Aha Naa Pellanta Web Series Review : - 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?
OTT Review - Aha Naa Pellanta Web Series : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సిరీస్ 'అహ నా పెళ్ళంట!'. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే?
సంజీవ్ రెడ్డి
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ : అహ నా పెళ్ళంట
రేటింగ్ : 3/5
నటీనటులు : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, దీపాలి శర్మ, మధునందన్, కృతిక సింగ్, 'గెటప్' శ్రీను, భద్రమ్, 'తాగుబోతు' రమేష్, రఘు కారుమంచి, దొరబాబు, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే : షేక్ దావూద్ జి
మాటలు : కళ్యాణ్ రాఘవ్
ఛాయాగ్రహణం : నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ
నేపథ్య సంగీతం: పవన్
సంగీతం : జుడా శాండీ
నిర్మాతలు : సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా
దర్శకత్వం : సంజీవ్ రెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 17, 2022
ఓటీటీ వేదిక : జీ 5
ఎన్ని ఎపిసోడ్స్ : 8
యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ఓటీటీకి పరిచయమైన వెబ్ సిరీస్ 'అహ నా పెళ్ళంట' (Aha Naa Pellanta Web Series). ఇందులో శివానీ రాజశేఖర్ (Shivani Rajasekhar) హీరోయిన్. ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది. ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాలు, వినోదం... ఇందులో చాలా ఉన్నాయి. మరి, సిరీస్ ఎలా ఉంది (Aha Naa Pellanta Review)?
కథ (Aha Naa Pellanta Web Series Story) : శీను (రాజ్ తరుణ్) స్కూల్‌లో చదివే సమయంలో జరిగిన ఓ సంఘటన వల్ల పెళ్ళయ్యే వరకు అమ్మాయిల వైపు కన్నెత్తి చూడనని, మాట్లాడానని తల్లి సుశీల (ఆమని) కి ప్రామిస్ చేస్తాడు. పెళ్లి వరకు హనుమంతుడిలా, పెళ్లి తర్వాత రాముడిలా ఉంటానని చెబుతాడు. పెళ్ళి వరకు అలాగే ఉంటాడు కూడా! అమ్మానాన్నలతో పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో చాలా సంబంధాలు చూసి చివరకు ఒకటి ఫైనలైజ్ చేస్తారు. సరిగ్గా పెళ్ళి రోజున అమ్మాయి కనిపించదు. ప్రేమించిన అబ్బాయితో లేచిపోతున్నాని లేఖ రాసి వెళ్ళిపోతుంది. పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగడంతో శ్రీను అండ్ ఫ్యామిలీ పరువు పోతుంది. అందుకు కారణం మహా (శివానీ రాజశేఖర్) అని తెలుస్తుంది. ఆ అమ్మాయి, ఆమె కుటుంబానికి కూడా తాను అనుభవించిన బాధ తెలియాలని సరిగ్గా పెళ్ళికి ముందు రోజు శ్రీను కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? శ్రీను ఫ్లాట్‌లో ఉండటానికి మహా ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరూ ఎలా, ఎప్పుడు ప్రేమలో పడ్డారు? తనను కిడ్నాప్ చేసింది శ్రీను అని ఆమెకు తెలిసిందా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Aha Naa Pellanta Web Series Telugu Review) : 'అహ నా పెళ్ళంట' సిరీస్ స్టార్ట్ అయిన కాసేపటి తర్వాత ఇదొక వెబ్ సిరీస్ అనే సంగతి మర్చిపోతాం. దీనికి రెండు రీజన్స్. ఒకటి... రాజ్ తరుణ్. ఆయన చేసే ఎంటర్‌టైనర్స్ తరహాలో స్టార్టింగ్ ఉంది. రెండోది... సంజీవ్ రెడ్డి టేకింగ్. సినిమాలా ట్రీట్ చేశారు. అలాగే, తీశారు. కామెడీ, మధ్యలో పాట వంటి అంశాలతో ఫస్ట్ ఎపిసోడ్ సరదాగా ముందుకు వెళుతుంది. సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ దగ్గర రెగ్యులర్ వెబ్ సిరీస్ ప్యాట్రన్‌లోకి ఇదీ వెళ్ళింది.
