KCR vs Revanth: తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ సెగలు.. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, సభలో వాటర్ వార్!
Telangana Assembly Sessions | వ్యూహాల్లో రాజకీయ చాణక్యుడిగా పేరొందిన మాజీ సీఎం కేసీఆర్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రతిపక్ష నేతగా ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. దూకుడైన నేతగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సీఎం హోదాలో, వ్యూహాల్లో రాజకీయ చాణక్యుడిగా పేరొందిన మాజీ సీఎం కేసీఆర్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రతిపక్ష నేతగా ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. తొలి బడ్జెట్ సమావేశాల్లో కేవలం గవర్నర్ ప్రసంగంలో పాల్గొన్న కేసీఆర్, ఇప్పుడు అసెంబ్లీ చర్చల్లో పాల్గొనేందుకు హాజరవుతున్నట్లు గులాబీ పార్టీ నేతలు చెబుతుండటంతో ఈ అసెంబ్లీ సమావేశాలు రక్తి కట్టనున్నాయి.
సభలో రేవంత్ వర్సెస్ కేసీఆర్..
గతంలో వైఎస్ వర్సెస్ చంద్రబాబు, ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్య చర్చలు, వాగ్యుద్ధాలు ఆద్యంతం ఆకట్టుకునేవి. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఆ రకమైన చర్చ తెలంగాణ అసెంబ్లీలో కానరాలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ సమావేశాలు చప్పగా జరిగేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతగా కేసీఆర్ శాసనసభలో పాల్గొనకపోవడంతో సమావేశాలు కళ తప్పాయి. అయితే ఈ సమావేశాల్లో కేసీఆర్ కూడా హాజరు కావాలని నిర్ణయించుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ సీఎం కేసీఆర్ మధ్య చర్చలు హాట్ హాట్‌గా సాగుతాయన్న చర్చ నెలకొంది.
శాసనసభ సమావేశాలకు పక్కా వ్యూహంతో కేసీఆర్
గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న గులాబీ బాస్ కేసీఆర్, ఇటీవలే ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఇవే అంశాలను శాసనసభ వేదికగా కేసీఆర్, అధికార పార్టీకి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. కృష్ణా నదీ ప్రాజెక్టులను కేంద్ర బోర్డుకు (KRMB) అప్పగించడం వంటి అంశం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు అనే అంశంపై సభలో చర్చించేందుకు బీఆర్ఎస్ పట్టుబట్టనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90.81 టీఎంసీల నికర కేటాయింపులతో ఈ ప్రాజెక్టును రూపొందించామని, భవిష్యత్తులో దీనిని 170 టీఎంసీలకు పెంచాలనేది తమ వ్యూహమని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.
దాదాపు రూ. 27,000 కోట్లు ఖర్చు చేసి 88% నుంచి 90% వరకు పనులు పూర్తి చేశామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పనులను పూర్తి చేసే విషయంలో జాప్యం చేస్తోందన్నది కేసీఆర్ వాదన. ఇదే అంశాన్ని శాసనసభలో చర్చకు పెట్టాలని కోరే అవకాశం ఉంది. కేంద్రం ఈ ప్రాజెక్టు డీపీఆర్ (DPR)ను వెనక్కి పంపినా రేవంత్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని ఇప్పటికే కేసీఆర్ విమర్శించారు. దీనిపైన శాసనసభలో కేసీఆర్ అధికార పార్టీకి ప్రశ్నలు సంధించనున్నారు.
కేసీఆర్ ఆరోపణలను తిప్పికొట్టే వ్యూహంతో రేవంత్ రెడ్డి
ఇంతకుముందు ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై శాసనసభలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంత్రులతోనూ ఈ మేరకు చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏ కోణంలో ప్రశ్నలు సంధిస్తుంది, ఎలా దాన్ని తిప్పికొట్టాలి అన్న అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించినట్లు తెలిసింది. మంత్రులంతా ఈ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యుల ఆరోపణలను తిప్పికొట్టేందుకు పూర్తి సమాచారంతో సిద్ధపడాలని సూచించారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీల వాటాకే కేసీఆర్ అంగీకరించి, రాష్ట్రానికి 'మరణశాసనం' (Death Warrant) రాశారని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేసీఆర్ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. దీనిపై శాసనసభలో మరింత వివరణాత్మకంగా కేసీఆర్ ఆరోపణలను తిప్పికొట్టే అవకాశం ఉంది.
తెలంగాణకు 512 టీఎంసీలు రావాలన్నది కాంగ్రెస్ సర్కార్ చేస్తోన్న వాదన. ఇక పాలమూరు ప్రాజెక్టుకు జూరాల నుంచి నీరు తీసుకోవాల్సింది పోయి, కమీషన్ల కోసం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడం వల్ల ప్రాజెక్టు జాప్యమైందన్నది రేవంత్ సర్కార్ కేసీఆర్ పై చేస్తోన్న విమర్శ. కేసీఆర్ తన హయాంలోనే నీటి వాటాలను తగ్గించేలా కేంద్రానికి లేఖలు రాశారని, ఇప్పుడు నిందలు తమపై వేస్తున్నారని చెబుతున్నారు. శాసనసభలో కేసీఆర్ చేసే ప్రతి ఆరోపణను తిప్పికొట్టే వ్యూహంతో కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. "అసెంబ్లీకి రావాలి" అన్న సవాల్‌ను స్వీకరించి, సభలోనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.
రెండేళ్ల పాలనపై గులాబీ పార్టీ, పదేళ్ల పాలనపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం
ఈ శాసనసభ సమావేశాల్లోనే తెలంగాణ నీటి అంశాలు, ప్రాజెక్టులపై చర్చించడంతో పాటు రెండేళ్ల కాంగ్రెస్ పాలనపైన శాసనసభలో ప్రస్తావన తేనుంది. రైతు సమస్యలను గులాబీ పార్టీ ప్రధానంగా సభలో ఎత్తిచూపే అవకాశం ఉంది. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతులకు లబ్ధి చేకూరలేదని నిలదీసే అవకాశం ఉంది. ఎరువుల కొరత, ధాన్యం కొనుగోలు అంశాల పైన బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయాలన్న యోచనలో ఉన్నారు.
అదే రీతిలో ఆరు గ్యారంటీల అమలు తీరుపైన కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగట్టాలన్న యోచనలో గులాబీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ సభ్యులు పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అంశాలపైన విరుచుకపడే వ్యూహంతో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్, ఈ-కార్ రేస్ కేసుల ప్రస్తావన సభలో తేనున్నారు. పదేళ్లలో అప్పులు, ప్రాజెక్టుల విషయంలో చేసిన తప్పులు ఎత్తిచూపేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు అధికార సభ్యులు చెబుతున్నారు.
సభలో దద్దరిల్లే అంశాలు ఇవే
అయితే ప్రధానంగా జల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పట్టుబట్టాలని చూస్తుండగా, నీళ్ల నిజాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసి ప్రతిపక్షాలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం చూస్తోంది. పాలమూరు ప్రాజెక్టు వల్ల మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు జరగబోయే జల అన్యాయంపై కేసీఆర్ బావోద్వేగంగా ప్రసంగించే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ తిరస్కరణకు, రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయానికి కారణం కేసీఆరే అని గట్టిగా ఆధారాలతో చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆవేశపూరితంగా ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు తానే రక్షణ అని కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉండగా, తెలంగాణకు కేసీఆరే అన్యాయం చేశారని తిప్పికొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించవచ్చు. ఏది ఏమైనా ఇద్దరు రాజకీయ నేతల మాటల మంట శాసనసభలో రాజకీయ సెగ లేపనుంది.






















