Mustard Oil: చలికాలంలో చర్మాన్ని రక్షించే ఆవనూనె, ఇలా ఉపయోగించండి
Mustard Oil: చలికాలంలో ఆవనూనెతో చర్మాన్ని రక్షించుకోవచ్చు.
Mustard Oil: చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, చర్మ సమస్యలు, జ్వరం వంటివి దాడి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుండి త్వరగా బయటపడడానికి ఆవనూనె ఉపయోగపడుతుంది. ఈ నూనెను ఇంట్లో చలికాలంలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు ఆవనూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కొన్ని తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఈ, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. అలాగే వేడిని అందిస్తాయి. ఆవనూనెతో వండిన వంటకాలు తినడం వల్ల ఎంత ఉపయోగం ఉందో దీన్ని చర్మానికి రాసుకోవడం వల్ల కూడా అంతే ఉపయోగం కలుగుతుంది.
ఛాతీపై సున్నితంగా మర్దన చేసుకోవడం వల్ల అక్కడ పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. ముక్కు దిబ్బడ కట్టినట్లయితే వేడి నీటిలో ఆవాల నూనె వేసి ఆవిరి పట్టితే మంచి ఉపసమనం కలుగుతుంది. నీళ్లలో రెబ్బలు, ఆవనూనె వేసి కాసేపు ఉడికించాలి. ఆ నీటిని ఒక డబ్బాలో వేసి దాచుకోవాలి.అందులోని రెండు చుక్కలను ముక్కులో వేసుకోవాలి. ఇలా చేస్తే జలుబు త్వరగా తగ్గుతుంది. గుండెకి కూడా ఆవనూనె ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆవనూనెతో వండిన ఆహారాలను తింటే మంచిది. వంటకాల తయారీలో రెండు చెంచాల ఆవ నూనెను కూడా వేసి వండితే చాలా మేలు. గుండెపోటు వంటివి రాకుండా ఇది కాపాడుతుంది.
ఆర్ధరైటిస్‌తో బాధపడేవారు ఆవనూనెను గోరువెచ్చగా చేసి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి కాళ్లవాపులు, చేతులు వాపులు తగ్గుతాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో కూడా ఇది ముందుంటుంది. ఎన్నో రకాల క్యాన్సర్లను తగ్గించే శక్తి దీనికి ఉంది. అలాగే ఆస్తమా, పంటి నొప్పి, దగ్గు వంటి వాటికీ కూడా చెక్ పెడుతుంది. కాబట్టి ఈ నూనెను చర్మానికి మసాజ్ చేయడంతో పాటు రోజుకి కనీసం రెండు స్పూన్ల నూనెను ఆహారంలో భాగం చేసుకుని తింటే ఎంతో మంచిది.
ఆవనూనెతో వండిన వంటకాలు తినడం వల్ల మూత్రపిండాల సమస్యల రాకుండా ఉంటాయి. అలాగే హైపర్ థైరాయిడ్ రాకుండా ఇది అడ్డుకుంటుంది. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవడం ఆవనూనె ముందుంటుంది. ముఖానికి ఈ నూనెను రాసుకోవడం వల్ల గీతలు, ముడతలు రాకుండా ఉంటుంది. పగిలిన పెదవులకు ఈ నూనె రాస్తే అవి సున్నితంగా మారుతాయి. టాన్‌ను పోగొడుతుంది. చర్మం అందంగా మారుతుంది.
Also read: మీరు ఆల్కహాల్ తాగకపోయినా ఈ అలవాట్లతో కాలేయ సమస్యలు వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.