Speaker Gaddam Prasad Kumar: పోచారం, కాలె యాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే - అనర్హతా పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
Telangana Assembly Speaker: పోచారం, కాలె యాదయ్య పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ వారిపై అనర్హతా పిటిషన్లు కొట్టేశారు. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించారు.

Telangana Assembly Speaker dismissed disqualification petitions: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. వీరు పార్టీ మారినట్లుగా సరైన ఆధారాలు సమర్పించడంలో ఫిర్యాదుదారులు విఫలమయ్యారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. వారు కేవలం ముఖ్యమంత్రిని నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం కలిశారని, సాంకేతికంగా వారు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నారని స్పీకర్ స్పష్టం చేశారు.
ఇప్పటికే ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్
ఇదే తరహాలో గత నెలలో స్పీకర్ మరో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి లపై ఉన్న అనర్హత పిటిషన్లను కూడా స్పీకర్ కొట్టివేశారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బలమైన సాక్ష్యాధారాలు లేవని, వారు అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నట్లు లేదా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నట్లు రుజువులు లేవని స్పీకర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
మరో ముగ్గురిపై నిర్ణయం పెండింగ్
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందగా, ఇప్పటివరకు ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం రావాల్సి ఉంది. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కేసుపై ప్రత్యేకంగా విచారణ జరుగుతోంది. వీరి ముగ్గురి విషయంలో విచారణ ఇంకా కొనసాగుతోందని, త్వరలోనే తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.
న్యాయపోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం
స్పీకర్ వరుసగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా పిటిషన్లను కొట్టివేయడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఈ నిర్ణయాలు వెలువరించగా, ఇప్పుడు ఈ తీర్పులను సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించాలని బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా పార్టీ కండువాలు కప్పుకున్న దృశ్యాలు ఉన్నప్పటికీ ఆధారాలు లేవనడంపై వారు న్యాయపోరాటానికి సిద్ధం కావాలని నిర్ణయించారు.





















