Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
YSRCP: మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని కేంద్రం సమర్థించడం వైసీపీకి సమస్యగా మారింది. పీపీపీ విధానంపై ఆరోపణలు చేస్తే కేంద్రాన్ని కూడా నిందించినట్లు అవుతుంది.

Medical college PPP policy : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలల నిర్వహణపై పీపీపీ విధానం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రైవేటీకరణ గా అభివర్ణిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం , పార్లమెంటరీ కమిటీల నుంచి ఈ విధానానికి లభిస్తున్న మద్దతు వైసీపీని ఇరకాటంలోకి నెట్టింది.
పీపీపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నవైఎస్ఆర్‌సీపీ
ఏపీలో పది కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణకు పీపీపీ విధానాన్ని అమలు చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇప్పటికే కోటి సంతకాల సేకరణతో ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ, ఇది పేదల వైద్యానికి తీరని ద్రోహమని ఆరోపిస్తోంది. అయితే, ఈ పోరాటంలో ఆ పార్టీకి ఇప్పుడు స్వంత ఎంపీల నుంచి, అటు కేంద్రం నుంచి అనూహ్య సవాళ్లు ఎదురవుతున్నాయి. వైద్య విద్యలో పీపీపీ విధానం మేలని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టమైన సిఫార్సులు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కమిటీలో వైసీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి సభ్యుడిగా ఉన్నారు. ఈ అంశంపై టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టిన గురుమూర్తి.. తాము పీపీపీని కేవలం కొత్త ప్రాజెక్టులకే సూచించామని, ఇప్పటికే పూర్తైన లేదా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని వివరణ ఇచ్చారు. అయితే, కమిటీ నివేదికపై సంతకం చేసిన తర్వాత ఇప్పుడు బయట వ్యతిరేకించడం రాజకీయంగా వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారింది.
కేంద్రం అండ 40 శాతం సబ్సిడీ ఆఫర్
పీపీపీ విధానాన్ని ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తున్న వైసీపీకి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రభుత్వానికి రాసిన లేఖ రూపంలో పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని, ఇది మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన సమర్థించారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టులకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 30 నుంచి 40 శాతం వరకు మూలధన సబ్సిడీని కేంద్రం అందిస్తుందని, నిర్వహణ వ్యయంలోనూ 25 శాతం భరిస్తామని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో వైసీపీ చేస్తున్న అవినీతి ఆరోపణలు తేలిపోయినట్లయింది.
కేంద్రాన్ని నిందిస్తూ వైసీపీ పోరాటం కొనసాగిస్తుందా?
ఇప్పుడు పీపీపీ విధానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తే బీజేపీపైనా ఆరోపణలు చేసినట్లే. కేంద్రంపై కూడా యుద్ధం చేసినట్లే. ఢిల్లీ స్థాయిలో బీజేపీతో సఖ్యతగా ఉంటూ, రాష్ట్రంలో మాత్రం అదే బీజేపీ మద్దతు ఇస్తున్న విధానాలను వ్యతిరేకించడం వైసీపీకి సవాలుగా మారింది. ఇప్పటికి ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తూ వైసీపీ ఉద్యమాలు చేసే పరిస్థితుల్లో లేదు. అందుకే ఈ నిందను కేవలం చంద్రబాబుపైకి నెట్టేందుకే వైసీపీ మొగ్గు చూపుతోంది. అయితే ఇప్పుడు వెనక్కి తగ్గితే వైసీపీ పోరాటం నవ్వుల పాలవుతుంది. అందుకే పీపీపీ విధానం ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందదని, మెనేజ్మెంట్ కోటా సీట్లను రూ. 60 లక్షల వరకు అమ్ముకుంటారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన వైసీపీ, అవసరమైతే కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. మొత్తం మీద, ఒకవైపు కేంద్రం నుంచి 40% సబ్సిడీ హామీ , పార్లమెంటరీ కమిటీ క్లీన్ చిట్ ఉండటంతో, వైసీపీ చేస్తున్న ప్రైవేటీకరణ ప్రచారం క్షేత్రస్థాయిలో తేలిపోతోందన్న భావన వ్యక్తమవుతోంది.





















