విమానయాన సంస్థలది ఎంత తప్పు ఉందో ప్రభుత్వాలది కూడా అంతే బాధ్యత ఉంది. ఇలా గత దశాబ్దం నుంచి పేరుకుపోయిన అనేక సమస్యలు ఇప్పుడు పెను విపత్తుగా మారాయి.
ఖరీదైన, దీర్ఘకాలిక శిక్షణ
పైలట్ కావాలంటే కనీసం 50 నుంచి కోటిన్నర వరకు ఖర్చు అవుతుంది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం 150 నుంచి 200 గంటల ఫ్లయింగ్ అవసరం. భారత్‌లో ఫ్లయింగ్ గంట ఖర్చు 12000 నుంచి 18000 వరకు ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా కంటే రెట్టింపు, దీంతో చాలా మంది విదేశాలకు వెళ్లి శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు. కానీ అక్కడ కూడా ఖర్చు 35 నుంచి 45 లక్షలు ఖర్చు అవుతుంది. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చినా భారత్‌లో లైసెన్స్ కన్వర్షన్, డీజీసీఏ పరీక్షలకు మళ్లీ అటెండ్ అవ్వాలి. దీని కోసం పది నుంచి పదిహేను లక్షలు ఖర్చు చేయాలి. ఈ స్థాయిలో ఖర్చు భరించగలిగే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే అటు వైపుగా తక్కువమంది మొగ్గు చూపుతున్నారు.
శిక్షణ సామర్థ్యంలో లోపం
భారత్‌లో ప్రస్తుతం 35 డీజీసీఏ ఆమోదిత ఫ్లయింగ్ స్కూల్స్ ఉన్నాయి. వీటి మొత్తం సామర్థ్యం ఏటా వెయ్యి నుంచి 1200 మంది మాత్రమే. కానీ డిమాండ్ ఏటా రెండు వేల వరకు ఉంటోంది. ఫలితంగా వందలాది మంది విద్యార్థులు వెయిటింగ్ లిస్టులో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పాత స్కూల్స్‌లో ట్రైనర్ విమానాలు పాతబడ్డాయి. నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. కొత్త స్కూల్స్ పెట్టాలంటే 200-300 ఎకరాలు భూమి 200- నుంచి 300 కోట్ల పెట్టుబడి కావాలి. ఇంత పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
టైప్ రేటింగ్ సంక్షోభం
సీపీఎల్ పూర్తి అయిన ఎయిర్‌లైన్ ఉద్యోగం రాదు. A320 లేదా B737 టైప్ రేటింగ్ కావాలి. దీని ఖర్చు 25 లక్షల నుంచి 35లక్షలు. చాలా ఎయిర్‌లైన్లు గతంలో ఈ ఖర్చును భరించేవి. కానీ 2018-19 తర్వాత జెట్ ఎయిర్‌వే్ పతనం, కోవిడ్ సంక్షోభం తర్వాత ఎయిర్‌లైన్‌లు సెల్ఫ్ ఫైనాన్స్ టైప్ రేటింగ్ విధానానికి మారాయి. ఫలితంగా కొత్త పైలట్లు 80 నుంచి కోటి రూపాయలు రుణం తెచ్చుకుని శిక్షణ పూర్తి చేయాల్సి వస్తోంది. అలా పూర్తి చేసిన వ్యక్తికి ఉద్యోగం రాకపోతే ఆ భారం మోయాల్సి ఉంటుంది. అందుకే ఆ భయంతో ఎవరూ రుణాలు తెచ్చుకొని ట్రైన్ అవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు.
