కేంద్ర విదేశాంగ శాఖ ఆయన అమెరికా పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించింది. దీంతో సీఎం తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని తిరిగి రావాల్సి వచ్చింది.
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
రేవంత్‌రెడ్డి ‘తెలంగాణ రైజింగ్’ పర్యటనలో అమెరికా టూర్‌కు కేంద్రం రాజకీయ క్లియరెన్స్ నిరాకరించింది. లండన్‌లో ఉండగానే నిర్ణయం రావడంతో కేంద్రం–రాష్ట్రం మధ్య రాజకీయ చర్చ మొదలైంది

- తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరణ.
- లండన్‌లో ఉండగా నిరాకరణతో సీఎం టూర్ మధ్యలోనే ముగింపు.
- రాజకీయ క్లియరెన్స్ నిరాకరణ వెనుక ప్రోటోకాల్, రాజకీయ ఉద్దేశం చర్చ.
- గతంలోనూ ఇలాంటి సంఘటనలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ప్రభావం.
లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
అమెరికా పర్యటనకు రాజకీయ క్లియరెన్స్ నిరాకరణతో రేవంత్‌రెడ్డి టూర్ మధ్యలోనే ముగింపు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన పది రోజుల ‘తెలంగాణ రైజింగ్’ విదేశీ పర్యటన అనూహ్య మలుపు తిరిగింది. బ్రిటన్ పర్యటన సజావుగా సాగినా.. అమెరికా పర్యటనకు కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడంతో సీఎం టూర్ మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. శుక్రవారం లండన్‌లో ఉన్న తెలంగాణ ప్రతినిధి బృందానికి కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ఈ సమాచారం అందింది. అమెరికా పర్యటనకు “క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డినైడ్” అంటూ స్పష్టంగా చెప్పింది.
అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్, న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. హార్వర్డ్, ఎంఐటీ, నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో సమావేశాలు, ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. చివర్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలోనూ రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాలకు సీఎం దూరమయ్యారు.
పర్యటన లక్ష్యం..
రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలకు సంబంధించిన కార్యక్రమంగానే ప్రచారం చేసింది. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో తెలంగాణను అనుసంధానం చేయడం, రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అవకాశాలు కల్పించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎంవో చెబుతోంది. జాతీయ విద్యా విధానం స్ఫూర్తితోనే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్, స్కిల్లింగ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ పర్యటనను రూపొందించింది.
అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. అయినా కేంద్రం నిర్ణయాన్ని అక్కడికక్కడే సవాల్ చేయకుండా భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.
ప్రొటోకాల్ నిర్ణయమా? రాజకీయ నిర్ణయమా?
వాస్తవానికి ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు కేంద్రం నుంచి రాజకీయ క్లియరెన్స్ తీసుకోవడం కొత్తేమీ కాదు. విదేశాల్లో భారత ఉన్నతస్థాయి నేతలకు దక్కాల్సిన అధికారిక మర్యాదలకు అది కీలకం. అదే సమయంలో ఆ అధికారిక హోదాలో వారి ప్రతీ కార్యక్రమం, స్టేట్మంట్ కూడా భారత విదేశాంగ శాఖకు అంతే ప్రాధానం.
రేవంత్‌రెడ్డి పర్యటనలో బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చి.. అమెరికా పర్యటనకు మాత్రమే క్లియరెన్స్ నిరాకరించడం కాంగ్రెస్‌కు ప్రధాన అస్త్రంగా మారింది. అమెరికా పర్యటనను ముందుగానే అడ్డుకుని ఉంటే ఈ స్థాయిలో ఇబ్బంది ఉండేది కాదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ వేదికపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటనను చివరి నిమిషంలో అడ్డుకోవడం వెనుక ప్రొటోకాల్ కంటే రాజకీయ ఉద్దేశమే ఎక్కువగా ఉందన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి.
2015 నాటి ఓటుకు నోటు కేసులో రేవంత్ పై విచారణ కొనసాగుతోంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక ఏసీబీ కోర్టు ఈ నెల 6న రేవంత్‌రెడ్డి పాస్‌పోర్టును విదేశీ పర్యటన కోసం విడుదల చేసింది. అయితే విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కేంద్రం నుంచి రాజకీయ క్లియరెన్స్ పొందాలని, సెప్టెంబర్ 18లోపు పాస్‌పోర్టును తిరిగి కోర్టుకు సమర్పించాలని షరతు విధించింది.
రేవంత్ ఒక్కరే కాదు.. మమత, కేజ్రివాల్, పీటీఆర్ ఇంకా చాలా మంది.
రేవంత్‌రెడ్డి పర్యటనకు క్లియరెన్స్ నిరాకరణ ఇప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తున్నా.. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి.
