Naseeruddin Shah: హిందీ సినిమాలు చూడడం మానేశాను, ఆ నమ్మకమే పోయింది - నసీరుద్దీన్ షా
Naseeruddin Shah: చాలామంది ప్రేక్షకులు ఈరోజుల్లో రొటీన్ కమర్షియల్ సినిమాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ లిస్ట్‌లో సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా కూడా యాడ్ అయ్యారు.
Senior Actor Naseeruddin Shah about Hindi Films: ఒకప్పటిలాగా కమర్షియల్ సినిమాలను, రొటీన్ లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులు చాలావరకు తగ్గిపోయారు. ప్రతీ సినిమాలో ఏదో ఒక కొత్తదనం కోరుకుంటున్నారు. అలా కొత్తదనంతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పించగలుగుతున్న దర్శకులే స్టార్లు అవుతున్నారు. ఇక సినిమాలు అన్నీ దాదాపుగా ఒకే ఫార్మాట్‌లో రావడంపై కొందరు ఆడియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఇష్టపడి సినిమాలు చూసేవారు కూడా రొటీన్ కథలు నచ్చక చాలావరకు సినిమాలు చూడడమే తగ్గించేశారు. అందులో సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా కూడా ఒకరు. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. హిందీ సినిమాలపై అసహనం వ్యక్తం చేశారు.
ప్రత్యేకత ఏముంది.?
హిందీ సినిమాలు అన్నీ ఒకే తరహాలో ఉంటున్నాయని నసీరుద్దీన్ షా మండిపడ్డారు. ‘‘హిందీ సినిమాకు 100 ఏళ్ల చరిత్ర ఉంటుందని గర్వంగా చెప్పుకుంటాం. కానీ అప్పటినుండి ఒకే తరహా సినిమాలు తెరకెక్కిస్తున్నాం. నేను హిందీ సినిమాలు పూర్తిగా చూడడం మానేశాను. నాకు అవి అస్సలు నచ్చడం లేదు’’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ సినిమాలు మారుతాయనే నమ్మకం కూడా తనకు పూర్తిగా పోయిందని అన్నారు. ‘‘హిందుస్తానీ ఫుడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టం ఎందుకంటే అందులో ఒక ప్రత్యేకత ఉంది. మరి హిందీ సినిమాల్లో అలాంటి ప్రత్యేకత ఏముంది?’’ అని ప్రశ్నించారు నసీరుద్దీన్ షా.
డబ్బు సంపాదించడానికి మాత్రమే..
‘‘హిందీ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూస్తున్నారని ఒప్పుకుంటాను. చూసిన వారంతా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో అని ప్రశంసిస్తారు కూడా. కానీ త్వరలోనే వారికి ఇవి బోర్ కొట్టేస్తాయి. ఎందుకంటే వీటిలో ఎలాంటి ప్రత్యేకత లేదు కాబట్టి’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు నసీరుద్దీన్ షా. ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు కాకుండా సమాజంలో జరుగుతున్న నిజాలను చూపించడానికి కూడా ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. ‘‘కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే అన్న దృష్టిని పక్కన పెడితే హిందీ సినిమా ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనిపిస్తుంది’’ అని వాపోయారు.
దేవుడికే తెలియాలి..
‘‘వేలాది మంది చూస్తున్న సినిమాలనే తయారవుతాయి. అవే సినిమాలను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తారు. ఇది ఎప్పటివరకు సాగుతుందో దేవుడికే తెలియాలి. కాబట్టి ఎవరైనా సీరియస్ సినిమాలను తెరకెక్కించాలనుకుంటే, సమాజంలో జరుగుతున్న నిజాలను చూపించాలనుకుంటే వారు ఏదీ ఆశించకుండా సినిమాలను తీయవలసి ఉంటుంది’’ అని ముక్కుసూటిగా మాటాడారు నసీరుద్దీన్ షా. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు హిందీ సినిమాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకే తరహా సినిమాలపై అసహనం చూపించిన వ్యక్తుల్లో నసీరుద్దీన్ మొదటివారు కాదు. ఇంతకు ముందు కూడా పలువురు సీనియర్ నటులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను బయటపెట్టారు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడని చాలామంది ప్రేక్షకులు.. నసీరుద్దీన్ మాటలతో సమ్మతిస్తున్నారు కూడా.