Mithun Chakraborty: మోదీ ఫోన్ చేసి తిట్టారు, అవి కాస్త కంట్రోల్ చేసుకోవాలి - మిథున్ చక్రవర్తి
Mithun Chakraborty: పద్మభూషణ్ గ్రహీత మిథున్ చక్రవర్తి మూడురోజుల క్రితం ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరారు. తాజాగా డిశ్చార్జ్ అవుతూ నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసిన విషయాన్ని బయటపెట్టారు.
Mithun Chakraborty: పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత మిథున్ చక్రవర్తి ఛాతి నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరారు. రెండు రోజులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సోమవారం మధ్యాహ్నం ఆయనను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. బయటికి వచ్చిన తర్వాత మిథున్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. 73 ఏళ్లు మిథున్.. ఫిబ్రవరీ 10న తీవ్రమైన ఛాతి నొప్పి అని చెప్పడంతో తన కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు పలు టెస్టులు చేశారు. స్కానింగ్, ఎమ్మారై కూడా చేశారు. అన్ని టెస్టులు అయిపోయి ఆయన ఆరోగ్యం పరవాలేదనిపించిన తర్వాతే డిశ్చార్జ్ చేశారు.
కాస్త కంట్రోల్ చేసుకోవాలి..
‘‘అసలు నాకు ఏ సమస్య లేదు. నేను పూర్తిగా బాగున్నాను. నా ఆహార అలవాట్లను కాస్త కంట్రోల్ చేసుకోవాలి అంతే. నేను త్వరలోనే వర్క్ చేయడం ప్రారంభిస్తానేమో చూడాలి. ఒకవేళ రేపటి నుండే చేస్తానేమో’’ అని హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత మిథున్ చక్రవర్తి అన్నారు. అంతే కాకుండా తన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి తిట్టారని తెలిపారు. ‘‘నా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదని తిట్లు తిన్నాను’’ అని అన్నారు మిథున్. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ కూడా మిథున్ చక్రవర్తిని చూడడానికి నేరుగా ఆసుపత్రికి వచ్చారు. ఈ సీనియర్ నటుడు హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురీ, తమిళ భాషల్లో 350కు పైగా చిత్రాల్లో నటించారు.
రెండేళ్ల క్రితం..
2024 జనవరి 25న పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో మిథున్ చక్రవర్తికి పద్మ భూషణ్ అందిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్.. బాలీవుడ్ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. కాగా ఈయనకు గతంలో కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. కిడ్నీ సమస్యతో ఆస్పత్రిపాలయ్యారు. రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ సమస్యపై మిథున్‌కు సర్జరీ జరిగింది. ఇప్పుడు ఛాతి నొప్పి ద్వారా కోలకత్తాలోని అపోలో ఆసుపత్రిలో చేరి.. పూర్తి ఆరోగ్యంతో బయటికి వచ్చారు.
‘గోపాల గోపాల’తో తెలుగులో..
బాలీవుడ్‌లో 80, 90ల్లో మిథున్ చక్రవర్తి ఒక స్టార్ హీరో. హిందీతో పాటు ఇతర నార్త్ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన మిథున్.. తెలుగులో ‘గోపాల గోపాల’తో నటుడిగా పరిచయమయ్యారు. తెలుగు ప్రేక్షకులు ఆయనను చూడడం అదే మొదటిసారి. వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో మిథున్ క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక హిందీలో డిస్కో డ్యాన్సర్ అంటే మిథున్ చక్రవర్తినే గుర్తొస్తాడు. ఒకప్పుడు పెద్దగా డ్యాన్స్ చేయని హీరోల మధ్య డిస్కో డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు మిథున్. అందుకే చిన్న బడ్జెట్ నిర్మాతలంతా ఆయనతో సినిమా తీయడానికి డేట్ల కోసం ఎదురుచూసేవారు. మొదట్లో నువ్వు హీరో ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడినవారే తర్వాత తన డేట్ల కోసం క్యూ కట్టారు. ఇప్పటికే బాలీవుడ్‌లో మిథున్ సాధించిన సక్సెస్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు.
Also Read: గుంటూరు కారం' తర్వాత శ్రీలీలకు కొత్త ఆఫర్స్ రావడం లేదా? కారణం అదేనా?