YSRCP News: మంత్రి బొత్సకు కోటకు బీటలు వారుతున్నాయా ? నేతలు వరుసగా షాకిలిస్తున్నారా ?
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
Chipuripalli Politics : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ( Ap Assembly Elections ) సమీపిస్తున్న వేళ...రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ... ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేతల గురించి ప్రత్యేక చెప్పక్కర లేదు. మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని...అధ్యక్ష అని పిలవాలని తహతహ లాడుతున్నారు. పోటాపోటీగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు...నియోజకవర్గంలో ఊహించని షాకులు తగులుతున్నాయి. ఆయన విజయాల్లో కీలకపాత్ర పోషించిన నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి క్యూకడుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది.
టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబురావు
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణకు...నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఝలక్ ఇస్తున్నారు. అధికార పార్టీకి గుడ్ బై చెప్పి... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పేసుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ గెలుపులో కీలకంగా ఉన్న మెరకముడిదాం మండలంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, కోట్ల సుగుణాకరరావు తీర్థం పుచ్చుకున్నారు. గద్దే బాబురావు... 1994,1999లో చీపురుపల్లి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.
మాజీ ఎమ్మెల్యే తనయుడు కూడా!
అటు కోట్ల సుగుణాకరావు...విజయనగరం జిల్లా వయోజన విద్యా శాఖ ఉప సంచాలకుడిగా పనిచేశారు. ఇటీవల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. సుగుణాకరరావు తండ్రి కోట్ల సన్యాసి అప్పలనాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 ఎన్నికల్లో సన్యాసి అప్పలనాయుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. కోట్ల సుగుణాకరరావు కుటుంబానికి చెందిన వ్యక్తులే మెరకముడిదాం మండల జడ్పీటీసీ సభ్యులుగా, మండలాధ్యక్షులుగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో...చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పలు పంచాయతీల సర్పంచ్ లు, ఎంపీటీసీలు...వైసీపీ వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారు. బొత్స అనుచరులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా...వలసలు మాత్రం ఆపలేకపోతున్నారు. కోట్ల సుగుణాకరరావుకు జిల్లా వ్యాప్తంగా బంధుత్వాలు, విస్తృత పరిచయాలు ఉన్నాయి. సుగుణాకరరావు బాటలోనే మరికొందరు నేతలు పయనించే అవకాశం ఉంది.
చీపురుపల్లిలో మూడుసార్లు గెలిచిన బొత్స
బొత్స సత్యనారాయణకు చీపురుపల్లి నియోజకవర్గం పెట్టని కోట. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు మున్సిపల్ మంత్రిగా పని చేశారు. బొత్స సత్యనారాయణ ...బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1999లో ఎంపీగా గెలుపొందారు. 2004 నుంచి 2019 వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే...2014లో మాత్రమే ఓటమి పాలయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, రవాణా, మార్కెటింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో మూడు సార్లు గెలిచిన ఏకైక రాజకీయ నేత. రాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా ఎదిగారు. విజయనగరం జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ నియోజకవర్గాల్లో గెలుపొందాలన్న...బొత్స సత్యనారాయణ సపోర్టు తీసుకోవాల్సిందే. అంతలా విజయనగరం జిల్లాపై పట్టుబిగించారు.