Police Vaari Hecharika: అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో 'పోలీస్ వారి హెచ్చరిక' - అనాథ బాలలకు ప్రేమ పంచకపోతే?
బాబ్జీ దర్శకత్వం వహిస్తున్న 'పోలీస్ వారి హెచ్చరిక' సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సినిమా కథాంశం ఏమిటి? అనేది దర్శకుడు తెలిపారు.
Ajay Ghosh Upcoming Movies : బాల్యం నుంచి యవ్వనం వరకు పిల్లలకు కుటుంబం పంచే ప్రేమ వాళ్ళ జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుందనే కథాంశంతో రూపొందుతున్న సినిమా 'పోలీస్ వారి హెచ్చరిక' (Police Vari Hecharika Movie). బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై 'పోలీస్ వారి హెచ్చరిక' సినిమాను బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు.
మన పిల్లలకు, మన కుటుంబానికి పంచే ప్రేమలో కొంత అయినా మన చుట్టుపక్కల అనాథ బాలలకు పంచకపోతే... మన పిల్లల భవిష్యత్తు పడే పడే తపనలో, తీసుకునే జాగ్రత్తల్లో కొంత అయినా మన కళ్ళ ముందు తిరుగుతున్న అనాథలు, అభాగ్యుల విషయంలో ప్రదర్శించకపోతే... ఆ అనాథలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్లి సమాజాన్ని నాశనం చేసే నేరస్తులుగా మారే ప్రమాదం ఉందనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చే సినిమా 'పోలీస్ వారి హెచ్చరిక' అని దర్శకుడు బాబ్జీ తెలిపారు. ఈ చిత్రాన్ని కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్నామని ఆయన వివరించారు.
అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో...
'పోలీస్ వారి హెచ్చరిక'లో అజయ్ ఘోష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'తో పాన్ ఇండియా నటుడిగా ఎదిగిన ఆయన... లేటెస్ట్ హిట్ 'మంగళవారం'లో ప్రధాన పాత్రలో కనిపించి నవ్వులు పూయించారు. ఇటీవల పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఆయన... ఈ సినిమాలో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారని నిర్మాత బెల్లి జనార్థన్ తెలిపారు. సింగిల్ షెడ్యూల్‌లో... నాన్ స్టాప్‌గా షూటింగ్ చేసి సినిమా పూర్తి చేస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతుందన్నారు. విజయ దశమి రోజున 'సినీ కళామతల్లి కి జై... వర్ధిల్లాలి తెలుగు సినీ పరిశ్రమ... వర్ధిల్లాలి భారతీయ సినీ పరిశ్రమ' నినాదాల మధ్య చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించామన్నారు.
Also Read : మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?
చిత్రీకరణ గురించి దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ ''హైదరాబాద్, ఘట్ కేసర్, ఘణపూర్, షామీర్ పేట తదితర ప్రదేశాలలో 50 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. ఇప్పటి వరకు కీలక సన్నివేశాలతో పాటు మూడు పాటలు, రెండు ఫైట్స్ తీశాం. డిసెంబర్ మొదటి వారానికి సినిమా చిత్రీకరణ అంతా పూర్తి అవుతుంది'' అని చెప్పారు. "దేశ రక్షణ కోసం భారత సైన్యంలో పని చేసిన నేను... ఈ సినిమాతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టా. దర్శకుడు బాబ్జీ కథలో గొప్ప సందేశం ఉంది'' అని నిర్మాత బెల్లి జనార్ధన్ చెప్పారు.
Also Read : 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమా రివ్యూ: రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టారా? డిజప్పాయింట్ చేశారా?
అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, హిమజ, సంజయ్ నాయర్, గిడ్డేష్, హనుమా, బాబూ రామ్, గోవింద్, గంట మోగిన రవితేజ, వేణు రాక్, సకారం, 'ల్యాబ్' శరత్, జయ వాహిని, మేఘనా ఖుషి, రుచిత, ఉజ్జ్వలా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పోరాటాలు: సింధూరం సతీష్, నృత్యాలు: వేణు రాక్, కూర్పు: శివ శార్వాణి, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్: ఎస్. హనుమంత రావు, ఛాయాగ్రహణం: కొండపల్లి నళినీకాంత్, సంగీతం: గజ్వేల్ వేణు, నిర్మాణ సంస్థ: తూలికా తనిష్క్ క్రియేషన్స్, నిర్మాణ నిర్వహణ: ఎన్. సుబ్బరాయుడు, నిర్మాత: బెల్లి జనార్ధన్, రచన & దర్శకత్వం: బాబ్జీ.