Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Rule Changes From January: జనవరి 1 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. LPG ధరలతో పాటు బ్యాంకింగ్, కార్లకు సంబంధించిన మార్పులు మీ జేబుపై ప్రభావం చూపనున్నాయి.

Rule Changes From 1st January: కొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగిసిపోయి, నూతన సంవత్సరం రాబోతోంది. జనవరి 1, 2026 నుండి కేవలం క్యాలెండర్ మాత్రమే మారదు. మన జేబులు, ప్రణాళికలు, రోజువారీ పనులపై నేరుగా ప్రభావం చూపే అనేక నియమాలు సైతం మారతాయి. బ్యాంకింగ్ నుండి ప్రభుత్వ సేవలు, వాహనాల ధరలు, LPG గ్యాస్ వరకు నూతన సంవత్సరం నుండి ఈ మార్పులు కనిపిస్తాయి. ప్రతి నెలా కొత్త తేదీ రోజు మార్పులు ఉండటం సహజం. నూతన సంవత్సరం కావడంతో ఏమి చేయాలో సకాలంలో అర్థం చేసుకోవడం ముఖ్యం. జనవరి 1, 2026 నుండి ఏయే విషయాలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం.
LPG, ఇంధన ధరలు
జనవరి 1న డొమోస్టిక్, కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్షిస్తారు. డిసెంబర్‌లో వాణిజ్య సిలిండర్ ధర 10 రూపాయల మేర తగ్గింది. అందువల్ల, గృహ సిలిండర్ ధరలో కూడా ఉపశమనం లభించవచ్చని ప్రజలు ఆశించవచ్చు. అలా జరిగితే, నెలవారీ బడ్జెట్ కొంచెం తేలికవుతుంది. దీంతో పాటు విమాన ఇంధన ధరలలో మార్పులు ఉండవచ్చు. దీని ప్రభావం విమాన టిక్కెట్ల ధరలపై నేరుగా పడుతుంది. ఇంధనం ఖరీదైతే విమాన ప్రయాణాలు మరింత ఖరీదవుతాయి, చౌకైతే టిక్కెట్ల ధరలు కాస్త తగ్గుతాయి.
కారు కొనడం మరింత ఖరీదు
2026లో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఖర్చు పెరగడానికి సిద్ధంగా ఉందని గమనించాలి. జనవరి నుండి అనేక ఆటో కంపెనీలు కార్లు, బైకుల ధరలను పెంచబోతున్నాయి. హోండా తన కార్ల ధరలను 1 నుండి 2 శాతం వరకు పెంచవచ్చు. నిస్సాన్ సుమారు 3 శాతం, MG 2 శాతం వరకు పెంచడానికి ప్లాన్ చేస్తోంది. BYD సీలియన్ 7 నూతన సంవత్సరంలో మరింత ఖరీదవుతుంది. మెర్సిడెస్-బెంజ్ 2 శాతం పెరుగుదలను సూచించింది. అయితే BMW కార్లు 3 శాతం వరకు ఖరీదయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు మార్పులు
జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఎందుకంటే 7వ వేతన సంఘం డిసెంబర్ 31న ముగుస్తుంది. దీంతో పాటు ద్రవ్యోల్బణ భత్యం పెరిగే అవకాశం ఉంది. అంటే కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల జీతాలలో నేరుగా ప్రయోజనం చేకూరనుంది. హర్యానా వంటి కొన్ని రాష్ట్రాలు పార్ట్ టైమ్, రోజువారీ కూలీల కనీస వేతనాన్ని పెంచడంపై కూడా పనిచేస్తున్నాయి.
ఆధార్, పాన్, బ్యాంకింగ్ రూల్స్
పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2025గా ఉంది. ఈ పని చేయకపోతే, జనవరి 2026 నుండి పాన్ యాక్టివ్ లో ఉండదు. దీని ప్రభావం బ్యాంకింగ్, పెట్టుబడులు, ITR ఫైలింగ్‌పై ఉంటుంది. అంతేకాకుండా కొత్త ITR ఫారం రావచ్చు. ఇందులో ముందుగా నింపిన బ్యాంక్, ఖర్చుల సమాచారం ఉంటుంది. బ్యాంకింగ్ నియమాలలో కూడా మార్పులు ఉంటాయి. క్రెడిట్ స్కోర్ ఏజెన్సీలు ఇప్పుడు ప్రతి వారం డేటాను అప్‌డేట్ చేయనున్నాయి. గతంలో ఇది 15 రోజులకు ఒకసారి జరిగేది. అంటే లోన్, కార్డుకు సంబంధించిన ప్రభావం త్వరగా కనిపిస్తుంది.






















