Viral News: ఏం గుండెరా అది.. తాను ప్రేమించిన యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న మరో యువకుడు
Telangana News | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించాడు. పెద్దలకు చెప్పి ఒప్పించి మరీ ఒకే వేదికలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.

Kumuram Bheem Asifabad District | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలను ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత మార్చి నెల 27న లింగాపూర్ మండలంలోని ఘుంనూర్ గ్రామానికీ చెందిన సిడాం సూర్యదేవ్, జలకర్ దేవి, లాల్ దేవి అనే ఇద్దరమ్మాయిలను ఒకే మండపంలో పెళ్లి చేసుకోవడం తెలిసిందే. పెద్దల సమక్షంలో వీరి వివాహా వేడుక ఘనంగా జరిగింది. ఆ మధ్య ఏపీలోని సత్యసాయి జిల్లాలోనూ కర్ణాటకకు చెందిన ఇద్దరు అమ్మాయిలతో వివాహానికి యువకుడు సిద్ధం కాగా పోలీసులు షాకిచ్చారు. వెడ్డింగ్ కార్డు వైరల్ కావడంతో వివరాలు ఆరాతీసిన పోలీసులకు అమ్మాయిలు మైనర్లు అని తెలియడంతో ఆ పెళ్లిని ఆపివేశారు.
తాజాగా ఇలాంటి వివాహామే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని అడ్డేసరా గ్రామానికి చెందిన ఆత్రం ఛత్రుషవ్ అనే యువకుడు జంగుబాయి, సోన్ దేవీ అనే ఇద్దరు యువతులను ప్రేమించాడు. వారి కుటుంబ సభ్యులను ఒప్పించి తాజాగా ఇద్దరిని ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు. ఆదివాసి సాంప్రదాయాలతో డోలు, సన్నాయి వాయిద్యాల నడుమ తమ ఆచార వ్యవహారాలతో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.

గత నెల 27న ఇద్దరమ్మాయిలను ఓ యువకుడు ఓకే మండపంలో వివాహం చేసుకోగా... నేడు తాజాగా మరోసారి జిల్లాలో ఇలాంటి వివాహమే జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ యువకుడు ఇద్దరమ్మాయిలను బాగా చూసుకుంటానని, వారితో ఇక్కడే క్షేమంగా కాపురం కొనసాగిస్తానని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.

గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు వీరి వివాహంలో వారికి తమ సాంప్రదాయ ఆచారాలతో కూడిన పెళ్లి వేడుక కార్యక్రమాలు నిర్వహించి, దూప దీప నైవేద్యం తమ సాంప్రదాయ దేవుళ్లకు సమర్పించి వివాహాన్ని జరుపుకున్నారు. ఈ వివాహ వేడుకకు వచ్చిన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఈ నూతన వధూవరులను ఆశీర్వదించారు. జిల్లాలో రెండోసారి ఇలాంటి వివాహం చూసి జిల్లా ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.





















