Viral: మనుషులను వేటాడే చివరి గిరిజన తెగ, ఆ తెగ నాయకుడికి అరవై మంది భార్యలు
చాలా వింతైన గ్రామం. కానీ ఆ గ్రామం ఉన్నట్టు కూడా ఎక్కువ మందికి తెలియదు.
అడవుల్లో జంతువులను వేటాడే గిరిజన తెగల గురించి విన్నాం, కానీ ఈ తెగవారు మాత్రం మనుషులనే వేటాడుతారు. మనదేశంలో మనుషులను చంపే గిరిజన జాతుల్లో వీరే చివరివారై ఉంటారని భావిస్తున్నారు చరిత్రకారులు. ఈ తెగ పేరు కొన్యాక్. ప్రధానంగా నాగాలాండ్‌లోని సరిహద్ధుల్లో నివసిస్తారు. ఇప్పుడు మనుషులను చంపే ఆచారాలను మానుకున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ప్రత్యర్థి తెగల వారి తలలను నరికేసే వారు. ఆ ఊళ్లో ఉన్న 83 ఏళ్ల వ్యక్తి మెడలో నాలుగు పుర్రె ఆకారపు ఇత్తడి ముఖాలు కనిపిస్తాయి. అంటే అర్థం ఆయన వయసులో ఉన్నప్పుడు నలుగురు వ్యక్తుల తలలను నరికాడు అని అర్థం. పెళ్లి చేసుకునే అమ్మాయి కోసమో, లేక తెగల మధ్య గొడవలు వచ్చినప్పుడో, ఆస్తి కోసమో... ఇలా ఇతర తెగల వారి తలలను నరికితే అదో పెద్ద గొప్పగా భావిస్తారు కొన్యాక్ తెగలో. అంతేకాదు ఆ పుర్రె ఆత్మ శక్తిని కలిగి ఉంటుందని, అలా తల నరకడం వల్ల తమ వంశం శ్రేయస్సు, సంతానోత్పత్తి పెరుగుతుందని భావిస్తారు. నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో ఉంది లాంగ్వా గ్రామం. ఈ గ్రామం చాలా ప్రత్యేకమైనది. ఈ గ్రామం నిండా కొన్యాక్ తెగ ప్రజలే నివసిస్తారు. వీరిని చూసేందుకు పర్యాటకులు ఎంతో మంది వస్తారు.. ఇది మయన్మార్ దేశ సరిహద్దుల్లో ఉంది. అందుకే ఇక్కడున్న ప్రజలకు రెండు దేశాల పౌరసత్వాలు ఉన్నాయి. అంతేకాదు ఈ గ్రామం నుంచి మయన్మార్ సైన్యంలో చేరేవారు ఎంతో మంది. ఈ ఊరి పెద్ద ఇల్లు సగం ఇండియాలో, సగం మయన్మార్ భూభాగంలో ఉంటుంది. ఆ గ్రామానికి వెళితే ఇండియా, మయన్మార్లలో ఒకేసారి నివసించవచ్చన్న మాట. గ్రామధిపతి ఇల్లు చూసేందుకు చాలా వింతగా ఉంటుంది. రకరకాల పరికరాలు, ఆకృతులతో నిండి ఉంటాయి. ఆ గ్రామానికి వెళితే ఇతడి ఇల్లు కచ్చితంగా చూడాల్సిందే.
విచిత్ర ముఖాలు
ఇప్పటికీ కొన్యాక్‌లు విచిత్రంగా తయారవుతుంటారు. ముఖం, శరీరం నిండా పచ్చబొట్టు వేయించుకుంటారు. అలా వేయించుకోవడం వారి తెగను సూచిస్తుందని చెబుతారు. తలపై అడవి పంది వెంట్రుకలతో చేసిన టోపీని ధరిస్తారు. మెడనిండా పూసలతో కూడిన దండలు ఉంటాయి. వస్త్రాధారణ కూడా నిండుగా ఉండదు. ఇక వీరు ముఖ్య నాయకుడు ‘ఆంఘ్’. వంశపారంపర్యంగా ఒక కుటుంబానికి చెందిన వారే నాయకుడిగా ఉంటారు. అతనికి 60 మంది దాకా భార్యలు ఉన్నారు. నాయకుడు ఏం చెబితే తెగ వారంతా అది శిరసావహిస్తారు. వారి ఇల్లు, పరికరాలు అన్నీ విచిత్రంగా ఉంటాయి. అందుకే పర్యాటకులు వందలాదిగా వెళుతుంటారు. విచిత్రంగా ఉండే కొన్యాక్‌లతో ఫోటో దిగాలంటే వారికి డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం అధికంగా పర్యాటకం మీదే ఆధారపడి జీవిస్తున్నారు ఆ తెగవారు. ఈ గ్రామానికి దగ్గర్లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
Also read: మగవారు మధ్యలోనే ప్రేమకు బ్రేకప్ చెప్పడానికి ముఖ్య కారణాలు ఇవే
Also read: చెవులు కుట్టించడం ఆభరణాలకు కాదు, దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, చెబుతున్న ఆయుర్వేదం