KCR to Attend Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న కేసీఆర్.. ఫాం హౌస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మాజీ సీఎం
KCR to Attend Telangana Assembly Sessions | తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారని తెలుస్తోంది.

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభా సమావేశాల్లో పాల్గొనడం ద్వారా, ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నారు. అధికార పక్షం ఖరారు చేసే ఎజెండాను బట్టి తమ పోరాట పంథాను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. దాంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు అని అంతా భావిస్తున్నారు.
ప్రాజెక్టులపై కీలక చర్చ.. సభలో హోరాహోరీ
ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీ వేదికగా, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. ఇటీవల కేసీఆర్ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై సంధించిన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చారు. దాంతో సోమవారం ప్రారంభమయ్యే సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ రాకతో అసెంబ్లీ వాతావరణం మరింత వేడెక్కుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
శాసనసభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతకు క్యాబినెట్ మంత్రి హోదా లభిస్తుంది. ఇటీవల కేసీఆర్ చేసిన ప్రాజెక్టుల అంశం, నీటి వాటాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్న ఆరోపణలపై సమావేశాలలో కీలకంగా చర్చ జరగనుంది. ఎవరి హయాంలో ఏం జరిగింది, తెలంగాణ ప్రాంతానికి బీఆర్ఎస్ చేసిన మేలేంటి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు ఎన్నికల హామీలు అమలుపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. అయితే సబ్జెక్టుపై మాట్లాడతారా.. లేక కాలయాపన చేసి సమావేశాలు ముగిస్తారా అని తెలంగాణ ప్రజలు సోమవారం ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రెండేళ్లు గడిచినా ఏ మార్పు లేదు.. హామీలు అమలు చేయలేదు
రెండేళ్లు గడువు ఇచ్చినా హామీలు అమలు చేయలేదని.. అమలు సాధ్యం కావని తెలిసినా 420 హామీలిచ్చి ఓట్లు వేయించుకుని ప్రజల్ని మోసం చేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ ఇటీవల విమర్శలు గుప్పించారు. రైతు బంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం అన్నదాతలకు కనీసం యూరియా బస్తాలు ఇవ్వలేని చేతకాని స్థితిలో ఉందని సెటైర్లు వేశారు. మహిళలకు పైసలు ఇవ్వలేదు, కానీ లక్ష మందిని కోటీశ్వరులు చేస్తామని గొప్పలకు పోతున్నారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే తాము కట్టిన ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వరి సాగులో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన రాష్ట్రం మళ్లీ అన్ని పంటలలో వెనక్కి పోయిందన్నారు.
పెన్షన్లు పెంచుతామని హామీలిచ్చి వృద్ధులను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి చెల్లిందన్నారు. పాలన సక్కగ చేయమంటే నా చావు కోరుకోవడం ఏంటో తనకు అర్థం కావడం లేదని కేసీఆర్ మండిపడ్డారు. కృష్ణా జలాల్లో మన వాటా దక్కించుకోవడానికి కూడా చేతకాని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఉన్నారని, మళ్లీ పాత రోజులు, కరువు, వలసల్ని తీసుకొస్తున్నారని ప్రతిపక్షనేత ఆరోపించారు.






















