వీటిని ఫ్లూ లక్షణాలు అనుకుంటున్నారా, గుండెపోటుకు సంకేతాలు కూడా కావచ్చు
చాలా మంది కొన్ని లక్షణాలను తక్కువ అంచనా వేస్తారు. కానీ అవే ప్రాణాంతక పరిస్థితికి తీసుకెళ్తాయి.
ఫ్లూ ఇన్ఫెక్షన్‌కు, గుండె పోటుకు మధ్య సంబంధమే లేదు. అందుకే ఫ్లూ వైరస్ సోకితే కనిపించే కొన్ని లక్షణాలను చాలా తేలికగా తీసుకుంటారు ఎంతో మంది. ఆ లక్షణాలు గుండెపోటుకు కూడా సంకేతాలు కావచ్చు అంటున్నాయి అధ్యయనాలు. ఫ్లూ అనేది ముక్కు,గొంతు, ఊపిరితిత్తులను ఇబ్బంది పెట్టే వైరల్ ఇన్ఫెక్షన్. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA)చెప్పిన ప్రకారం లిజ్ జాన్సన్ అనే మహిళకు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఏవీ లేవు. కుటుంబచరిత్రలో కూడా ఆమెకు ఆ జబ్బుల జాడ లేదు. అయితే ఆమెకు ఓసారి హఠాత్తుగా ఫ్లూ సోకిన లక్షణాలు కనిపించాయి. ఆమె ఫ్లూ ఇన్ఫెక్షన్ అని మాత్రమే అనుకుంది. తీరా ఆసుపత్రికెళ్లి పరీక్షలు నిర్వహిస్తే ఆమెకు గుండెపోటు వచ్చినట్టు తేలింది. అందుకే ఫ్లూ లక్షణాలను తక్కువ అంచనా వేయద్దని హెచ్చరిస్తోంది అమెరికా హార్ట్ అసోసియేషన్.
వికారం, తలతిరగడం...
ఫ్లూ వచ్చినప్పుడు వికారంగా అనిపిస్తుంది, అలాగే గుండె పోటు రాబోయే ముందు కూడా వికారంగా అనిపిస్తుంది. అది గుండెపోటు రావడానికి ముందు సాధారణ లక్షణం. అధిక జ్వరం, తలనొప్పి, కండారల నొప్పులు, దగ్గు, గొంతునొప్పి, అలసట... ఇవన్నీ కేవలం ఫ్లూకు సంబంధించినవే అనుకోవద్దు. అవి ఒక్కోసారి గుండె పోటును కూడా సూచిస్తాయి. తల తిరగడం గుండెపోటుకు లేదా స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు. ఇది ఎక్కువగా అనిపిస్తే ఇంట్లోనే ఉండిపోకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోవడం ఉత్తమం. తల తిరగడంతో పాటూ ఊపిరి అందకపోవడం, ఛాతీనొప్పి వంటివి కూడా గుండెపోటుకు సంబంధించినవే.
ఒళ్లంతా చెమటలు పట్టడం, అతిగా చలి వేయడం గుండెపోటు సంకేతాలలో ఒకటి. వీటితో పాటూ విపరీతమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా, గుండె దడ వచ్చినా కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఫ్లూ అధికంగా ఉన్నప్పుడు మైకంగా ఉంటుంది, ఛాతీ నొప్పి కూడా ఉంటుంది. వీటిని కేవలం ఫ్లూ లక్షణంగా భావించవద్దు. కార్డియాలజిస్టును కలవడం అవసరం. ఎందుకంటే మైకం కమ్మడం అనేది కూడా గుండె పోటు సంభవించే ముందు కనిపించే ఓ లక్షణం.
అలసట
చాలా మంది నిర్లక్ష్యం చేసే అంశం అలసట. అలసటగా ఉంటే పడుకుని రెస్ట్ తీసుకుంటారు కానీ దాన్ని సీరియస్‌గా తీసుకోరు. అలసటగా అనిపించడం అనేది గుండె పోటు లక్షణమే. గుండె పోటు వల్ల గుండెపై అదనపు ఒత్తిడి పడి అలసటగా అనిపిస్తుంది. ఈ సమయంలో రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడుతుంది గుండె. మీకు తీవ్ర అలసట అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలవడం ఉత్తమం.
Also read: అరటి పండ్లను రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యమో తెలుసా?
Also read: మనుషులను వేటాడే చివరి గిరిజన తెగ, ఆ తెగ నాయకుడికి అరవై మంది భార్యలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.