Revanth Reddy Meets KCR: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Assembly Assembly Sessions | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు.

Revanth Reddy Meets KCR in Assembly | హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతంతో సభ ప్రారంభమైంది. అనంతరం తొలిరోజు సభలో ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (తుంగతుర్తి), కొండా లక్ష్మారెడ్డి (చేవెళ్ల)లకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి నివాళులు అర్పించారు. వారు చేసిన సేవల్ని ఈ సందర్భంగా సభ్యులు స్మరించుకున్నారు. దివంగత నేతల కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
కేసీఆర్‌ను కలిసి అప్యాయంగా పలకరించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రెండేళ్ల తరువాత అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్ లో కూర్చున్నారు ప్రతిపక్ష నేత కేసిఆర్. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూ పలకరించారు. కేసీఆర్ సీటు వద్దకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు. కేసీఆర్ ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు ఉన్నారు.

కేసీఆర్ ను కలిసిన వారిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్ లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు ఉన్నారు. జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ కేసీఆర్‌ను కలిసి ప్రత్యేకంగ ఆశీర్వాదం తీసుకున్నారు. జనగణమన ఆలపించిన అనంతరం తర్వాత హరీష్ రావు తో పాటు బయటికి వచ్చిన కేసీఆర్ తిరిగి నంది నగర్ నివాసానికి వెళ్లిపోయారు.

తొలిరోజు కార్యకలాపాల తర్వాత సభను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర వేడుకలు ఉండటతో డిసెంబర్ 30 నుండి జనవరి 1 వరకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. నేడు సభ వాయిదా పడిన తర్వాత జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించనున్నారనే దానిపై స్పష్టత రానుంది. ఈ శీతాకాల సమావేశాలు 3, 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే కనీసం పది రోజుల నుంచి రెండు వారాలపాటు సభలో అన్ని అంశాలపై చర్చకు బీఆర్ఎస్ కోరుతోంది.






















