AP RAKIA Arbitration : ఏపీపై రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ కేసులు ! అసలు వివాదాలేంటి ? బాక్సైట్, వాన్‌పిక్ పెట్టుబడులే కారణమా ?
రాకియా కేసులో ఆర్బిట్రేషన్‌కు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు లండన్ వెళ్లనున్నారు. ఫలితం లేకపోతే్ ప్రభుత్వం రూ. 600 కోట్లు చెల్లించాల్సి రావొచ్చు. వివాదానికి బాక్సైట్, వాన్‌పిక్ పెట్టుబడులే కారణమా ?
బాక్సైట్ సరఫరా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై లండన్‌లో అంతర్జాతీయ స్థాయి వివాదం ఉంది. దీనిపై ఆర్బిట్రేషన్ జరుగుతోంది. అక్కడకు విచారణకు హాజరయ్యేందుకు అధికారుల బృందాన్ని పంపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణియంచింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో ఐజీ సీహెచ్ శ్రీకాంత్, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి లండన్‌లో జరగనున్న ఆర్బిట్రేషన్‌కు హాజరుకానున్నారు. గల్ఫ్ దేశం అయిన రస్ అల్ ఖైమాతో అంతర్జాతీయ వివాద పరిష్కారం కోసం ఆ ఆర్బిట్రేషన్ జరుగుతోంది. సెప్టెంబరు 27 , నవంబర్ 15న రెండు సార్లు వెళ్లనున్నారు.
ఏమిటీ ఆర్బిట్రేషన్ - ఎందుకు వివాదం ?
పెన్నా గ్రూప్, రస్ అల్ ఖైమా సంయుక్తంగా అన్‌రాక్ అల్యూమినియం లిమిటెడ్‌ను 2007లో ఏర్పాటు చేసింది. తొలుత ఇందులో పెన్నా గ్రూప్ వాటా 70శాతం, రాకియా వాటా 30శాతం ఉండేది. 2012-13లో పెన్నా గ్రూప్ వాటా 87శాతం, రాకియా వాటా 13శాతంగా మార్పులు చేశారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లిలో అన్‌రాక్ పరిశ్రమ ఏర్పాటు చేసింది. అక్కడి ఏజెన్సీ ప్రాంతంలో ఏపీఎండీసీకి కేటాయించిన బాక్సైట్ లీజుల నుంచి ఖనిజాన్ని అన్‌రాక్‌కు సరఫరా చేయాల్సి ఉంది. అయితే బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగడంతో గత ప్రభుత్వం 2016లో అన్‌రాక్, ఏపీఎండీసీకి మధ్య ఉన్న బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా బాక్సైట్ లీజులను రద్దు చేస్తూ 2019లో ఉత్తర్వులిచ్చింది. దీంతో పెట్టుబడి నష్టపోయామంటూ రాకియా అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రూ. ఆరు వందల కోట్లను పరిహారంగా చెల్లించాలని రస్ అల్ ఖైమా ఇన్వెస్టిమెంట్ అధారిటి ..రాకియా డిమాండ్ చేస్తోంది. ఈ అంశంలో అంశంలో చర్చల కోసమే ఉన్నతాధికారులు లండన్‌కు వెళ్తున్నారు.
Also Read : ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్.. దేశంలో ఇది మూడోది..
రూ.600 కోట్లు కట్టాల్సిందేనా.. ప్రభుత్వ ఆలోచనలేంటి ?
రాష్ట్ర ప్రభుత్వం వివాద పరిష్కారం కోసం రూ. ఆరు వందల కోట్లు కట్టే పరిస్థితి లేదు. అందుకే రస్ అల్ ఖైమా సంస్థతో ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలపై మధ్యవర్తిత్వం కోసం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. నిజానికిఈ వివాదం మొదట కేంద్రానికే తెలిసింది. బాక్సైట్ ఖనిజం సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల తాము నష్టపోయామని, అందుకు భారత ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని రాకియానే కేంద్రానికి ఆర్బిట్రేషన్ నోటీసులు పంపింది. దీనిపై లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ సాగుతోంది. ఈ నోటీసులు అందడంతోనే పీఎంవో రాష్ట్ర అధికారులను పిలిపించి అప్పట్లో వివరాలు తీసుకున్నారు. అన్‌రాక్, ఏపీఎండీసీ మధ్య బాక్సైట్ సరఫరా వివాదం పరిష్కారానికి గతంలోనే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అందులో జుల్ఫీ రావ్జీ అనే వ్యక్తికి కూడా చోటు కల్పించింది. ఆయనను గల్ఫ్ దేశాల ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ హోదాలో ప్రభుత్వం నియమించింది. జుల్ఫీ కి సహాయకారిగా ఉండేలా... ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించిన పరిష్కార మార్గాలేమిటి ?
