Inflation: హమ్మయ్య, 5 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం - కలవరపెడుతున్న ఆ ఒక్క విషయం
సరిగ్గా ఏడాది క్రితం, 2023 మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 4.79 శాతంగా ఉంది.

Retail Inflation Data For March 2024: దడ పుట్టిస్తున్న ధరలు, అధిక ద్రవ్యోల్బణం వార్తలు వినీవినీ విసిగిపోయిన ప్రజలకు ఈ వేసవిలో చల్లటి కబురు. మన దేశంలో సీపీఐ ఇన్‌ఫ్లేషన్ (CPI Inflation) రేటు 5 శాతం దిగువకు పడిపోయింది, ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation in February 2024) రేటు కూడా 2024 మార్చి నెలలో కొంచం చల్లబడింది.
5 శాతం దిగువకు ద్రవ్యోల్బణం
కేంద్ర గణాంకాల కార్యాలయం (NSO), 2024 మార్చి నెలకు సంబంధించిన 'వినియోగదారు ధరల సూచీ (Consumer Price Index) ఆధారిత ద్రవ్యోల్బణం' డేటాను శుక్రవారం (12 ఏప్రిల్ 2024) సాయంత్రం విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం... 2024 ఫిబ్రవరిలో 5.09 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం రేటు మార్చి నెలలో 4.85 శాతానికి దిగి వచ్చింది. 2023 అక్టోబర్‌లో ఇది అత్యల్పంగా 4.87 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం, 2023 మార్చిలో ద్రవ్యోల్బణం 5.66 శాతంగా నమోదైంది.
2024 జనవరి నెలలో ద్రవ్యోల్బణం 5.10 శాతంగా ఉంది. 2023 డిసెంబర్‌లో ఇది 5.69 శాతంగా ఉంది.
రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌తో రేట్‌తో పాటు ఈ ఏడాది మార్చి నెలలో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ రేట్ కూడా అతి కొద్దిగా దిగి వచ్చింది. ఫిబ్రవరి నెలలోని 8.66 శాతంతో పోలిస్తే ఇది మార్చి నెలలో 8.52 శాతానికి తగ్గింది. సరిగ్గా ఏడాది క్రితం, 2023 మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 4.79 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధిక స్థాయిలో కొనసాగడం మాత్రం ఆందోళన కలిగించే విషయం.
కలవరపెడుతున్న పప్పుల ధరలు
ఆహార ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ... కూరగాయలు, పప్పుల ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగానే ఉంది. ఆకుకూరలు & కూరగాయల ద్రవ్యోల్బణం (Vegetable Inflation) 2024 మార్చిలో 26.38 శాతానికి చేరింది, ఇది ఫిబ్రవరిలో 30.25 శాతంగా ఉంది. ఇది కాస్త తగ్గినప్పటికీ, పప్పు దినుసుల ద్రవ్యోల్బణం (Inflation of pulses) మాత్రం పెరిగింది. 2024 ఫిబ్రవరిలో 18.90 శాతంగా ఉన్న పల్సెస్ ఇన్‌ఫ్లేషన్ రేటు మార్చిలో 18.99 శాతానికి చేరింది. ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 7.60 శాతంగా ఉండగా, మార్చి నెలలో 7.90 శాతానికి ఎగబాకింది. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 13.51 శాతంగా ఉంటే, సమీక్ష కాలంలో 11.43 శాతానికి దిగి వచ్చింది. పండ్ల ద్రవ్యోల్బణం (Fruits inflation) ఫిబ్రవరిలో 4.83 శాతం కాగా, మార్చిలో ఇది భారీగా తగ్గి 2.67 శాతానికి పరిమితమైంది. చక్కెర ద్రవ్యోల్బణం రేటు 6.73 శాతంగా, గుడ్ల ద్రవ్యోల్బణం రేటు 9.59 శాతంగా నమోదయ్యాయి.
టాలరెన్స్ బ్యాండ్‌కు ఇప్పటికీ దూరం
ద్రవ్యోల్బణం రేటు 5 శాతం దిగువకు వచ్చినప్పటికీ, ఇది రిజర్వ్ బ్యాంక్ (RBI) టాలరెన్స్ బ్యాండ్ అప్పర్ లిమిట్ అయిన 4 శాతం కంటే ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పులు, ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితితో పాటు సరఫరా గొలుసు సమస్యలు సవాల్‌గా మారాయని, వీటి కారణంగా ఆహార పదార్థాల ధరలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని ద్రవ్య విధానాన్ని ప్రకటించే సమయంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో, చిల్లర ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. జూన్ త్రైమాసికంలో 4.9 శాతంగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 3.8 శాతంగా నమోదు కావొచ్చని లెక్కగట్టింది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి రెపో రేటును ఆర్‌బీఐ సవరిస్తూ ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: కనికరం చూపని పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

