Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Telangana Politics: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒక్కరూ హ్యాపీగా లేరు. చట్టబద్ధమైన గుర్తింపు లేక, నిధులు రాక రెంటికి చెడ్డ రేవడిలా వారి పరిస్థితి గందరగోళంలో ఉంది.

Anti Defection Law: తెలంగాణ రాజకీయాల్లో గోడ దూకిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి.. వెనుక గొయ్యి లా తయారైంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి తమ నియోజకవర్గాలను డెవలప్ చేసుకుందామనో, లేక రాజకీయ భవిష్యత్తును సురక్షితం చేసుకుందామనో భావించి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రస్తుతం సంతోషంగా లేరనేది పొలిటికల్ వర్గాల్లో సాగుతున్న ప్రచారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వంటి కొందరు నేతలు తమ ఆవేదనను బహిరంగంగానే వెళ్లగక్కుతుండగా, మిగిలిన వారు లోలోపల రగిలిపోతూ ఉక్కపోతకు గురవుతున్నారు.
ఈ ఎమ్మెల్యేల ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన మూలకారణం.. వీరిని కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా, చట్టబద్ధంగా, అధికారికంగా తమలో విలీనం చేసుకోలేకపోవడమే. వీరు కాంగ్రెస్‌లో చేరలేదని స్పీకర్ తీర్పిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యేలు అయితే మా పార్టీ సమావేశాల్లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నిస్తోంది. కోర్టులు, ఎన్నికల సంఘం లేదా సాంకేతిక విచారణల ముందుకు వచ్చినప్పుడు.. మేము కాంగ్రెస్‌లో చేరలేదు, కేవలం మా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కోసమే ముఖ్యమంత్రిని వినతిపత్రాలతో కలిశాం అని స్వయంగా వాంగ్మూలాలు ఇచ్చుకోవాల్సిన విచిత్రమైన, ఆత్మవంచన చేసుకునే పరిస్థితి వీరికి ఏర్పడింది.
అటు స్థానం పోయే.. ఇటు హోదా రాక!
కాంగ్రెస్‌లో అనధికారికంగా చేరడం వల్ల వీరు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో దశాబ్దాలుగా అనుభవించిన హోదా, హక్కులు, కార్యకర్తలపై ఉన్న పట్టును పూర్తిగా కోల్పోయారు. మరోవైపు, అధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనే ముద్ర పడకపోవడంతో ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యతా లభించడం లేదు. ఇటు బిఆర్‌ఎస్‌పై హక్కు లేక, అటు కాంగ్రెస్‌లో చట్టబద్ధమైన గుర్తింపు రాక రాజకీయంగా వీరు పూర్తిగా ‘రెంటికి చెడ్డ రేవడి’లా మారిపోయారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికార పార్టీలో చేరితే నియోజకవర్గానికి వందల కోట్ల నిధులు వస్తాయని, పనులు శరవేగంగా జరుగుతాయని ఆశించిన ఈ నేతలకు నిరాశే ఎదురవుతోంది. సొంత కాంగ్రెస్ నియోజకవర్గాలకే నిధుల కొరత వేధిస్తున్న తరుణంలో, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లభించడం లేదు. చివరకు తమ నియోజకవర్గాల చిన్న చిన్న పనుల కోసం మంత్రులను, అధికారులను కలవాలన్నా, లేదా చివరకు నిధుల కోసం ఫోన్ చేసినా అధికారులు, కాంగ్రెస్ పెద్దలు ఫోన్లు ఎత్తడం లేదని సదరు ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు.
పటాన్‌చెరు మోడల్.. మిగిలిన వారి ఆవేదన!
ఈ పది మందిలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వంటి వారు పరిస్థితి తీవ్రతను ముందే గ్రహించి, మెల్లగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరమై తిరిగి బీఆర్ఎస్ వైపు అడుగులు వేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించారు. కానీ, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, ప్రకాష్ గౌడ్ వంటి మిగిలిన నేతలు ఇటు వెనక్కి వెళ్లలేక, అటు ముందుకూ సాగలేక తీవ్రమైన మానసిక సంఘర్షణను అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ కేడర్ కూడా వీరిని తమ సొంత నేతలుగా స్వీకరించకపోవడం, పాత కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టడం వీరి పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది.
రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?
సొంత పార్టీని వీడి అధికార పక్షంలోకి వెళ్తే అన్నీ బాగుంటాయని అనుకున్న ఈ ఎమ్మెల్యేలకు ప్రస్తుత పరిణామాలు ఒక పెద్ద రాజకీయ పాఠంగా మారాయి. ప్రజామోదం పొందిన పార్టీకి దూరమై, సాంకేతిక చట్టాల చిక్కుల్లో పడి, అధికారంలో ఉన్న పార్టీ నుంచి సరైన గుర్తింపు పొందని ఈ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో పడిపోయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















