Types of Fasting: ఉపవాసాలు ఇన్ని రకాలా? ఈ సమస్యలు ఉన్నవాళ్లు ఫాస్టింగ్ జోలికి అస్సలు వెళ్లకూడదు!
ఉపవాసం అనగానే ఫలానా టైమ్ నుంచి ఫలానా టైమ్ వరకు ఏం తినకూడదు అనుకుంటారు. కానీ, ఉపవాసాలలో చాలా రకాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా?
Types of Fasting: నిర్ణీత టైమ్ వరకు ఏమీ తినకుండా, తాగకుండా ఉండటాన్ని ఉపవాసం అంటారు. కొంత మంది మతపరమైన ఆచారంగా ఉపవాసం చేస్తే, మరికొంత మంది బరువు, షుగర్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉపవాసం ఉంటారు. అయితే, ఫాస్టింగ్ ఉండే ముందు డాక్టర్ సలహా పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.
ఉపవాసంలో రకాలు
1. సుదీర్ఘ ఉపవాసం
సాధారణంగా.. సుదీర్ఘ ఉపవాసం ఏడు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు చేస్తారు. ఈ ఉపవాసంలో ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతారు. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ఉపవాసం బరువు, షుగర్ కంట్రోల్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. కొత్త క్యాలరీలను తీసుకోవడంతో పాటు హార్మోన్ల సమతుల్య ఏర్పడుతుంది. ఫుడ్ ను త్వరగా ప్రాసెస్ చేయడంలో ఉపయోగపడుతుంది. అయితే, ఒక్కోసారి తగినంత కేలరీలు లభించక కండరాల పనితీరులో తేడాలు, చెమట, మూత్రం ద్వారా ఎలక్ట్రోలైట్స్ కోల్పోవడం లాంటివి జరుగుతాయి. గుండె సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు, బరువు తక్కువగా ఉన్న వాళ్లు ఈ ఉపవాసం చేస్తే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.
2. అప్పుడప్పుడు ఉపవాసం
అడపాదడపా ఉపవాసం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఈ ఉపవాసంలో టైమ్ రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్, ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్, మోడీఫైడ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్, పీరియాడిక్ ఫాస్టింగ్ ఉంటాయి.
1. మోడీఫైడ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్
ఇది ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్‌తో పోల్చితే కాస్త తక్కువ వెర్షన్ ఉపవాసంగా చెప్పుకోవచ్చు. అంటే, ఈ ఫాస్టింగ్ సమయంలో సుమారు 500 కేలరీల శక్తిని ఇచ్చే ఫుడ్ తీసుకోవచ్చు.
2. పీరియాడిక్ ఫాస్టింగ్
నెలకు ఓసారి లేదంటే రెండుసార్లు ఈ ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసం 24 గంటల పాటు కొనసాగుతుంది. ఈ ఉపవాసం సమయంలో తక్కువ మోతాదులో కేలరీలు ఇచ్చే ఫుడ్ తీసుకోవచ్చు.
3. టైమ్ రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్
ఈ ఉపవాసంలో రోజుకు ఒకేసారి ఫుడ్ తీసుకుంటారు. భోజనానికి, భోజనానికి నడుమ సుమారు12 నుంచి 20 గంటల గ్యాప్ ఉంటుంది.
4. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్
రోజు తప్పించి రోజు ఉపవాసం చేస్తారు. అంటే, 24 గంటల పాటు ఉపవాసం చేస్తే, మరో 24 గంటల పాటు సాధారణంగా ఫుడ్ తీసుకుంటారు.
ఉపవాసంతో ఆరోగ్య ప్రయోజనాలు
ఉపవాసం చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. చాలా మంది బరువు కంట్రోల్ కోసం అడపాదడపా ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసంతో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. కండరాల పనితీరును మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సైతం అదుపులోకి వస్తాయి.
మతపరమైన ఉపవాసం
ఇది భక్తి, విశ్వాసానికి సంబంధించిన ఉపవాసం. మహాశివరాత్రి సమయంలో హిందువులు, రోజంతా ఉపవాసం ఉంటారు. అలాగే రంజాన్ మాసంలో ముస్లీంలు నెల రోజుల పాటు ఉపవాసం ఉంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ద్రవ, ఘన ఆహారం తీసుకోరు.
ఉపవాసంతో ఇబ్బందులు
ఉపవాసంతో లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. డయాబెటిస్‌తో బాధ పడుతున్న వారిలో ఉపవాసం ఒక్కోసారి వ్యాధి తీవ్రతను పెంచే అవకాశం ఉంటుంది. సరైన ఉపవాస పద్దతులు పాటించకపోతే, రెగ్యులర్ బాడీ రిథమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫలితంగా కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు ఉపవాసం సమయంలో వైద్యుడి సలహాలు తీసుకోవడం మంచిది.
వీళ్లు అస్సలు ఉపవాసం చేయకూడదు
సాధారణంగా గర్భిణీలు, బాలింతలు ఉపవాసం చేయకూడదు. డయాబెటిస్, హార్ట్ సంబంధ సమస్యలకు మెడిసిన్ తీసుకునే వాళ్లు కూడా ఉపవాసం చేయకూడదు. లోబీపీ ఉన్న వాళ్లు ఉపవాసం చేయడం వల్ల మూర్చ వచ్చే అవకాశం ఉంటుంది.
సేఫ్ గా ఉపవాసం ఎలా చేయాలి?
ఉపవాసానికి ముందు, తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలా చేయడం వల్ల ఉపవాసం సమయంలో పోషకాలు శరీరానికి అందుతాయి. ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ తో కూడిన ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు కోల్పోయే అవకాశం ఉండదు. ఉపవాసం సమయంలో ఆల్కాహాల్, కెఫిన్ ఉన్న డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది. వికారం, రక్తపోటు, అలసట ఉన్న వాళ్లు ఉపవాసం చేయకూడదు.
Also Read: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!