Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Defected MLAs Protection Dilemma: ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయింది. అటు కాంగ్రెస్ లో ఉండలేరు.. ఇటు బీఆర్ఎస్‌లోకి మళ్లీ పోలేరు.

BRS Jumped MLAs Regret Joining Congress: తెలంగాణ రాజకీయాల్లో గత రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ వీడి అధికార కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు అటు ఇటు కాకుండా తయారైందనే చర్చ గాంధీ భవన్, తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు, ఆ తర్వాత తాము గెలిచిన నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికో, పవర్ సెంటర్‌కు దగ్గరగా ఉండటానికో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వంటి కీలక నేతలు గులాబీ జెండా పక్కనపెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే, రెండేళ్లు గడిచేసరికి.. అధికార పార్టీలో చేరి పెద్ద తప్పు చేశామా అనే ఆవేదన వారిలో కనిపిస్తోంది.
కాంగ్రెస్ నాయకత్వం ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనుకున్న స్థాయిలో రాజకీయ భద్రతగానీ, న్యాయపరమైన రక్షణగానీ కల్పించలేకపోయిందనేది ప్రధాన ఆరోపణ. వారు కాంగ్రెస్ లో చేరలేదని చెప్పి అనర్హత వేటు నుంచి తప్పించారు కానీ.. రాజకీయంగా గ్యారంటీ ఇవ్వలేకపోయారు. ఈ పరిణామం వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద రాజకీయ నష్టం వాటిల్లింది. పార్టీలో చేరితే రాజభవనం లాంటి గౌరవం ఇస్తాం, పదవులిస్తాం అని నమ్మబలికి పిలుచుకున్న పెద్దలు.. తీరా న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకాగానే తమను ఒంటరిని చేశారనే భావన ఫిరాయింపు నేతల్లో బలపడింది. దానం నాగేందర్ వంటి నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కడం, అరికెపూడి గాంధీ వంటి వారు సాంకేతికంగా తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్పుకోవాల్సిన స్థితి రావడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడటంతో, ఈ నేతలకు ఏ రకమైన మంత్రిపదవులు గానీ, సమర్థవంతమైన రాజకీయ రక్షణగానీ కల్పించలేకపోయింది.
ఈ ఉదంతం తెలంగాణ వ్యాప్తంగా ఒక బలమైన పొలిటికల్ మెసేజ్‌ను పంపించింది. ఇకపై బీఆర్ఎస్ నుంచి గానీ, ఇతర పార్టీల నుంచి గానీ కాంగ్రెస్‌లోకి చేరేందుకు ఏ నేతా సాహసించే పరిస్థితి లేకపోవడం అసలు సిసలైన పరిణామం. రాజకీయ భవిష్యత్ కోల్పోతామనే భయం మిగిలిన నేతలకు స్పష్టంగా అర్థమైపోయింది. దీంతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి రాకపోకలు దాదాపుగా స్తంభించిపోగా, రాబోయే రోజుల్లో న్యాయపరమైన తీర్పుల ఆధారంగా లేదా రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్ నుంచి తిరిగి పాత గూటికి లేదా బీజేపీ వైపు వాళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు.
క్షేత్రస్థాయిలో అసమ్మతి కూడా ఈ నేతల మెడకు చుట్టుకుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన పాత నాయకులు, టికెట్లు ఆశించి భంగపడిన స్థానిక నేతలు ఈ గులాబీ వలసదారులను తమ నియోజకవర్గాల్లో కలుపుకుపోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఫలితంగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్‌లో ఇమడలేక, అటు బిఆర్ఎస్‌కు ముఖం చూపించలేక తీవ్ర మానసిక నలిగిపోతున్నారు. ప్రభుత్వం వద్ద తమ పనులు కాకపోవడం, అధికారులపై పట్టు తగ్గడంతో సొంత కేడర్‌ను కూడా కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో కాంగ్రెస్ అనుసరించిన అరకొర వ్యూహం ఆ పార్టీకే ఎదురుదెబ్బగా మారింది. చట్టపరమైన లొసుగులను సరిగ్గా అంచనా వేయకుండా, కేవలం సంఖ్యాబలం ప్రదర్శించాలనే తొందరపాటులో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఫిరాయింపు నేతల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