'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ విషయంలో ముఖ్యంగా రెండు కంప్లైంట్స్ వస్తాయి. ఒకటి... రొటీన్ స్టోరీ అని! రెండు... లెంగ్త్. అమ్మాయిలను చూడనని చిన్నప్పుడు దేవుడు ముందు హీరో ప్రామిస్ చేయడం, అతడు అమ్మాయిలను చూసిన ప్రతిసారీ తండ్రికి దెబ్బ తగలడం కాన్సెప్ట్ నవ్వించింది. కానీ, దాన్ని సరిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. వెబ్ సిరీస్‌కు నిడివి సమస్య లేకపోవడంతో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయలేదేమో అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా మొదలైన సిరీస్... రెండు, మూడు ఎపిసోడ్స్‌లో నెమ్మదిస్తుంది. రాజ్ తరుణ్ ఫ్లాట్‌లో శివానీ ఎంటరైన తర్వాత మళ్ళీ క్యూరియాసిటీ పెరుగుతుంది. నిడివి కొంచెం ఎక్కువైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండటంతో చూసేయొచ్చు. కామెడీ, లవ్, ఎమోషన్స్... అన్నీ ఉన్న సిరీస్ ఇది. సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. విజువల్స్ బావున్నాయి. మాంటేజ్ సాంగ్స్ బాగా తీశారు. పాటలు ఫ్లోలో వెళ్ళిపోయాయి. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉండాలి.
నటీనటులు ఎలా చేశారు? : రాజ్ తరుణ్‌కు టైలర్ మేడ్ క్యారెక్టర్ ఇది. ఆయన కామెడీ టైమింగ్, ఎమోషన్స్ క్యారెక్టర్‌కు ప్లస్ అయ్యాయి. ఎక్కడ దొరికిపోతామో అనే సన్నివేశాల్లో ఆయన నటన బావుంది. శివానీ రాజశేఖర్ రోల్ తొలుత అబ్బాయిలపై డామినేషన్ చూపించే అమ్మాయిలా ఉంటుంది. ప్రేమలో పడ్డాక మారుతుంది. ఎండింగ్‌లో ఎమోషనల్ అవుతుంది. ఆమెది రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు. కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఆమె భావోద్వేగాలను బాగా చూపించారు. ఆమని , పోసాని కృష్ణమురళికి ఇటువంటి క్యారెక్టర్లు కొట్టిన పిండి. హర్షవర్ధన్ అదరగొట్టారు. నవ్వించాల్సిన చోట నవ్వించారు. సీరియస్ అవసరమైన చోట చూపించారు. వెబ్ సిరీస్‌కు ఆయన నటన లైఫ్ లైన్. రాజ్ కుమార్ కసిరెడ్డి కనిపించేది రెండు మూడు సన్నివేశాలే. కానీ, గోదావరి యాస & నటనతో ఎంటర్‌టైన్ చేశారు. రాజ్ తరుణ్ స్నేహితులుగా రవి శివతేజ, త్రిశూల్ జీతూరి కొన్ని సీన్స్ బాగా చేశారు. పెళ్లికి ముందు లేచిపోయిన అమ్మాయిగా దీపాలి శర్మ, హీరోతో పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయిగా కృతికా సింగ్, పెళ్లిళ్ల పేరయ్యగా భద్రమ్, ఇతర పాత్రల్లో రఘు కారుమంచి, తాగుబోతు రమేష్ తదితరులు కనిపించారు.
Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'అహ నా పెళ్ళంట' రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. కథలో రొటీన్ మూమెంట్స్ ఉన్నప్పటికీ... దర్శకుడు సంజీవ్ రెడ్డి చాలా బాగా డీల్ చేశారు. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. సినిమాలా తీశారు. మధ్యలో రెండు మూడు ఎపిసోడ్స్ కొంచెం సాదీసినట్టు ఉంటాయి. చిన్న చిన్న మిస్టేక్స్ పక్కన పెడితే ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఎక్కువ. రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెయిర్ బావుంది. వాళ్ళ కాంబినేషన్ సీన్స్ బావున్నాయి. హర్షవర్ధన్‌కు హ్యాట్సాఫ్. ఈ సిరీస్ తర్వాత యువ హీరోలకు తండ్రి నటించమని ఆయనకు ఎక్కువ అవకాశాలు రావచ్చు. ఫైనల్‌గా... 'అహ నా పెళ్ళంట' సిరీస్‌ను హ్యాపీగా చూడొచ్చు.
Also Read : 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా - అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?