విదేశీ ఎయిర్‌లైన్‌లకు వలస
గల్ఫ్ దేశాలు చైనా, వియత్నాం, టర్కీ ఎయిర్‌లైనలు భారతీయ పైలట్‌లకు భారీ జీతాలతో ఆకర్షిస్తున్నాయి. ఏ 320 కెప్టెన్ భారత్‌లో ఐదు నుంచి ఏడు లక్షల రూపాయల జీతం పొందితే మధ్య ప్రాచ్యంలో ఆ వ్యక్తికి 18 నుంచి పాతిక లక్షల వరకు జీతం ఇస్తారు. ఇందులో టాక్స్ ఉండదు. ఉచిత హౌసింగ్ ఉంటుంది. పిల్లల చదువు ఉచితం. ఇలాంటి ఆఫర్స్ ఉండటంతో ఎక్కువమంది విదేశాల్లో సెటిల్ అవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. గత మూడేళ్లలో దాదాపు వెయ్యి మంది వరకు పైలట్లు విదేశాలకు వెళ్లిపోయినట్టు లెక్కలు చూస్తే అర్థమవుతుంది.
కోవిడ్ దెబ్బలు
కోవిడ్ కారణంగా అన్ని ఎయిర్‌లైన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీన్ని సాకుగా చెప్పి కరోనా తర్వాత చాలా ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ సంస్థలో ఉద్యోగులను తొలగించాయి. దీంతో చాలా మంది ఈ పైలట్ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఇతర రంగాలవైపు కానీ, విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. దీని ప్రభావంతో శిక్షణ సంస్థల్లో అడ్మిషన్లు కూడా భారీగా పడిపోయాయి. ఈ గ్యాప్ ఇప్పుడు కొరతను మరింత పెంచింది.
రిటైర్‌మెంట్ రేట్
భారత్ విమానయాన రంగంలో రిటైర్‌మెంట్ రేట్‌కు తగ్గట్టుగా నియామకాలు జరగడం లేదు. కొత్తగా వచ్చే వాళ్లే తగ్గిపోయారు. అందుకే ప్రతి ఏడాది 3 వందల మందికి పైగా రిటైర్ అవుతుంటే ఆ స్థాయిలో ఉద్యోగాల్లో చేరుతున్న వారు లేకుండా పోయారు. ఈ గ్యాప్ కంటిన్యూ అవుతోంది.
లీన్ స్టాఫింగ్ రూల్
ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ లాభాలు పెంచుకోవడానికి స్టాఫ్‌ను వీలైనంత వరకు తగ్గించేశాయి. ఒక్కో విమానానికి కేవలం 8-9 మంది పైలట్లు మాత్రమే ఉంటారు. ఇది అంతర్జాతీయంగా 11-12 ఉంది. ఇందులో ఒకరు లీవ్ తీసుకున్నా మిగతా వాళ్లపై భారం పడుతుంది. ఈ పరిస్థితుల్లో 2025 గత నెల నుంచి తీసుకొచ్చిన రూల్ సంక్షోభం బహిర్గతమయ్యేలా చేసింది. నడుస్తున్న సర్వీస్‌లకు పైలట్లను సర్దుబాటు చేయలేక ఇండిగో చేతులు ఎత్తేసింది. మిగతా వాళ్లు సర్దుబాటు చేసుకున్నారు.
పైలట్లపై మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి
భారత్‌లో పైలట్లు నెలకు 85-95 గంటలు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇదే విదేశాల్లో అయితే 70-80 గంటలు మాత్రమే ఉంటుంది. రోస్టర్‌లో కూడా సరైన విధానాలు పాటించకపోవడం, నైట్ డ్యూటీలు, పేలవమైన వసతి సౌకర్యాలు ఇవన్నీ వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న పైలట్లు జీవితాలు చాలా సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. అందుకే ఈ ఒత్తిడితో ఉద్యోగాలు చేయలేని వాళ్లు ఐదు నుంచి ఏడేళ్లకే బయటకు వచ్చేస్తున్నారు.
ఈ కారణాలన్నీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి దుస్థితి రాకుండా చూడాలి అంటే వ్యవస్థీకృతంగా చాలా మార్పులు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.




















