Bird Flu Death In AP: బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 సోకడంతో రెండేళ్ల చిన్నారి మృతి, ఏపీలో తొలి ఘటనతో ప్రభుత్వం అలర్ట్
Bird Flu H5N1 Virus | బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. మంగళగిరిలోని ఎయిమ్స్ లో చిన్నారి చనిపోయింది. ఏపీలో తొలి ఘటన కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది.

Andhra Pradesh News | మంగళగిరి: బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ ఘటన జరిగింది. బర్డ్ ఫ్లూ హెచ్5 ఎన్1 వైరస్ కారణంగానే చిన్నారి చనిపోయినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) నిర్ధారించింది. రోగనిరోదక శక్తి తక్కువగా ఉండడం, పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో చిన్నారి మరణం సంభవించినట్లు డాక్టర్లు గుర్తించారు. మార్చి 16 తేదీన చిన్నారి చనిపోగా శాంపిల్స్ కలెక్ట్ చేసి పరీక్షించిన తర్వాత బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఈ వైరస్ తో మనుషులు చనిపోవడం ఏపీలో ఇదే తొలిసారి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది.
అసలేం జరిగిందంటే..
పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారికి మార్చిలో జ్వరం వచ్చింది. ఆపై శ్వాస తీసుకోవడంలో సమస్య, జలుబు, విరేచనాలు, మూర్ఛ లాంటి లక్షణాలతో మార్చి 4న చిన్నారిని మంగళగిరిలోని ఎయిమ్స్‌కు కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. డాక్టర్లు వెంటిలేటర్ మీద ఉంచి బాలికకు మెరుగైన వైద్య చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో మార్చి 16న చిన్నారి మృతిచెందింది. చికిత్స చేస్తున్న సమయంలో బాలిక సమస్య ఏంటో గుర్తించేందుకు మార్చి 7న చిన్నారి గొంతు, ముక్కు నుంచి స్వాబ్ నమూనాలను సేకరించిన డాక్టర్లు ఎయిమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌లో పరీక్షించారు. మొదట అది ఇన్‌ఫ్లుయెంజా ఎ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
చిన్నారి పరిస్థితి విషమించడంతో మరో నమూనాను ఢిల్లీకి పంపి పరీక్షించారు. అక్కడ నివేదికలో సైతం క్లారిటీ రాలేదు. దాంతో భారత వైద్య పరిశోధన మండలి (ICMR) కు చిన్నారి మరణం అనంతరం మార్చి 24న స్వాబ్ నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు ఎయిమ్స్ డాక్టర్లు పంపించారు. చివరగా బాలిక అనారోగ్య సమస్య బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్‌గా నిర్ధారణ అయింది.
కుటుంబ సభ్యులు ఏం చెప్పారు..
వైద్యారోగ్య శాఖ అధికారులు చిన్నారి కుటుంబ సభ్యులను ఈ ఘటనపై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి వీధి కుక్కలు, పెంపుడు కుక్కలతో ఆడుకునేదని తెలిపారు. చికెన్ చేసే సమయంలో చిన్నారి అడిగిందని ఓ చిన్న ముక్క ఇచ్చాం. ఈ క్రమంలో ఫిబ్రవరి 28న జ్వరం వచ్చింది. అంతకు 2 రోజుల ముందు పచ్చి కోడి మాంసం చిన్నారి తిన్నట్లు కుటుంబం తెలిపింది. ఉడికించి వండిన చికెన్ తిన్న మిగతా కుటుంబసభ్యులకు ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని వైద్యశాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ కుటుంబం చికెన్ కొన్న చోట ఆ ప్రాంతలో మరెవరికి ఇలాంటి అనారోగ్య సమస్య తలెత్తలేదు, పల్నాడు జిల్లాలోనూ బర్డ్‌ఫ్లూ వైరస్ కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఐసీఎంఆర్ చేసిన టెస్టుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ కావడంతో వైద్యశాఖ అధికారులు మంగళవారం నరసరావుపేటకు వెళ్లి చిన్నారి కుటుంబసభ్యులతో పాటు స్థానికులను బర్డ్ ఫ్లూ, ఇతర అనారోగ్య సమస్యలపై విచారించారు. దాంతో చిన్నారి పచ్చి మాంసం చిన్న ముక్కట్లు తెలిపారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, పచ్చి మాంసం తినడమే పాప ప్రాణం తీసిందని తేలింది.






















