American Corner: ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్.. దేశంలో ఇది మూడోది.. ఇవాళ ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమెరికన్ కార్నర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ సీఎం జగన్.. దీనిని ప్రారంభించనున్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ ఇవాళ(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొంటారు.
దేశంలో ఇప్పటివరకు అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో మాత్రమే అమెరికన్ కార్నర్లు ఉన్నాయి. కొత్తగా విశాఖలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని సైన్స్ అండ్ టెక్నాలజీ భవనంలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కానుంది. అమెరికన్ కార్నర్‌లో విద్యార్థులతో పాటు వినూత్నమైన ఆలోచనలు కలిగిన యువతకు మార్గదర్శకంగా ఉండేలా కార్యచరణ చేస్తారు. వారంలో ఒకటి నుంచి రెండు కార్యక్రమాలను వర్చువల్ విధానంలో ప్రస్తుతానికి నిర్వహించనున్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులతో పాటు ఎవరైనా వచ్చి ఇక్కడ సేవలను పొందవచ్చు. అంతర్జాతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందేందుకు అనుగుణమైన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు.
ఏం చేస్తారంటే..
అమెరికన్ కార్నర్‌కు వచ్చే విద్యార్థులు... ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు అమెరికాలోని విభిన్న రంగాలకు చెందిన నిపుణులతో సలహాలు, సూచనలు అందిస్తారు. బిజినెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక, ఆర్థిక, ఐటీ రంగాలకు చెందిన నిపుణులు, యూఎస్ లెజిస్లేటివ్ సభ్యులు ఎప్పటికప్పుడు ఇక్కడకు వచ్చి విద్యార్థులనుద్దేశించి మాట్లాడతారు. ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలో చెబుతారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్.. అగ్రరాజ్యంలో వస్తున్న మార్పుల గురించి తెలుపుతారు. అమెరిన్ సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడ ప్రవర్తన ఎలా ఉండాలనే అంశాలపైనా సూచనలు చేస్తారు.
అమెరికాలోని.. ప్రధాన యూనివర్సిటీల్లో విద్యార్థులు.. సీట్లు పొందాలంటే ఎలా ప్రిపేర్ కావాల్సిన అంశాలను నిపుణులు వివరించడంతోపాటు అందుకు అవసరమైన సమాచారాన్ని అమెరికన్ కార్నర్లో పుస్తకాలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, యువతకు వీసాకు ఎదురయ్యే చిక్కులు, వాటినుంచి బయటపడడం, కన్సల్టెంట్ల నుంచి మోసపోకుండా ఉండడం, వీసాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలను కూడా తెలుపుతారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: CM Jagan Review : డిసెంబర్ నుంచి గ్రామ సచివాలయాల తనిఖీ.. సీఎం జగన్ కీలక నిర్ణయం
Also Read: Political Challenges : తెలుగు రాష్ట్రాల్లో సవాళ్ల సీజన్ ! అందరూ కాస్కోమంటారు.. ముందడుగు వేసేదెవరు ?