Herbal Tea: చలికాలంలో కచ్చితంగా తాగాల్సిన హెర్బల్ టీ ఇది
Herbal Tea: చలికాలం వచ్చిందంటే ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Herbal Tea: శీతాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు చాలా తగ్గిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. శరీరానికి తగినంత ఉష్ణోగ్రత అందితేనే అది ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఎంతోమంది చలికాలంలో కాఫీ, టీలు తాగడానికి ఇష్టపడతారు. అయితే ఎన్ని సాధారణ టీ, కాఫీలు తాగినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ హెర్బల్ టీని తాగడం వల్ల శరీరానికి ఉష్ణోగ్రత అందడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది.
ఇంట్లో ఉండే మసాలాలతోనే ఈ హెర్బల్ టీ ని ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. చిన్న దాల్చిన చెక్క ముక్క, మూడు యాలకులు, ఐదు మిరియాలు తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ పొడిని వేయాలి. అందులోనే అర స్పూను అశ్వగంధ పొడిని, పావు స్పూను పొడిని కూడా వేసి మరిగించాలి. ఒక పది నిమిషాలు మరిగాక దాన్ని వడకట్టి కప్పులో పోసుకోవాలి. వేడివేడిగా ఈ టీ ని తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
చలికాలంలో గ్యాస్, కడుపుబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం సరిగా అరగకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేసే శక్తి ఈ హెర్బల్ టీ కి ఉంది. జీర్ణ వ్యవస్థను ఇది బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ముందుంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఇది కాపాడుతుంది. చాలామంది చలికాలంలో రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ టీ తాగడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. శరీరంలో అధికంగా ఉండే కొవ్వును ఇది కరిగిపోయేలా చేస్తుంది. మానసిక ఆందోళన, ఒత్తిడితో బాధపడే వారికి కూడా ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ముఖ్యంగా ఈ హెర్బల్ టీ చలికాలంలో శరీరానికి చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి రోజుకి కనీసం రెండుసార్లు ఈ టీ ని తయారు చేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. చలికాలంలో మాత్రమే ఈ టీ ని తాగితే మంచిది. వేసవిలో ఈ టీ ఎక్కువగా తాగితే వేడి చేసే అవకాశం ఉంది.
Also read: మీరు ఆల్కహాల్ తాగకపోయినా ఈ అలవాట్లతో కాలేయ సమస్యలు వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.