Tarun Clarity On Marriage : పెళ్లి పుకార్లపై తరుణ్ స్పందన - మెగా ఇంటి అల్లుడు పుకార్లకు చెక్
తన పెళ్లి గురించి త కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలపై హీరో తరుణ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.
టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్ హీరోలలో తరుణ్ ఒకరు. సినిమాలు చేయకపోయినా... పెళ్లి వార్తలతో నిత్యం లైమ్ లైట్లో కొనసాగుతూనే ఉంటాడు. తరుణ్ అవివాహితుడు కావడంతో, ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి. లేటెస్టుగా మరోసారి ఈ హీరో పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై తరుణ్ తాజాగా స్పందించారు.
తరుణ్ కు పెళ్లి ఫిక్స్ అయిందని, టాలీవుడ్ లోని ఒక పెద్ద (మెగా!?) కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని, మరో నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సినీ ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నాడనే వార్త బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో పెళ్లి ప్రచారంపై తరుణ్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
తరుణ్ మాట్లాడుతూ ''ఈ ప్రచారం నిజం కాదు. నిజంగా ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతాను'' అని చెప్పారు. తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని ఆయన అన్నారు.
View this post on Instagram
తరుణ్ ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. 'నువ్వు లేక నేను లేను', 'సోగ్గాడు' సినిమాలలో తనకు జోడీగా హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో ఎఫైర్ సాగించినట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆర్తి చనిపోయిన సంగతి తెలిసిందే. 'నవ వసంతం' టైమ్ లో హీరోయిన్ ప్రియమణితో తరుణ్ పెళ్లి అంటూ పుకార్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి ప్రచారం మొదలవ్వగా, అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసాడు. మరి త్వరలోనే శుభవార్త చెప్తాడేమో చూడాలి.
Also Read: క్రేజీ అప్డేట్స్‌తో రాబోతున్న స్టార్ హీరోలు, ఈ నెల ఫ్యాన్స్‌కు పండగే పండగ!
‘మనసు మమత’ చిత్రంతో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసాడు తరుణ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలకు నంది అవార్డులు కూడా అందుకున్నాడు. 2000లో విడుదలైన ‘నువ్వేకావాలి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. పాతికేళ్ల వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుస ప్రేమకథల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 'నువ్వులేక నేను లేను' 'నువ్వే నువ్వే' 'ప్రియమైన నీకు' 'ఎలా చెప్పను' 'నీ మనసు నాకు తెలుసు' వంటి సినిమాలను విశేషంగా అలరించాయి. అయితే కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. 2018లో విడుదలైన ‘ఇది నా లవ్‌స్టోరీ’ తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకొని, బిజినెస్ మీద దృష్టి పెట్టాడని తెలుస్తోంది.
ఇకపోతే లాక్ డౌన్ సమయంలో తన తల్లి బాటలో డబ్బింగ్ ఆర్టిస్టుగా సరికొత్త అవతారమెత్తాడు తరుణ్. 'అనుకోని అతిథి' అనే డబ్బింగ్ సినిమాలో హీరో ఫహాద్ ఫాజిల్ కు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. ఫహాద్ కి తరుణ్ వాయిస్ సరిగ్గా సూట్ అవ్వడంతో, 'పుష్ప' సినిమాలోనూ డబ్బింగ్ చెప్పిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అలానే మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' చిత్రంలో తరుణ్ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, మహేష్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.
Also Read: పిల్లోడు దొరకలేదని మా అమ్మానాన్న నీ కాళ్ళు పట్టుకున్నారా? - పెళ్లి వార్తలపై హీరోయిన్ ఫైర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial