Market Mahalakshmi Movie Review - మార్కెట్ మహాలక్ష్మీ రివ్యూ: బొమ్మరిల్లు తండ్రీ కొడుకులు... ఇండిపెండెంట్ అమ్మాయి... సినిమా ఎలా ఉందంటే?
Market Mahalakshmi Movie Review In Review - కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా నటించిన సినిమా మార్కెట్ మహాలక్ష్మీ. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
వీఎస్ ముఖేష్
పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు
'కేరింత'తో తెలుగు చిత్రసీమకు 'దిల్' రాజు పరిచయం చేసిన హీరోల్లో పార్వతీశం (Parvateesam) ఒకరు. ఆ సినిమాలో ఆయన శ్రీకాకుళం యాస, నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 'కేరింత' తర్వాత వైవిధ్యమైన, విలక్షణ కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేశారు. కానీ, ఆ స్థాయి విజయం రావడం లేదు. ఇవాళ 'మార్కెట్ మహాలక్ష్మీ' సినిమా (Market Mahalakshmi Movie)తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రణీకాన్వికా నటించారు. మార్కెట్‌లో కాయగూరలు అమ్మే అమ్మాయితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి ప్రేమలో పడితే? అనేది సినిమా కాన్సెప్ట్. వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ (Market Mahalakshmi Movie Story): అబ్బాయితో చేయించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చేస్తే... నెలకు రెండు లక్షల జీవితంతో పాటు పెళ్లి చేసినప్పుడు అమ్మాయి తండ్రి నుంచి కోటి కట్నం వస్తుందని స్నేహితుడు సలహా ఇవ్వడంతో తన కుమారుడి (పార్వతీశం)ని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేస్తాడు ఓ తండ్రి (కేదార్ శంకర్). తానొక గుమస్తా అయినప్పటికీ... అబ్బాయి చదువుకు ఐదు లక్షల ఖర్చు చేస్తాడు. ఆశించినట్టు అతడు మంచి ఉద్యోగంలో చేరడంతో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడతాడు.
పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా, ఎందరు అమ్మాయిలను కలిసినా... ఒక్కరు కూడా నచ్చరు. తల్లితో పాటు ఒక రోజు కాయగూరల మార్కెట్‌కు వెళ్లినప్పుడు మహాలక్ష్మీ (ప్రణీకాన్వికా)ను చూసి ప్రేమలో పడతాడు హీరో. తొలిచూపులో ఆ అమ్మాయిని చూసి ప్రేమలో పడటానికి కారణం ఏమిటి? ఛీ కొట్టినా, చెంప దెబ్బలు కొట్టినా ఆ అమ్మాయి వెనుక ఎందుకు పడ్డాడు? అతడిపై ఆ అమ్మాయికి ప్రేమ కలిగిందా? లేదా? ఈలోపు ఇంట్లో తల్లిదండ్రులు, ఆఫీసులో స్నేహితులు ఏమన్నారు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Market Mahalakshmi Review): పరిచయం లేనోడి వెనుక కట్నాలు పట్టుకుని పరిగెత్తడం ఎందుకు? ప్రేమించిన వాడితో జీవితాన్ని పంచుకోండి, కనీసం పాతికేళ్ళు (వైవాహిక జీవితంలో) సుఖంగా ఉంటారని సందేశం ఇచ్చే సినిమా 'మార్కెట్ మహాలక్ష్మీ'. మన జీవితాలు ఏం సంబంధం లేని వ్యక్తితో మొదలై ఏ సంబంధం లేని వ్యక్తితో ముగుస్తాయని, బాధ్యత ఉన్న కొడుకు తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన అవసరం లేదని చెబుతుందీ సినిమా.
దర్శకుడు వీఎస్ ముఖేష్ చెప్పాలని అనుకున్న పాయింట్ బావుంది. అయితే, ఆ విషయం దగ్గరకు రావడానికి ఆయన చాలా సమయం తీసుకున్నారు. మార్కెట్‌లో కాయగూరలు అమ్ముకునే అమ్మాయిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రేమించడం అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగు స్క్రీన్ మీద రాలేదు. ఆ పాయింట్ కొత్తగా ఉంది. అయితే, ఆ పాయింట్ చుట్టూ తీసిన సన్నివేశాలు చాలా రొటీన్‌గా ఉన్నాయి. ముఖ్యంగా తాను చూసిన అమ్మాయినే కొడుకు పెళ్లి చేసుకోవాలని తండ్రి పట్టుబట్టడం, తనకు నచ్చిన అమ్మాయి కోసం తండ్రిని కొడుకు ఎదిరించడం వంటివి 'బొమ్మరిల్లు'ను గుర్తు చేస్తాయి. హీరోయిన్, హీరో తండ్రి మధ్య సంభాషణ... ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య సంభాషణ మీద బొమ్మరిల్లు ప్రభావం ఎక్కువ కనబడుతుంది.
'బొమ్మరిల్లు'ను, 'మార్కెట్ మహాలక్ష్మీ'ని వేరు చేసింది పతాక సన్నివేశాల్లో చెప్పిన పాయింట్. పెళ్లి తర్వాత అబ్బాయి ఇంటికి అమ్మాయి ఎందుకు రావాలి? అనేది చక్కగా డిస్కస్ చేశారు. నటుడు హర్షవర్ధన్ చేత ఇండిపెండెంట్ అమ్మాయిలపై సమాజం వ్యక్తం చేసే అభిప్రాయాల గురించి చెప్పించిన విధానం ప్రశంసనీయం. జో ఎన్మావ్ పాటలు, సృజన శశాంక్ నేపథ్య సంగీతం పర్వాలేదు. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే.
Also Read: మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
'కేరింత' తర్వాత నటుడిగా పార్వతీశానికి 'మార్కెట్ మహాలక్ష్మీ' కమ్ బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. ఆ క్యారెక్టర్‌కు అవసరమైన డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మార్కెట్ మహాలక్ష్మీగా ప్రణీకాన్వికా నటన ఓకే. కానీ, కాస్ట్యూమ్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. ఎక్కువ సేపు ఆమెను ఓకే తరహా దుస్తుల్లో చూపించారు. ఆ డ్రస్ ఆమెకు అంతగా నప్పలేదు. ముక్కు అవినాష్ కొన్ని సీన్లలో నవ్వించారు. అయితే, అతడిని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. క్వార్ట్రర్ కృష్ణ పాత్రలో మెహబూబ్ బాషా కొంత నవ్వించారు. హర్షవర్ధన్ నటించడం వల్ల పతాక సన్నివేశాల్లో చెప్పిన సందేశానికి హుందాతనం వచ్చింది.
'మార్కెట్ మహాలక్ష్మీ'లో దర్శకుడు వీఎస్ ముఖేష్ చెప్పిన పాయింట్ మంచిదే. ఈ సినిమా చూసేటప్పుడు లోతుగా చూస్తే... కొందరిలో అయినా ఆలోచన కలిగించేదే. అయితే... కొత్త పాయింట్ చెప్పినప్పుడు అందుకు తగ్గ కొత్త సన్నివేశాలు రాసుకుని ఉంటే ఇంకా బావుండేది. రొటీన్ ఫస్టాఫ్, ఆలోచింపజేసే సెకండాఫ్... ఇదీ 'మార్కెట్ మహాలక్ష్మీ'. కామెడీతో పాటు సందేశం ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది.
Also Read: పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?