ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
Kashmir Terrorist Attack | ఈ దేశానికి ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోదీనే అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అధిష్టానం తీరు ఒకలా, షర్మిల తీరులా మరొలా ఉందని విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొత్త వివాదానికి తెర తీశారు. ఈ దేశానికి అంతర్గత శత్రువు ప్రధాని మోదీ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన YS షర్మిల అనంతరం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కాశ్మీర్ లో దాడులకు మోదీనే బాధ్యత వహించాలి : YS షర్మిల
కాశ్మీర్లో ప్రభుత్వం, భద్రతా లోపాల వల్లనే ఇంత పెద్ద మారణకాండ జరిగిందని YS షర్మిల రెడ్డి అన్నారు. ఉగ్రవాదులు వచ్చి ఇంత మంది టూరిస్ట్ లను చంపుతూ ఉంటే కనీసం అడ్డుకునేవాళ్ళు లేకుండా పోయారని, మోడీ చెప్పుకునే చౌకీదార్ (కాపలా ) తనం ఇదేనా అంటూ ఆమె మండిపడ్డారు. కాశ్మీర్లో టెర్రరిజం లేదంటూ టూరిజం ని పెద్దగా ప్రమోట్ చేశారని దాన్ని నమ్మి భారీగా వెళ్లిన పర్యాటకులు ఇలా తీవ్రవాదుల చేతుల్లో మృత్యువాత పడ్డారని దీనికి పూర్తి బాధ్యత మోడీ, అమిత్ షా వహించాలి అని షర్మిలన్నారు. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యమన్న షర్మిల బిజెపి ప్రభుత్వం తనను విమర్శించిన వాళ్లపైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ను ఉపయోగిస్తుందని.. ప్రజల భద్రత ను మాత్రం గాలికి వదిలేస్తుందని అన్నారు. ముస్లిం మైనారిటీల మీద మతం పేరుతో యుద్ధం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
షర్మిల టీం సరైన ఇన్ పుట్స్ ఇవ్వడం లేదా
పైన చేసిన విమర్శల వరకు బానే ఉంది కానీ " ఈ దేశానికి అంతర్గత టెర్రరిస్ట్ ప్రధాని మోదీ " అంటూ షర్మిల చేసిన వ్యాఖ్య మాత్రం తీవ్రంగా వివాదాస్పదమవుతోంది. ఒక పక్కన కాంగ్రెస్ అధినాయకత్వం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉగ్రవాద దాడికి బదులు చెప్పే దిశగా మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని తెలిపిన సంగతి షర్మిల టీం ఆమెకు తెలియపరచలేదా.. లేదా రాంగ్ ఇన్పుట్ ఇచ్చారా అనేది ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ.
ఇటీవల తనకంటూ వైయస్ షర్మిల ఒక టీంని ఢిల్లీలో నియమించుకున్నారన్న ప్రచారం ఉంది. మరి వాళ్ళ నుంచి రాంగ్ మెసేజ్ వెళ్ళిందా.. లేక షర్మిల కావాలనే ఇలా మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు తమ నాయకుడు ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేసిన షర్మిలపై రాష్ట్ర బిజెపి నాయకులు భగ్గుమంటున్నారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.





















