Venu Swamy: క్షమాపణలు చెప్పిన వేణు స్వామి... నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గాడండోయ్
హీరో హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం చేసుకున్నప్పటికీ... ఎక్కువ రోజులు కలిసి ఉండలేరని, కచ్చితంగా విడాకులు తీసుకుంటారని చెప్పిన వేణు స్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై జోస్యం చెబుతూ వివాదాస్పద ఆస్ట్రాలజర్ కింద గుర్తింపు పొందిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy Astrologer) క్షమాపణలు చెప్పారు. అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు పొందిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాల (Sobhita Dhulipala) వైవాహిక జీవితంపై వేణు స్వామి గతంలో కామెంట్స్ చేశారు. వాటి పట్ల ఆయన క్షమాపణలు తెలిపారు. అసలు వివరాల్లోకి వెళితే...
మహిళా కమిషన్ ముందు వేణు స్వామి బహిరంగ క్షమాపణ
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థం గురించి కింగ్ అక్కినేని నాగార్జున అనౌన్స్ చేసిన తర్వాత వేణు స్వామి తన జోస్యం చెప్పారు. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని తాను చెప్పానని, అదే విధంగా జరిగిందని... నాగ చైతన్య శోభిత కూడా విడాకులు తీసుకుంటారని ఎక్కువ రోజులు కలిసి ఉండలేరని వేణు స్వామి పేర్కొన్నారు.
తెలుగు చిత్రసీమ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలలో, ఆయా ప్రముఖుల జోక్యం లేకుండా బహిరంగంగా జోస్యం చెబుతున్న వేణు స్వామి మీద తెలంగాణ మహిళా కమిషన్ దగ్గరకు వెళ్లి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.
క్షమాపణలు చెప్పడానికి ముందు హైకోర్టుకు వెళ్లిన వేణు స్వామి
వేణు స్వామి మీద తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు వేణు స్వామి. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురు అయ్యింది. ఆ నోటీసుల నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని, తెలంగాణ మహిళా కమిషన్ ముందు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
కోర్టు నుంచి తనకు అనుకూలమైన తీర్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో తెలంగాణ మహిళా కమిషన్ ముందు వేణు స్వామి హాజరు కావాల్సి వచ్చింది. వేణు స్వామికి హైకోర్టు మినహాయింపు నిరాకరించిన వెంటనే మరొకసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దాంతో జనవరి 21న వేణు స్వామి హాజరు అయ్యారు.
నాగ చైతన్య, శోభిత ధూళిపాల వ్యక్తిగత జీవితంపై తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు వేణు స్వామి. తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయానికి వేణు స్వామి హాజరైన నేపథ్యంలో... మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు పునరావృత్తం కాకుండా చూడాలని చైర్ పర్సన్ నేరేళ్ల శారద హెచ్చరించినట్లు సమాచారం అందుతుంది. ఆవిడకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను వేణు స్వామి అందించారు.
ప్రభాస్ జీవితంలో ఇక విజయాలు లేవని కూడా ఒకసారి వేణు స్వామి వివాదాస్పద జోస్యం చెప్పారు. 'కల్కి 2898 ఏడీ'తో ఆయన వెయ్యి కోట్ల వసూళ్లు సాధించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ (కెసిఆర్ పార్టీ) అధికారంలోకి వస్తుందని చెప్పారు. అదీ తప్పు అయ్యింది. తాను చెప్పిన అంశాల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో ఇకపై జోస్యం చెప్పనని వేణు స్వామి పేర్కొన్నారు. ఆ తర్వాత చైతు - శోభిత వైవాహిక జీవితం గురించి వ్యాఖ్యలు చేశారు. అదేమిటి? అని ప్రశ్నిస్తే... అంతకు ముందు తాను చెప్పిన జోస్యానికి కొనసాగింపు అన్నారు. చివరకు ఇలా క్షమాపణలు చెప్పారు.
Also Read: మనో అక్కినేని మృతి... తెలుగు అమ్మాయిని తమిళంలో డైరెక్టర్ చేసిన నిర్మాత ఇక లేరు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