బాక్సైట్ సరఫరా ఒప్పందం రద్దు వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ నడుస్తున్నందున లండన్ ఆర్బిట్రేషన్‌ను నిలుపుదల చేయించాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ ల నుంచి బాక్సైటు ఖనిజాన్ని కేంద్రం సరఫరా చేస్తే ఈ ఆర్బిట్రేషన్ నుంచి తప్పించుకోవచ్చని ఏపీ భావిస్తోంది. ఆ మేరకు విజ్ఞప్తులు చేసింది. ఏపీ ప్రభుత్వం - రస్ అల్ ఖైమా మధ్య వివాదం అంతర్జాతీయం కావడంతో కేంద్రం కూడా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. విషయం దౌత్య వివాదంగా మారకుండా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇందు కోసం పరిష్కారా మార్గాలను కూడా సలహాల రూపంలో ఇచ్చింది. అన్‌రాక్ కంపెనీలో రాకియా వాటాను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలిపింది. దీనివల్ల సమస్య కొలిక్కి వస్తుందని స్పష్టం చేసింది.
రాకియా వాటా కొనలేమి స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం !
కేంద్ర ప్రభుత్వ సూచనను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఖనిజ కేటాయింపులు లేని అన్‌రాక్ పరిశ్రమలో రాకియా వాటా కొనుగోలు చేయబోమని తెలిపింది. ఒడిశాలోని నాల్కోకు ఏటా 10 మిలియన్ టన్నులు చొప్పున బాక్సైట్ కేటాయింపులు ఉన్నాయి. ఇందులో 7.5 మిలియన్ టన్నులు వినియోగిస్తుండటంతో, మిగిలిన 2.5 మిలియన్ టన్నులు అన్‌రాక్‌కు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. అలాగే ఎల్‌అండ్‌టీ సంస్థకు ఒడిశాలో పెద్ద ఎత్తున బాక్సైట్ లీజులు రిజర్వు చేశారు.వాటిని వాడటం లేదు. వాటిలో కొంత కేటాయించాలని కోరుతోంది. కానీ కేంద్రం మాత్రం అలా కేటాయించడం సాధ్యం కాదని వేలం వేసినప్పుడు పాడుకోమని తేల్చి చెప్పింది.
Also Read : డిసెంబర్ నుంచి గ్రామ సచివాలయాల తనిఖీ.. సీఎం జగన్ కీలక నిర్ణయం
వాన్‌పిక్ విషయంలోనూ న్యాయం కోసం రస్ అల్ ఖైమా పోరాటం !
రస్ అల్ ఖైమా అనే చిన్న దేశం, ఆ దేశ ప్రభుత్వ సంస్థ అయిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్స్ ..రాకియాతో ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ ప్రసాద్ వంటి వారు నిర్వహిచిన లావాదేవీలు సీబీఐ కేసుల వరకూ వెళ్లాయి. బాక్సైట్ విషయంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ జరుగుతూండగా.. అక్రమాస్తుల కేసుల్లో రస్ అల్ ఖైమా వివాదాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ పోర్టు ప్రాజెక్ట్ విషయంలో.. తమను మోసం చేశారని రస్ అల్ ఖైమా సంస్థ ఫిర్యాదు మేరకే సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడాది పాటు అక్కడ జైల్లో ఉండగా కరోనా కారణంగా బెయిల్ ఇవ్వడంతో స్వదేశానికి వచ్చారు. రస్ అల్ ఖైమా తో కలిసి నిమ్మగడ్డ ప్రసాద్ జాయింట్ వెంచర్‌గా వాన్‌పిక్‌ను ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వం 24 వేల ఎకరాలు కేటాయించింది. ఈ కేటాయింపుల తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో రూ.850 కోట్లనుపెట్టుబడులు పెట్టారు. కేసులు నమోదు కావడంతో ఆ ఒప్పందం ముందుకు సాగలేదు. దీంతో తమను నిమ్మగడ్డ ప్రసాద్ మోసం చేశారని రస్ అల్ ఖైమా చెబుతోంది. ఈ కేసు విషయం ఎక్కడ వరకూ సాగింతో ప్రస్తుతానికి అదనపు సమాచారం లేదు.
Also Read : ఈ ముగ్గురు మహిళా ఎంపీలు ఎవరో గుర్తు పట్టారా?