2019లో ప్రపంచ మేయర్ల సదస్సు కోసం డెన్మార్క్ పర్యటనకు వెళ్లాలనుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్,2022 లో ప్రపంచ శాంతి సదస్సు, రోమ్ వెళ్లాలనుకున్న మమతా బెనర్జీ లకు కూడా ఆ సమావేశాలు ముఖ్యమంత్రి స్థాయికి చాలా చిన్నవి అన్న కారణంతో భారత విదేశాంగ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించింది.
కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే 2025లో యూరప్ పర్యటనలో ఉండగానే అమెరికా వెళ్లేందుకు కేంద్రం నుంచి క్లియరెన్స్ రాలేదు. పారిస్ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది. తమిళనాడు మాజీ ఐటీ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ విషయంలోనూ ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. 2023లో ఎంఐటీ, హార్వర్డ్, కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ప్రసంగించేందుకు ఆహ్వానం వచ్చినా.. బయలుదేరడానికి సుమారు 12 గంటల ముందు కేంద్రం నుంచి క్లియరెన్స్ నిరాకరణ వచ్చింది.
విదేశీ పర్యటనలకు రాష్ట్ర అవసరాలు ఏలావున్నా.. కేంద్రం మాత్రం ప్రొటోకాల్, జాతీయ ప్రయోజనాలు, దౌత్యపరమైన సమన్వయం వంటి కారణాలతో నిర్ణయాలు తీసుకుంటుంది. దౌత్యపర సమాచార గోప్యత కారణంగా అవి వెళ్లడి కావు. అందుకే రాజకీయ అనుమానాలకు అవకాశం ఏర్పడుతోంది.
భారత్–అమెరికా సంబంధాల నేపథ్యంలోనూ చూడాల్సిందే
రేవంత్‌రెడ్డి పర్యటన వివాదాన్ని భారత్–అమెరికా సంబంధాల ప్రస్తుత పరిస్థితి నుంచి పూర్తిగా వేరు చేసి చూడలేం. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, టారిఫ్‌లు, అమెరికా చేపడుతున్న సెక్షన్ 301 దర్యాప్తులు వంటి అంశాల నేపథ్యంలో సంబంధాలు సున్నితమైన దశలో ఉన్నాయి.
ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి అమెరికా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సమావేశమవడం వాణిజ్య దౌత్యం కాకపోవచ్చు. అయినా అది భారతదేశం నుంచి అమెరికన్ ప్రేక్షకులకు వెళ్లే ఒక అధికారిక సందేశమే. కేంద్రం దౌత్యపరమైన సమన్వయాన్ని కోరుకోవడం ఒక కోణం. కానీ ఆ సమన్వయం పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలను ఎంతవరకు నియంత్రించాలి అన్నది మరో ప్రశ్న. ఇదే ఇప్పుడు అసలు రాజకీయ వివాదంగా మారింది.
వాట్ నెక్స్ట్..??
రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లకపోయినా అధికారుల బృందం అక్కడి కార్యక్రమాలను కొనసాగించనుంది. కానీ రాజకీయంగా మాత్రం ఈ వ్యవహారం ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ దీన్ని కేంద్రం రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందన్న వాదనకు ఉపయోగించుకోవచ్చు. బీజేపీ మాత్రం ఇది సాధారణ క్లియరెన్స్ ప్రక్రియలో భాగమేనని చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, కేరళలో గతంలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనలను కాంగ్రెస్ ఒకే వరుసలో పెట్టి ప్రస్తావించే అవకాశం ఉంది.
చివరకు ఈ వివాదం ప్రొటోకాల్ అంశంగా మిగిలిపోతుందా? లేక కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో మరో రాజకీయ ఆయుధంగా మారుతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.
కేంద్రం నుంచి మరింత స్పష్టమైన వివరణ వస్తే తప్ప ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం దొరకడం కష్టం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం.. లండన్‌లో మొదలైన ఈ పర్యటన, హైదరాబాద్‌కు తిరిగొచ్చేసరికి మరో కేంద్ర–రాష్ట్ర రాజకీయ వివాదానికి కారణమైంది.
Frequently Asked Questions
రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఎందుకు రద్దయింది?
సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడల ప్రోత్సాహమే ఈ పర్యటన లక్ష్యం. ప్రముఖ విశ్వవిద్యాలయాలతో తెలంగాణను అనుసంధానించి, యువతకు అంతర్జాతీయ శిక్షణ అవకాశాలు కల్పించాలనుకున్నారు.
అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ సమాచారం రేవంత్‌రెడ్డికి ఎక్కడ అందింది?
బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆయన లండన్‌లో ఉన్నప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ నుండి ఈ సమాచారం అందింది. బ్రిటన్ పర్యటన సజావుగా సాగింది.
గతంలోనూ ముఖ్యమంత్రులు/మంత్రులకు విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయా?
అవును, గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు కర్ణాటక, తమిళనాడు మంత్రులకు కూడా కేంద్రం క్లియరెన్స్ నిరాకరించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















