Compostable Plates: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు
ప్లాస్టిక్ ను అడ్డుకునేందుకు కంపోస్టబుల్ ప్లేట్లు పుట్టుకొచ్చాయి. కానీ వీటితో కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు పరిశోధకులు.
ప్లాస్టిక్ ప్లేట్ల వాడుక పెరిగిపోవడంతో వాటికి ప్రత్యామ్నాయంగా, పర్యావరణ హితంగా పుట్టుకొచ్చినవే కంపోస్టబుల్, బయోడిగ్రేడబుల్ పేపర్ ప్లేట్లు. వీటిని చెరకు పిప్పి, గోధుమ గడ్డి, వెదురు, రీసైక్లింగ్ చేసిన కాగితం, మొక్కజొన్న పిండి ఇలా రకరకాల పదార్థాలతో తయారుచేస్తారు. ప్లాస్టిక్ ఆట కట్టించడానికి వీటిని రంగంలోకి దింపారు. ఈ పేపర్ ప్లేట్లను చాల అద్భుతమైన పరిష్కారంగా భావిస్తున్నారు. కానీ అది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వీటితో కూడా అనేక ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉందని, పూర్తిస్థాయిలో పర్యావరణ హితం కాదని అంటున్నారు పరిశోధకులు.
ప్లాస్టిక్ వాడుక తగ్గింది కానీ...
కంపోస్టుబల్, బయోడిగ్రేడబుల్ ప్లేట్లు, గిన్నెలను ‘మోల్డెడ్ ఫైబర్’ అని కూడా పిలుస్తారు. ఇవి వాడుకలోకి వచ్చాక ప్లాస్టిక్ అవసరం చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా వేడుకలప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు కంపోస్టబుల్ ప్లేట్లనే వాడుతున్నారు. దీనివల్ల ప్లాస్టిక్ వ్యర్థాల శాతం తగ్గిన మాట వాస్తవమే కానీ ఇవి కూడా వందశాతం మట్టికి మేలు చేసేవి కావు. వీటి తయారీలో వాడిన ముడిపదార్థాలన్నీ సహజమైనవే అయినా, అవి భూమిలో కలిసేటప్పుడు మాత్రం పర్యావరణ ప్రతికూల లక్షణాలను చూపిస్తాయి. అంటే చమురుగా మారడం, నీటిని పీల్చుకోవడాన్ని నిరోధించడం వంటి ప్రభావాలు ఈ పేపర్ ప్లేట్ల వల్ల కలుగుతాయి. ఈ సమస్యను తీర్చేందుకు PFASను కనిపెట్టారు.
PFAS అంటే...
పేపర్ ప్లేట్లు మట్టిలో త్వరగా కలిసిపోయేందుకు సహకరించే రసాయనం ఇది. ఇది పేపర్ ప్లేట్లకు చమురు నిరోధక లక్షణాలను అందిస్తుంది. అందుకే ఆ ప్లేట్ల తయారీలో ఈ రసాయనాన్ని స్వల్ప మొత్తంలో కలుపుతున్నారు. పీఎఫ్ఎఎస్ అంటే ‘పర్ అండ్ పాలీఫ్లోరోఅల్కైల్ సబ్ స్టేన్సెస్’. వీటిని ఫ్లోరినేటెడ్ రసాయనాలుగా పిలుస్తారు. ఇవి అధికమొత్తంలో వాడితే చాలా ప్రమాదకరం. దీన్ని అతిస్వల్పంగా వాడడం పెద్ద ప్రమాదం ఉండదని చెబుతూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మనిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. కానీ అది తప్పని పరిస్థితుల్లోనే ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఈ రసాయనం లేకపోతే పేపర్ ప్లేట్లకు, ప్లాస్టిక్ ప్లేట్లకు పెద్ద తేడా ఏం ఉండదు. రెండూ భిన్న రకాలుగా పర్యావరణానికి దెబ్బకొడతాయి. అందుకే పేపర్ ప్లేట్ల తయారీలో ఈ రసాయనం వాడేందుకు అనుమతినిచ్చింది.
PFAS వల్ల కలిగే అనారోగ్యాలు...
పేపర్ ప్లేట్లలో తింటాం కానీ, వాటినే నేరుగా తినం కదా, రసాయనాలు ఎలా చేరుతాయి శరీరంలో అని వాదించే వాళ్లు ఉంటారు. ప్లాస్టిక్ ను కూడా మనం తినం అయిన అది మన శరీరాన్ని, పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. నిత్యం ఈ ప్లేట్లలో తినేవాళ్లకి కూడా దీర్ఘకాలంలో ప్రభావం పడుతుంది. ప్రస్తుతం 99 శాతం మంది అమెరికన్లలో PFAS పేరుకుపోయిందని పరిశోధనలో తేలింది. ఇంకా మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ రసాయనం వల్ల శరీరానికి వచ్చే రోగాలు ఇవే...
1.క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
2. చిన్నారుల పెరుగుదల, నేర్చుకునే గుణం, ప్రవర్తనపై ప్రభావం పడుతుంది.
3. మహిళల్లో గర్భం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
4. శరీరంలో హార్మోన్ల పనితీరులో జోక్యం చేసుకుంటుంది. దీనివల్ల అనేక సమస్యలు మొదలవుతాయి.
5. రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
అందుకే అప్పుడప్పుడూ పేపర్ ప్లేట్లలో తిన్నా ఫర్వాలేదు కానీ, రోజూ తినే అలవాటును మానుకోండి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read also: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం
Read also: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Read also: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి