Visakhapatnam Gas Leak: అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువులు లీక్- యాభై మందికి అస్వస్థత
అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి కలకలం రేగింది. దుస్తుల కంపెనీలో విషవాయువు లీక్ కారణంగా మహిళా ఉద్యోగులు ఆసుపత్రి పాలయ్యారు. హుటాహుటిన ప్రభుత్వ యంత్రాంగం అక్కడకు చేరుకుంది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీక్ అయింది. ఈ దుర్ఘటనలో యాభై మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్ కంపెనీలో ఈ దుర్ఘటన జరిగింది. సాయంత్రం టైంలో విషవాయు కారణంగా అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు ఒక్కొక్కొరుగా వాంతులు, వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. ఏం జరిగిందో తెలుసుకనే లోపు సుమారు యాభై మంది అస్వస్థతకు గురయ్యారు.
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
ఘటన జరిగన వెంటనే స్పందించిన కంపెనీ యాజమన్యం అస్వస్థతకు గురైన ఉద్యోగాలను అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు. కంపెనీ ఆవరణంలోని ప్రాథమిక చికిత్స కేంద్రంలో వైద్యం చేశారు. అనంతరం వారిని కూడా అనాకపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎక్కువ అనారోగ్యానికి గురైన వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కంపెనీ ఇచ్చిన సమాచారం మేరకు అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో పాతిక మంది మహిళలు చికిత్స తీసుకుంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో 40 మందికి చికిత్స పొందుతున్నారు.
హుటాహుటిన కంపెనీకి జిల్లా యంత్రాంగం
బ్రాండిక్స్, సీడ్స్ కంపెనీ ప్రమాద ఘటన స్థలాన్నీ అనకాపల్లి ఎస్పీ గౌతమి శాలి పరిశీలించి... ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. విషవాయువులు పీల్చడం వలన సీడ్ కంపెనీ మహిళా ఉద్యోగులు స్వల్ప అస్వస్థకు గురయ్యారన్నారు. వారందరిని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్, ఉషా ప్రైమ్ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది ఎక్కడ నుంచి ఈ విష వాయువులు లీక్ అయ్యాయనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారని ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని ఆమె తెలిపారు.
అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని బ్రాండిక్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై సమగ్రదర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు సీపీఎం నాయకులు. ఈ రెండు నెలల కాలంలో ఇది రెండో ఘటనని గుర్తు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి బ్రాండిక్స్ ఇండియా పార్ట్‌నర్ దొరస్వామిని అరెస్ట్ చేయాలన్నారు. ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు.
భగ్గుమన్న విపక్షాలు
అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న ఎస్‌ఇజెడ్ పరిశ్రమల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం వాటిని నివారించడంలో విఫలమౌతుందని ఆరోపించారు సీబీఎం నాయకులు. గతంలో జరిగిన ప్రమాదంపై నివేదిక బహిర్గతం చేసి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మంత్రులు, అధికారులు హడావడి చేస్తున్నారే తప్ప తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. కంపెనీ యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. సుమారు 2వేల మంది మహిళలు పనిచేసే పరిశ్రమలో కనీసమైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు.
ఇది తోలు మందం సర్కారు: సోమువీర్రాజు
విష వాయువు లీక్‌తో అస్వస్థతకు గురైన మహిళలకు మెరుగైన వైద్యం అందివ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. రెండు మాసాల వ్యవధిలో రెండు సార్లు రసాయనాలు లీక్ కావడం చిన్న విషయం కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తోలు మందంగా వ్యవహరిస్తోందని ఘాటుగా వ్యవహరించారు. పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ విరమించుకుందా అని ప్రశ్నించారు సోమువీర్రాజు. కార్మికులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ సోమువీర్రాజు నిలదీశారు. స్థానిక కార్యకర్తలు కార్మికులకు అండగా ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు.