Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Telangana Assembly Sessions | తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది.

Former Sarpanches in Telangana | హైదరాబాద్: తెలంగాణ మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లుల కోసం చేపట్టిన 'చలో అసెంబ్లీ' ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, గతంలో గ్రామ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో తమ బకాయిలను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో అసెంబ్లీని ముట్టడించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు.
సీఎం, మంత్రులపై ఒత్తిడి తేవాలని ఛలో అసెంబ్లీ..
అసెంబ్లీకి వెళ్లే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) వ్యవస్థాపక అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ కోరారు. సర్పంచుల ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు వివిధ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచే అరెస్టులు ప్రారంభించడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ఆదర్శంగా గ్రామాలను తీర్చిదిద్దేందుకు అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు, నేడు బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా పాలన అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వంలో మాజీ సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగయ్యతో పాటు పలు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్‌లకు రూ. 531 కోట్ల బిల్లులను చెల్లించాల్సి ఉంది.

అసెంబ్లీ ఎదుట తమ పెండింగ్ బకాయిల కోసం డిమాండ్ చేస్తున్న సమయంలో ఓ మాజీ సర్పంచ్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయన నేలపై పడిపోగా, పోలీసులు ఆయనను అంబులెన్సులో అక్కడి నుంచి తరలించారు. మిగతా సర్పంచులు మాత్రం తమకు బకాయిలు త్వరగా చెల్లించాలని, జీవితాలు నాశనం చేసుకున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లు గడిచినా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.






















