Amalapuram Riot Cases: అమలాపురం అల్లర్ల కేసులు ఎత్తేస్తామంటున్న ఎంపీ మిథున్ రెడ్డి, అందుకోసమేనా?
అమలాపురం అల్లర్ల కేసులను ఎత్తివేస్తామని ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. కేసుల్లో ఎక్కువగా యువకులు ఉండడం వల్ల వారి భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Amalapuram Riot Cases: అమలాపురం అల్లర్ల కేసులను త్వరలోనే ఎత్తేస్తాం అని ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే పలు సామాజిక వర్గ పెద్దలను తీసుకుని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఈ కేసులన్నిటికీ ముగింపు పలకబోతున్నామని వెల్లడించారు. కేసుల్లో ఎక్కువ మంది యువకులే ఉండడం వల్ల వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కేసులు ఎత్తేసేందుకు సీఎంను విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఎంపీ మిథున్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాళ్లరేవులో ఓ రిసార్ట్స్‌లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌తో పాటు పార్టీలోని పలువురు నాయకులతో సమావేశమైన మిధున్‌రెడ్డి అనంతరం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎప్పటి నుంచో ఎత్తివేస్తారని ప్రచారం..
అమలాపురం అల్లర్లు సంఘటన జరిగి దాదాపు పదకొండు నెలలు కావస్తోంది. సరిగ్గా ఇదే రోజున అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు లాంగ్‌మార్చ్ నిర్వహించారి. ఆరోజు నుంచి అమలాపురం అల్లర్లు జరిగిన మే 24వ తేదీ వరకు అమాలపురం కేంద్రంగా అనేక ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. మే 24న కోనసీమ జిల్లాకు అదే పేరు ఉంచాలని చేసిన ఉద్యమం అల్లర్లకు దారితీసింది. ఈసంఘటనకు సంబందించి నమోదైన కేసులు ఎత్తివేత గురించి అనేక ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. త్వరలోనే ఈ కేసులు ఎత్తివేస్తారని ప్రచారం జరిగినా ఈఅంశాన్ని పోలీసులు కొట్టివేశారు. అయితే స్వయంగా ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్, ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించడం ఇక కేసులు ఎత్తివేత లాంఛనమే అని తేలినట్లయ్యింది.
నష్టాన్ని పూడ్చుకోవాలనే ప్రయత్నమా..
అమలాపురం అల్లర్ల సంఘటన తరువాత వందలాది మందిని అరెస్ట్ చేసిన క్రమంలో ఈ కేసుల్లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే ఎక్కువగా అరెస్ట్ అయ్యారు. అయితే అందులో ఓ సామాజిక వర్గం వైసీపీకు అనుకూలమైన వర్గంగా ముద్ర ఉండగా.. వారు పార్టీకి దూరమయ్యారని, ఆ లోటును పూడ్చుకుని దూరమైన వారిని దగ్గర చేసుకునేందుకు కేసుల ఎత్తివేత వ్యూహమని పలువరు విశ్లేషిస్తున్నారు. అయితే కేసుల ఎత్తివేత వ్యవహారం దళిత వర్గాలను వైసీపీకి ఖచ్చితంగా దూరం చేస్తుందని మరికొంత మంది తమ వాదనను వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే మిథున్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి అల్లర్లలో ఇల్లును కోల్పోయిన రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాత్రం హాజరు కాలేదు.
అమలాపురం అల్లర్లతో అతలాకుతలం..
జిల్లాల పునర్విభజన తరువాత కోనసీమ ప్రాంతానికి మొదట కోనసీమ జిల్లా అని పేరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనగా అమలు చేసింది. అయితే కోనసీమలోని అంబేడ్కర్ వాదులంతా ఎప్పటి నుంచో తమ డిమాండ్‌గా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలన్న డిమాండ్‌తో మార్చి 7న లాంగ్ మార్చ్ నిర్వహించారు. దళిత సంఘాలు.. ఈ నిరసనకు వేలాదిగా తరలి వచ్చి తమ వాదనను బలంగా వినిపించడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడి కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసేందుకు ప్రిలిమినరీ నోటీస్ రిలీజ్ చేసి అభిప్రాయాలు కోరింది. దీంతో వివాదం రాజుకుంది. కోనసీమ జిల్లా సాధన సమితి పేరిట జేఏసీ ఏర్పడి ఉద్యమ కార్యచరణకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలోనే మే నెల 24న ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద ముట్టడికి పెద్ద ఎత్తున అమలాపురం చేరుకుంటున్న వారిని పోలీసు యంత్రాంగం కట్టడి చేసే ప్రయత్నం చేసింది. దీంతో రెచ్చిపోయిన నిరసన కారులు అమలాపురంలోని నల్లవంతెన మీదుగా కలెక్టరేట్ చేరుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్విన సంఘటనలో పలువురు పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారు.
ఆ తర్వాత కలెక్టరేట్ వద్దకు వేలాదిగా చేరుకుని అక్కడ నిరసన చేపట్టారు. అక్కడ పార్కింగ్ చేసిన ఓ ప్రైవేటు కాలేజ్ బస్సును ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. దీంతో అల్లరి మూకలు చెలరేగి అక్కడి నుంచి నేరుగా మంత్రి విశ్వరూప్ ఇంటికి చేరుకుని మంత్రి ఇంటికి నిప్పుపెట్టారు. ఆ తర్వాత ఎర్ర వంతెన వద్ద రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పు పెట్టారు. సమీపంలోనే ఉన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి నిప్పుపెట్టి ఆ తర్వాత నూతనంగా నిర్మిస్తున్న విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. కేవలం గంట వ్యవధిలో అల్లర్లు చెలరేగి విధ్వంసకాండ జరగ్గా సాయంత్రం 7 గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. వారం రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ఆ తర్వాత కూడా పోలీసు ఆంక్షల మధ్య నెల రోజుల పాటు అమలాపురం కొనసాగింది. దాదాపు నెల రోజుల పాటు ఇంటర్‌నెట్ సేవలను నిలిపి వేశారు. ఈ అల్లర్లలో సంబందమున్న 250 మందిని అరెస్ట్ చేశారు. నేటికీ ఈ కేసు దర్యప్తు జరుగుతుండగా 50 మంది వరకు పరారీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా అమలాపురం అల్లర్ల గోడవ సంచలనం రేకెత్తించింది.