Budget Expectations: హోమ్ లోన్‌పై ప్రత్యేక పన్ను రాయితీ, రూ.5 లక్షల వడ్డీ వరకు 'జీరో టాక్స్'!
Union Budget 2025 Expectations: ఇప్పుడు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బడ్జెట్‌లో, గృహ రుణ వడ్డీపై పన్ను రాయితీ పరిమితిని పెంచాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

Income Tax Exemption On Home Loan Interest: ప్రస్తుతం, రియల్ ఎస్టేట్ కంపెనీల దృష్టి అఫర్డబుల్ ఇళ్ల నుంచి ప్రీమియం & లగ్జరీ గృహాల వైపు మళ్లింది. తమ ఆర్థిక స్థోమతలో ఇల్లు లభిస్తుందన్న ఆశతో ఉన్న ప్రజలకు సొంతింటి కల దూరమైంది. ఖరీదైన ఇల్లు అంటే... ఎక్కువ గృహ రుణం & దానిపై పన్ను భారం. ఈ పరిస్థితుల్లో, మోదీ సర్కార్ బడ్జెట్‌పై సొంతింటి కలలు కంటున్న ప్రజల్లో అంచనాలు భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగ అనుభవజ్ఞులు తమ డిమాండ్ల జాబితాను ఇప్పటికే ఆర్థిక మంత్రికి సమర్పించారు.
అఫర్డబుల్ ఇళ్లకు ప్రోత్సాహం
రూ.50 లక్షల కంటే తక్కువ ధర గల గృహాల (అఫర్డబుల్ హౌసింగ్) విక్రయాలు, 2018లో, మొత్తం హౌసింగ్ అమ్మకాలలో 48 శాతంగా ఉండగా.. 2024లో 30 శాతానికి తగ్గాయి. అయితే, ఈ కాలంలో మొత్తం ఇళ్ల విక్రయాలు మాత్రం పెరిగాయి. 2023లో, అఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్‌లో అమ్మకాలు 16 శాతం క్షీణించాయి & 2024లోనూ తగ్గాయి. ఇళ్ల ధరల పెరుగుదల & అధిక జీవన వ్యయం వంటివి ప్రజలను ప్రభావితం చేశాయి. మొత్తం గృహ రుణం రూ.25 లక్షలకు మించకుండా & ఇంటి విలువ రూ.35 లక్షలకు మించకుండా ఉంటే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 లబ్ధిదారులు వడ్డీ రాయితీ పొందుతారు. కానీ మెట్రో నగరాల్లో ఈ పరిమితి సరిపోదు. కాబట్టి, మెట్రో నగరాల్లో ఇంటి విలువ పరిమితిని రూ.50 లక్షలకు పెంచాలని స్థిరాస్తి రంగ నిపుణులు ఆర్థిక మంత్రిని డిమాండ్ చేశారు.
రూ.5 లక్షల వరకు గృహ రుణ వడ్డీపై రాయితీ
అఫర్డబుల్ సెగ్మెంట్ హౌసింగ్ మార్కెట్‌ను ప్రోత్సహించడానికి, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 (B) కింద, గృహ రుణ వడ్డీపై పన్ను రాయితీ పరిమితిని సంవత్సరానికి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు, ఇది ప్రస్తుతం రూ.2 లక్షలుగా ఉంది.
హోమ్ లోన్ అసలుపై ప్రత్యేక మినహాయింపు
సంవత్సరానికి రూ.1.50 లక్షల గృహ రుణం అసలు (principal amount) చెల్లింపుపై, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ప్రత్యేక మినహాయింపును ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రస్తుతం, 80C కింద లభించే రూ.1.50 లక్షల మినహాయింపులోనే బీమా, పిల్లల ఫీజులు మొదలుకుని పన్ను ఆదా చేసే ఇతర సాధనాలు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ వంటివన్నీ సర్దుబాటు చేయాల్సి వస్తోంది.
పాత ఇల్లు - కొత్త ఇల్లు - పన్ను ప్రయోజనాలు
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం, ఇప్పటికే ఉన్న ఇంటిని విక్రయించడం ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలను కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి ఉపయోగించి పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికోసం, పాత ఇంటిని విక్రయించిన తేదీ నుంచి మూడేళ్ల లోపు కొత్త ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి, అప్పుడు మాత్రమే దీర్ఘకాలిక మూలధన లాభాలను క్లెయిమ్ చేయవచ్చు. హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుందని, దీని వల్ల నిర్మాణంలో ఉన్న ఆస్తులపై మూలధన లాభాలను సెట్ చేయడంలో గృహ కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురవుతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కొత్త ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన సమయాన్ని మూడేళ్ళకు బదులుగా ఐదేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 54 ప్రకారం, దీర్ఘకాలిక మూలధన లాభాల ప్రయోజనాన్ని పొందడానికి, పాత ఆస్తిని విక్రయించిన ఒక సంవత్సరం లోపు కొత్త హౌసింగ్ ప్రాపర్టీని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఈ కాల పరిమితిని రెండేళ్లకు పెంచాలని ఆర్థిక మంత్రిని అభ్యర్థించారు.
మరో ఆసక్తికర కథనం: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

